Congress on Shashi Tharoor: ఆడ్వాణీకి శశిథరూర్ ప్రశంసలపై కాంగ్రెస్ స్పందనిదే
ABN , Publish Date - Nov 09 , 2025 | 09:28 PM
ఆడ్వాణీ 98వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శశిథరూర్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆడ్వాణీని కలిసిన పాత పోటోను పోస్ట్ చేస్తూ, ప్రజాసేవ పట్ల ఆడ్వాణీకి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు.
న్యూఢిల్లీ: బీజేపీ అగ్రనేత లాల్‌కృష్ణ ఆడ్వాణీ (LK Advani)ని శశిథరూర్ (Shashi Tharoor) ప్రశంసించడంపై కాంగ్రెస్ స్పందించింది. శశిథరూర్ వ్యాఖ్యలు పూర్తిగా ఆయన వ్యక్తిగతమని, పార్టీకి సంబంధం లేదని తెలిపింది.

ఎప్పటిలాగానే డాక్టర్ శశిథరూర్ తన వ్యక్తిగత అభిప్రాయాన్నే చెప్పారని, ఇటీవల కాలంలో ఆయన చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ మీడియా, పబ్లిసిటీ డిపార్ట్‌మెంట్ హెడ్ పవన్ ఖేడా (Pawan Khera) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ఎంపీగా, సీడబ్ల్యూసీ సభ్యుడిగా ఆయన (శశిథరూర్) ఇలా మాట్లాడటం పార్టీలోని ప్రజాస్వామ్య, ఉదారవాద స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని అన్నారు.
శశిథరూర్ ఏమన్నారంటే..
ఆడ్వాణీ 98వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శశిథరూర్ సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలిపారు. ఆడ్వాణీని కలిసిన పాత పోటోను పోస్ట్ చేస్తూ, ప్రజాసేవ పట్ల ఆడ్వాణీకి ఉన్న అంకితభావాన్ని ప్రశంసించారు. కేవలం ఒక సంఘటన ఆధారంగా దశాబ్దాలుగా ఆయన చేసిన ప్రజాసేవను తక్కువగా అంచనా వేయకూడదన్నారు. చైనా దాడితో నెహ్రూజీని, ఎమర్జెన్సీతో ఇందిరాగాంధీని ఏవిధంగా తక్కువ చేయలేమో ఆడ్వాణీ విషయంలోనూ అంతేనని పేర్కొన్నారు. కాగా ఆడ్వాణీని శశిథరూర్ ప్రశంసించడంపై సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే ఘాటుగా స్పందించారు. ఆడ్వాణీపై రచయిత-జర్నలిస్టు కుష్వంత్ సింగ్ గతంలో చేసిన 'డ్రాగెన్ సీడ్స్ ఆఫ్ హేట్రెడ్' వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, విద్వేష విత్తనాలు నాడడం ప్రజాసేవ కాదని శశిథరూర్ వ్యాఖ్యలను తప్పుపట్టారు.
ఇవి కూడా చదవండి..
ఒక్క కారణంతో ఆయన సేవలు తగ్గించడం సరికాదు.. ఆడ్వాణీపై శశిథరూర్ ప్రశంసలు
హిందూ ధర్మం కూడా ఎక్కడా నమోదు చేసుకోలేదు.. ఆర్ఎస్ఎస్ చట్టబద్ధతపై మోహన్ భాగవత్
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి