Jairam Ramesh: చైనాకు క్లీన్‌చిట్ ఎందుకు ఇచ్చారు.. కేంద్రాన్ని ప్రశ్నించిన జైరాం రమేష్
ABN , Publish Date - Aug 04 , 2025 | 07:07 PM
తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్ధించు అనే విధానాన్ని ఐదేళ్లుగా కేంద్రం అనుసరిస్తోందని జైరాం రమేష్ విమర్శించారు. ప్రజలు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడానికి బదులుగా జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటోందన్నారు.

న్యూఢిల్లీ: చైనాతో భారత సరిహద్దుల నిర్వహణలో కేంద్రం తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ (Jairam Ramesh) విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం 'డిడీఎల్‌జే' (DDLJ) పాలనీని అనుసరిస్తోంది తప్పుపట్టారు. 'తిరస్కరించు, దృష్టి మరల్చు, అబద్ధం చెప్పు, సమర్ధించు' (Deny, Distract, Lie, Justify) అనే విధానాన్ని ఐదేళ్లుగా కేంద్రం అనుసరిస్తోందన్నారు. ప్రజలు లేవనెత్తిన ప్రశ్నకు సమాధానాలు ఇవ్వడానికి బదులుగా జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటోందని విమర్శించారు.
2020 జూన్ 15న గల్వాన్‌లో 20 మంది సైనికులు అమరులైనప్పటి నుంచి దేశభక్తి కలిగిన ప్రతి భారతీయుడు అనేక ప్రశ్నలు లేవనెత్తారని అన్నారు. వాటికి జవాబులు చెప్పడానికి బదులు మోదీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా డీడీఎల్‌జే విధానంతో నిజాన్ని కప్పిపుచ్చుతోందని జైరాం రమేష్ విమర్శించారు. గల్వాన్‌లో దేశం కోసం వీరజవాన్లు ప్రాణం త్యాగం చేసిన నాలుగు రోజుల తర్వాత 2020 జూన్ 19న చైనాకు ప్రధాన మంత్రి ఎందుకు క్లీన్‌చిట్ ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. మన భూభాగంలోకి ఎవరూ చొరబడలేదని చైనాకు మోదీ క్లీన్ చిట్ ఇచ్చారని జైరాం రమేష్ ఆక్షేపణ తెలిపారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత చైనాకు పాక్ బహిరంగంగా మద్దతు ప్రకటించినా మోదీ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు.
చైనా 2 వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని ఆక్రమించిందని చేసిన వ్యాఖ్యలకు సంబంధించి రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు సోమవారంనాడు ఆగ్రహం వ్యక్తం చేసిన కొద్ది గంటలకే జైరాం రమేష్ తాజా వ్యాఖ్యలు చేశారు. చైనా ఆక్రమించిన విషయం మీకెలా తెలుసు? అని రాహుల్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. మీరు అక్కడ ఉన్నారా? మీ దగ్గర ఏమైనా నమ్మదగిన ఆధారాలు ఉన్నాయా? నిజమైన భారతీయులైతే అలా మాట్లాడరు కదా? అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది.
ఇవి కూడా చదవండి..
గల్వాన్ వ్యాలీ వివాదంలో రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్
రాష్ట్రపతితో మోదీ, అమిత్‌షా సమావేశం వెనుక కారణం ఇదేనట
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి