Share News

Census: జనగణనకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల

ABN , Publish Date - Jun 16 , 2025 | 11:30 AM

India census: జనగణన ప్రక్రియకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో జన, కుల గణన ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు.

Census: జనగణనకు సోమవారం నోటిఫికేషన్‌ విడుదల
Census 2025 Notification

Delhi: ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియకు సోమవారం కేంద్రం నోటిఫికేషన్ (Notification) విడుదల చేయనుంది. జనగణనతో పాటు కుల గణన (Caste census) కూడా జరుగుతుంది. దేశంలో 15 ఏళ్ల తర్వాత జనగణన జరగనుంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) జనగణనపై నిన్న (ఆదివారం) అధికారులతో సమీక్షించారు (Review). 2027 మార్చి 1వ తేదీ నాటికి రెండు దశల్లో జన, కుల గణన పూర్తి చేయాలని హోం మంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. అయితే డిజిటల్ విధానంలో జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. ప్రభుత్వం విడుదల చేసే పోర్టల్స్, యాప్‌లలో ప్రజలే సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటు కల్పిస్తుంది.


తొలి దశలో ఏ ప్రాంతాలంటే..

స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జనగణన. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2026, అక్టోబర్‌ 1 నుంచి, రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణనను చేపట్టనున్నారు. జనగణన కోసం మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్‌వైజర్లు, 1.34 లక్షల మంది సిబ్బంది పనిచేయనున్నారు. డిజిటల్ రూపంలోనే ట్యాబ్‌ల ద్వారా జనాభా లెక్కల సేకరణ సాగనుంది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కేంద్ర హోంశాఖ కఠినమైన చర్యలు తీసుకుంటుంది. సమాచార సేకరణ, బదిలీ, స్టోరేజీని హోంశాఖ అత్యంత కట్టుదిట్టంగా చేపడుతోంది.సెక్షన్‌ 3, జనగణన చట్టం, 1948 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు కేంద్రం వివరించింది.


ఇప్పటి వరకు అడగని ఒక ప్రశ్న ఈసారి..

దేశంలో 1872 నుంచి జనగణన చేస్తున్నారు. సాధారణంగా జనగణనను పదేళ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో జనగణన చేపట్టారు. అప్పుడు కూడా రెండు విడతల్లో ఈ ప్రక్రియ జరిగింది. ఆ ప్రకారంగా 2021లోనే జన గణనను నిర్వహించాలి. అయితే నాటి కొవిడ్‌ కల్లోలపరిస్థితుల కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. దీంతో తాజాగా ఇప్పుడు జనాభా గణనను కేంద్రం ఉపక్రమించింది. జనాభా లెక్కల సేకరణకు కేంద్రం 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసింది. అయితే 1951 నుంచి ఇప్పటి వరకు అడగని ఒక ప్రశ్న ఈసారి జనగణనలో అడుగుతారు. అదే మీ కులం ఏంటి.. అని. ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గురించి సమాచారం ఇంతకు ముందే ఉంది. అయితే ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరికీ తమ కులం గురించి చెప్పే ఆప్షన్ ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో ఈసారి వస్తున్న పెద్ద మార్పు ఇదే. ఇక 2021లో జనగణన కోసం ప్రభుత్వం రూ.12,695.58 కోట్లను కేటాయించగా.. ఈసారి జనగణనకు రూ. 13 వేల కోట్ల వరకూ వ్యయం అయ్యే అవకాశం ఉండగా.. ప్రస్తుతానికి కేంద్రం 2025-26 బడ్జెట్‌లో కేవలం రూ. 574.80 కోట్ల నిధులను మాత్రమే కేటాయించింది.


అసలు జనగణన అంటే ఏంటి..

ఒక దేశం లేదా ఒక ప్రాంత ప్రజల ఆర్థిక, సామాజిక సమాచారాన్ని సేకరించడం, సంకలనం చేయడం, విశ్లేషించడం, ఆ తర్వాత దాన్ని ప్రజలకు అందుబాటులోకి తేవడాన్ని జనగణన అని అంటారు. జనగణనలో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రజల వయసు, లింగం, భాష, మతం, విద్య, వృత్తి, ఎక్కడ నివసిస్తున్నారనే వివరాలు సేకరించనున్నారు. ఈ గణాంకాల ఆధారంగా ప్రభుత్వ విధానాలు, సంక్షేమ పథకాలను రూపొందిస్తారు.


ఇవి కూడా చదవండి:

ప్రభుత్వ లాంఛనాలతో రూపాణీ అంత్యక్రియలు

ఇష్టారాజ్యంగా కొందరు ఐఏఎస్‌ల తీరు..

For More AP News and Telugu News

Read Latest and Crime News

Updated Date - Jun 16 , 2025 | 11:30 AM