CM Stalin: నోరు జారొద్దు.. వివాదం చేయొద్దు
ABN , Publish Date - Jul 18 , 2025 | 10:42 AM
దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజర్‌పై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడి అనవసరమైన వివాదాలను సృష్టించవద్దంటూ పార్టీ శ్రేణులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ హితవు పలికారు. ఈ మేరకు గురువారం స్టాలిన్ తన ఎక్స్‌పేజీలో ఓ ప్రకటన విడుదల చేశారు.

- డీఎంకే శ్రేణులకు స్టాలిన్ హితవు
చెన్నై: దివంగత మాజీ ముఖ్యమంత్రి కామరాజర్‌పై అనుచిత వ్యాఖ్యలకు పాల్పడి అనవసరమైన వివాదాలను సృష్టించవద్దంటూ పార్టీ శ్రేణులకు డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) హితవు పలికారు. ఈ మేరకు గురువారం స్టాలిన్ తన ఎక్స్‌పేజీలో ఓ ప్రకటన విడుదల చేస్తూ .. పార్టీ శ్రేణులు కలహాలతో పార్టీలో మంటపుట్టించి చలికాచుకోవాలనుకునేవారికి చోటివ్వవద్దని, కామరాజర్‌ను ‘శ్రేష్టమైన తమిళుడు’ అని పెరియార్ కీర్తించేవారని, గుడియాత్తంలో కామరాజర్ పోటీ చేసినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా డీఎంకే అభ్యర్థిని పెట్టకూడదని అన్నాదురై నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.
ఇక మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మహానేత కామరాజర్ మృతిచెందినప్పుడు కుమారుడిలా దగ్గరుండి అంత్యక్రియలు జరిపారని, అంతే కాకుండా ఆయనకు స్మారకమందిరం నిర్మించి, ఆయన జయంతిని విద్యాభివృద్ధి దినంగా జరుపుకునేలా ఉత్తర్వులిచ్చారని వివరించారు. తన వివాహానికి ఆరోగ్యం సహకరించకపోయినా కామరాజర్ హాజరై ఆశీర్వదించడాన్ని తానెన్నటికీ మరువలేనని స్టాలిన్ పేర్కొన్నారు.
ఇంతటి ఘనకీర్తిని సంతరించుకున్న మహానేత గురించి బహిరంగ ప్రదేశాల్లో చర్చనీయాంశమైన వ్యాఖ్యలు చేయడం, వాటిపై వివాదం చేయడం సమంజసం కాదని, ఆ మహాపురుషుడి కీర్తికి భంగం కలిగించే ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా సంయమనం పాటించాలని స్టాలిన్ హితవు పలికారు. ‘తన జీవితపర్యంతమూ సామాజిక న్యాయం కోసం మతసామరస్యం కోసం పాటుపడినా ఆ మహానేత ఆశయాలను నెరవేర్చేందుకు అందరం సమష్టిగా పాటుపడుదాం. వివాదాలను విడిచిపెడదాం’ అంటూ స్టాలిన్ పిలుపునిచ్చారు.
నెలరోజుల్లో 2.5 కోట్ల సభ్యత్వం...
నెలరోజుల్లో 2.5 కోట్ల మందికి డీఎంకే సభ్యత్వం కల్పించాలని, ఆ దిశగా జిల్లా కార్యదర్శులు తగు చర్యలు చేపట్టాలని ఆ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు. కాం్యపు కార్యాలయం నుండి గురువారం ఉదయం జిల్లా కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 68 పోలింగ్ కేంద్రాలలో పార్టీ సభ్యత్వ కార్యక్రమాలను ముమ్మరం చేయాలన్నారు. డీఎంకే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బూత్ డిజిటల్ ఏజెంట్లు పార్టీకి వెలగట్టలేని ఆస్తులన్నారు.
వీరందరిని అసెంబ్లీ ఎన్నికల్లో సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని చోట్ల సభ్యత్వ కార్యక్రమాలను సక్రమంగా జరపటం లేదని, నకిలీ సభ్యత్వం కల్పిస్తున్నారని తనకు రహస్య సమాచారం అందిందని, అలాంటి వారిపై పార్టీ పరంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.ఇక బీజేపీ, అన్నాడీఎంకే నేతలు సాగిస్తున్న అవినీతి అక్రమాలు గురించి ప్రజలకు అవగాహన కల్పించేరీతిలో ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని కూడా పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి.
బంగారం కొనాలనుకునేవారికి షాక్.. మళ్లీ పెరిగిన ధరలు..
బీఆర్‌ఎస్ నా దారిలోకి రావాల్సిందే..
Read Latest Telangana News and National News