Share News

BJP Focus to MP Cabinet: బిహార్‌లో విజయంతో ఆ రాష్ట్రంలో క్యాబినెట్‌పై బీజేపీ ఫోకస్.!

ABN , Publish Date - Nov 17 , 2025 | 05:02 PM

బిహార్‌లో ఎన్డీయే ఘన విజయం తర్వాత మధ్యప్రదేశ్‌లో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. రెండేళ్ల క్రితం ఏర్పాటైన ప్రస్తుత మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయడంపై బీజేపీ అధిష్ఠానం దృష్టిసారించినట్టు తెలుస్తోంది. రాబోయే శాసనసభ ఎన్నికల దిశగా పార్టీ ముందడుగు వేస్తోంది.

BJP Focus to MP Cabinet: బిహార్‌లో విజయంతో ఆ రాష్ట్రంలో క్యాబినెట్‌పై బీజేపీ ఫోకస్.!
BJP Focus to MP Cabinet

ఇంటర్నెట్ డెస్క్: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బిహార్‌లో విజయం సాధించాక.. మధ్యప్రదేశ్‌లో రాజకీయం వేడెక్కుతోంది. డాక్టర్ మోహన్ యాదవ్ ప్రభుత్వంలో త్వరలోనే అక్కడ ప్రధాన మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ దిశగా బలమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. గతంలో మంత్రి పదవులు నిర్వహించిన ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు క్యాబినెట్‌లో మరలా స్థానం కల్పించాలనే ప్రచారం జోరందుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి మోహన్ యాదవ్ ప్రభుత్వం రెండేళ్లు పూర్తి కానున్న తరుణంలో మంత్రిమండలిలో కొత్త ముఖాలకు చోటు కల్పించే దిశగా ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తోంది.


మధ్యప్రదేశ్‌లో 31 మంది సభ్యుల మంత్రివర్గంలో ప్రస్తుతం 4 పదవులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఈ ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లైంది. ఆ తర్వాత జరిగే మంత్రివర్గ విస్తరణ లేదా పునర్‌వ్యవస్థీకరణ ద్వారా ప్రాంతీయ సమతుల్యతను పరిష్కరించడంతో పాటు 2028 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రభుత్వాన్ని బలోపేతం చేసే దిశగా ముందడుగు పడే అవకాశముంది. కేవలం మంత్రులకే కాకుండా.. ఎమ్మెల్యేలనూ తమ నియోజకవర్గాలకు సంబంధించిన నాలుగేళ్ల అభివృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌ను సిద్ధం చేయాలని ప్రభుత్వం కోరింది. ఎమ్మెల్యేల నిధుల వినియోగం, సంక్షేమ పథకాల అమలు, స్థానిక సమస్యలను పరిష్కరించడంలో వారి భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోనున్నారు. సదరు నివేదికలను ముఖ్యమంత్రికి సమర్పించనున్నారు. ఈ సమీక్షంతా అక్కడి క్యాబినెట్ సర్దుబాటుకోసమేనన్న సూచనలు కనిపిస్తున్నాయి.


రాష్ట్రంలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై ఓ మీడియా సంస్థ సీఎంను ప్రశ్నించగా.. 'మాది అఖిల భారత పార్టీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డా నాయకత్వంలో మేం పనిచేస్తున్నాం. రాష్ట్రంలో రెండేళ్ల పాలన తర్వాత సమీక్ష సహజం. పార్టీ ఏది నిర్ణయించినా.. మేం దానికి కట్టుబడి ఉంటాం. ఇలాంటి అవకాశాలు జీవితంలో చాలా అరుదుగా వస్తుంటాయి. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా మనం వాటిని సక్రమంగా నిర్వర్తించాలి.' అని సమాధానిచ్చారు. సీఎం ఈ రకంగా స్పందించడంతో.. భోపాల్‌లో రాజకీయం మరింత వేడెక్కింది.


అయితే.. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోనూ 'గుజరాత్ ఫార్ములా'ను అమలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇదే నిజమైతే అనేక మంది సీనియర్ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు లభిస్తుంది. ఇప్పటికే ఉన్న కొందరు మంత్రుల శాఖలూ మారవచ్చు. అంతేకాకుండా పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడి నియామకం కూడా ఇందులో కీలక భూమిక పోషించనుంది. ఏది ఏమైనా ఇలాంటి వాటన్నిటికీ స్పష్టమైన సమాధానం వచ్చాకే మోహన్ యాదవ్ హయాంలో మంత్రివర్గ తుది ముఖచిత్రం బయటపడనుంది.


ప్రస్తుత మంత్రివర్గం ఏర్పడిన సమయంలో నాడు బీజేపీ.. లోక్‌సభ ఎన్నికలపై ప్రాథమికంగా దృష్టి సారించింది. సీఎంతో సహా 12 మంది మంత్రులు ఓబీసీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం రాజేంద్ర శుక్లాతో పాటు 9 మంది మంత్రులు అగ్రవర్ణ కులాలకు చెందినవారు. మరో ఐదుగురు ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన వారున్నారు. దీంతో ఇది ఉద్దేశ పూర్వకంగా కుల ప్రాతిపదికన మంత్రివర్గంలో చోటుకల్పించారనే చర్చలకు దారితీసింది. బిహార్‌లో ఎన్నికలు ముగియడంతో మధ్యప్రదేశ్‌లో 2028లో జరగబోయే ఎన్నికలు కీలక కానున్న తరుణంలో ఈ కుల సమీకరణలు సర్దుబాటయ్యే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఇందులో ఇద్దరు మాజీ మంత్రులు సహా ఇద్దరు మహిళలకూ చోటు దక్కే ఛాన్సుంది. ప్రస్తుతమున్న మంత్రివర్గంలో ముగ్గురికి వారి పనితీరు ఆధారంగా ఉద్వాసన పలికే సూచనలూ కనిపస్తున్నాయి.



ఇవీ చదవండి:

మీరెప్పుడైనా 'అరోరా బొరియాలిసిస్' చూశారా.?

బీహార్ ఎన్నికలు.. ఆ ఘనత సాధించిన తొలి వ్యక్తి మైథిలీ ఠాకూర్

Updated Date - Nov 17 , 2025 | 05:14 PM