India On China-PAK Friendship: పాక్‌కు చైనా సాయం.. కథ మొత్తం బయటపెట్టిన భారత్!
ABN , Publish Date - Jul 08 , 2025 | 01:09 PM
ఉగ్రదాడులతో భారత్‌ను ఇబ్బందులకు గురిచేస్తున్న పాకిస్థాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పింది భారత్. మనతో పెట్టుకోవాలంటే భయపడేలా చేసింది. పాక్ భూభాగంలోకి వెళ్లి మరీ కౌంటర్ అటాక్స్ చేసింది ఇండియా.

పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థలు, వాటి స్థావరాలపై భారీగా దాడులకు తెగబడింది భారత్. ఏకంగా 100కు పైగా టెర్రరిస్టులను లేపేసింది మన ఆర్మీ. ఆ తర్వాత ప్రతిదాడులకు దిగిన పాకిస్థాన్‌కు వణుకు పుట్టించింది. పాక్ డ్రోన్లు, క్షిపణులను గాల్లోనే కూల్చేసిన భారత బలగాలు.. శత్రుదేశ వైమానిక స్థావరాలు, ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసేశాయి. తిరిగి మన వైపు చూడాలంటే భయపడేలా చేశాయి. అయితే ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌కు చైనా సాయం చేయడం చర్చనీయాంశంగా మారింది. డ్రోన్లు, క్షిపణులు, రక్షణ వ్యవస్థ.. ఇలా చాలా విషయాల్లో పాక్‌కు అండగా నిలిచింది చైనా. కానీ ఇందులో తమ పాత్ర లేదంటూ బుకాయిస్తూ వస్తోంది డ్రాగన్ కంట్రీ. అయితే పాక్‌కు చైనా సాయం, ఆపరేషన్ సిందూర్ డ్రాగన్ కంట్రీ పాత్ర గురించి మొత్తం విషయాలను బయటపెట్టింది భారత్.
ఫొటోలు, రాడార్ డేటా సహా..
ఆపరేషన్ సిందూర్‌లో చైనా పాత్రపై పలు ప్రశ్నలు లేవనెత్తారు భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్. పాకిస్థాన్‌కు చాలా విధాలుగా చైనా సాయం అందించిందని ఆయన అన్నారు. రియల్ టైమ్ డేటా, శాటిలైట్ సపోర్ట్‌ను డ్రాగన్ కంట్రీ అందించిందని చెప్పారు. భారత భద్రతా దళాలు ఎక్కడెక్కడ మొహరించాయి, వాళ్ల కదలికలతో పాటు క్షిపణుల సమాచారాన్ని కూడా ఎప్పటికప్పుడూ పాక్‌కు చైనా చేరవేస్తూ వచ్చిందని భారత్ ఆరోపిస్తోంది. ఇండియన్ మిలిటరీ బేసెస్‌పై నిఘా కోసం ప్రత్యేకంగా 5 శాటిలైట్లను మోహరించిందని చెబుతోంది. భారత వాయు సేన, ఆర్మీ కదలికలను గమనిస్తూ ఫొటోలు, రాడార్ డేటాను పాక్‌కు డ్రాగన్ కంట్రీ చేరవేసిందని ఇండియా అంటోంది.
ఒప్పుకున్న పాక్..
ఇకపోతే.. కేజే-500 ఏయీడబ్ల్యూ అండ్ సీ ఎయిర్‌క్రాఫ్ట్‌ను చైనా నుంచి కొనుగోలు చేసినట్లు స్వయంగా పాకిస్థాన్ కన్ఫర్మ్ చేసింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ ఎయిర్ క్రాఫ్ట్‌ని పాక్ కొనుగోలు చేయడంతో భారత్‌పై ఆ దేశాన్ని చైనా మళ్లీ రెచ్చగొడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌పై దాడుల కోసం పాక్ ఉయోగించిన జే10సీ, జేఎఫ్17 ఫైటర్ జెట్స్‌తో పాటు హెచ్‌క్యూ9 ఎల్‌వై80 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, వింగ్ లూంగ్ డ్రోమ్స్, సీఎం401 హైపర్‌సోనిక్ మిసైల్స్ కూడా చైనావేనని భారత్ చెబుతోంది. దీంతో పాటు యుద్ధంలో ఇండియా ఓడిందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసేందుకు, భారత్‌పై విద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు పాక్‌కు కావాల్సిన సాయాన్ని చైనీస్ వ్లాగర్స్ అందించారని ఆరోపిస్తోంది.
ఇవీ చదవండి:
రూ.200 మోసం చేశాడు.. కట్ చేస్తే
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి