Share News

Brahmaputra river dispute: భారత్‌పై జల ఖడ్గం!

ABN , Publish Date - Jul 23 , 2025 | 03:09 AM

బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపట్టిన భారీ డ్యామ్‌.. భారత్‌కు ఎన్నో విధాలుగా నష్టానికి దారిస్తుందనే చర్చ జరుగుతోంది.

Brahmaputra river dispute: భారత్‌పై జల ఖడ్గం!
Brahmaputra river dispute

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్‌!

  • సరిహద్దు సమస్య కన్నా తీవ్రమైనది

  • డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం.. భూకంప జోన్‌

  • భూకంపం వస్తే దిగువకు అతి భారీ వరదలు

  • చైనా కావాలని నీటిని వదిలినా ప్రమాదమే!

  • వేసవి కాలంలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం

  • పర్యావరణంపైనా తీవ్ర ప్రభావం

న్యూఢిల్లీ, జూలై 22: బ్రహ్మపుత్ర నదిపై చైనా చేపట్టిన భారీ డ్యామ్‌.. భారత్‌కు ఎన్నో విధాలుగా నష్టానికి దారిస్తుందనే చర్చ జరుగుతోంది. చైనాతో ఉన్న సరిహద్దుల వివాదం కంటే కూడా ఈ డ్యామ్‌ తీవ్ర సమస్యగా మారుతుందనేటటట అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బ్రహ్మపుత్ర నదిపై అరుణాచల్‌ప్రదేశ్‌కు సమీపంలోని న్యింగ్చి ప్రాంతంలో ప్రపంచంలోనే అతిపెద్ద డ్యామ్‌ నిర్మాణ పనులను చైనా ప్రధాన మంత్రి లీ కియాంగ్‌ ఈ నెల 19న ప్రారంభించారు. సుమారు రూ.14.5 లక్షల కోట్లు (167.8 బిలియన్‌ డాలర్లు) వ్యయంతో చేపట్టిన ఈ డ్యామ్‌.. ప్రపంచంలోనే అతిపెద్ద జలవిద్యుత్‌ ప్రాజెక్టు కూడా. ఈ క్రమంలో నీటి నిల్వ అత్యంత భారీ స్థాయిలో ఉంటుంది. అయితే ఈ డ్యామ్‌తో నదిలో నీటి ప్రవాహం తగ్గే అవకాశం తక్కువేనని, కానీ చైనా ఎప్పుడైనా కావాలని ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే.. దిగువన పరీవాహక ప్రాంతాల్లో భారీ వరదలు వచ్చి నీట మునుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. అరుణాచల్‌ సీఎం పెమా ఖండూ ఇటీవల ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ... చైనాతో మిలటరీ సమస్య కంటే డ్యామ్‌ అంశం పెద్ద ముప్పు అని పేర్కొన్నారు. చైనా దీనిని ఒక ‘నీటి బాంబు’లా ప్రయోగించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.

డ్యామ్‌ నిర్మాణ ప్రాంతం.. భూకంప జోన్‌..

టిబెట్‌లో హిమాలయాల్లో జన్మించే బ్రహ్మపుత్ర నది (చైనాలో యార్లుంగ్‌ త్సాంగ్‌పోగా పిలుస్తారు) తూర్పు దిశగా ప్రవహించి... నమ్చా బర్వా పర్వత ప్రాంతంలో వెనక్కి తిరిగి (యూటర్న్‌) పడమర దిశగా ప్రవహిస్తుంది. ఈ మలుపు దగ్గరే భారత్‌లోకి ప్రవేశించి.. అరుణాచల్‌, అస్సాం మీదుగా ప్రవహించి, బంగ్లాదేశ్‌కి వెళుతుంది. ఇందులో నది మలుపు తిరిగే ప్రాంతంలోనే చైనా భారీ డ్యామ్‌ను నిర్మిస్తోంది. ఇది భారత ఉపఖండ భూఫలకం (టెక్టానిక్‌ ప్లేట్‌), యురేషియా భూఫలకం కలిసే ప్రాంతమని.. భూకంపాలకు ఆస్కారం ఎక్కువని నిపుణులు చెబుతున్నారు.


చైనా డ్యామ్‌ నిర్మిస్తున్న ప్రాంతానికి సమీపంలో 1950లో రిక్టర్‌ స్కేల్‌పై 8.6 తీవ్రతతో భారీ భూకంపం వచ్చింది. అస్సాం నుంచి టిబెట్‌ వరకు ప్రకంపనలతో అదిరాయి. హిమాలయాల ప్రాంతమంతా భూకంప జోన్‌-4లో ఉంది. అలాంటి ప్రాంతంలో అతి భారీ డ్యామ్‌ అంటే.. నీటి బాంబును పక్కన పెట్టుకున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు.

  • టిబెట్‌లోని బ్రహ్మపుత్ర ఉపనదులపై చైనా మొత్తంగా 130 డ్యామ్‌ల నిర్మాణం తలపెట్టింది. అందులో కొన్ని ఇప్పటికే పూర్తయ్యాయి కూడా. ఇవన్నీ కలసి ఆ ప్రాంతంలో భూకంపాల సమస్యను పెంచుతాయని కెనడాకు చెందిన ‘ప్రోబ్‌ ఇంటర్నేషనల్‌’ సంస్థ 2012లోనే హెచ్చరించడం గమనార్హం.

  • చైనా ఇలా పెద్ద సంఖ్యలో నిర్మిస్తున్న డ్యామ్‌లన్నీ నీటిని నిల్వ చేసుకునేందుకు వీలున్నవేనని.. దానివల్ల ఎండాకాలంలో బ్రహ్మపుత్రలో ప్రవాహం తగ్గి నీటి కరువు ఏర్పడే ప్రమాదం ఉంది.

  • చైనా కడుతున్న డ్యామ్‌ నుంచి విద్యుత్‌ కేంద్రాలకు నీటిని తరలించేందుకు పర్వతాన్ని తొలిచి, ఒక్కోటీ 20 కిలోమీటర్ల పొడవైన ఆరు భారీ టన్నెళ్లను నిర్మించనుంది. ఇది ఆ ప్రాంతంలో పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

ముందు జాగ్రత్తగా భారత్‌ భారీ ప్రాజెక్టు చేపట్టినా..

బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్‌, దానితో వచ్చే నష్టాలను ఎదుర్కొనగలిగేలా భారీ ప్రాజెక్టు చేపట్టేందుకు భారత్‌ సిద్ధమైంది. చైనా నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోకి ప్రవేశించే సియాంగ్‌ జిల్లాలో భారీ డ్యామ్‌తోపాటు 11 వేల మెగావాట్ల జల విద్యుత్‌ కేంద్రాలనూ నిర్మించేందుకు సన్నాహాలు చేపట్టింది. చైనా ఒక్కసారిగా నీటిని విడుదల చేస్తే.. దిగువన భారీ వరదలు రాకుండా ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. అయితే అక్కడి గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం ఉండటంతో స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు

ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ

మరిన్ని జాతీయతెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 23 , 2025 | 03:09 AM