Share News

Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025.. బీహార్‌పై వరాల జల్లు..

ABN , Publish Date - Feb 01 , 2025 | 12:46 PM

ప్రస్తుతం బీహార్‌లో జేడీయూతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామి. ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్లబోతున్న బీహార్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు.

Budget 2025: కేంద్ర బడ్జెట్ 2025.. బీహార్‌పై వరాల జల్లు..
FM Nirmala sitharaman

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగాన్ని పూర్తి చేశారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి వెల్లడించారు. కాగా, ఈ ఏడాది చివర్లో ఎన్నికలకు వెళ్లబోతున్న బీహార్ రాష్ట్రంపై వరాల జల్లు కురిపించారు. (Budge-2025)


తాజా బడ్జెట్‌లో బీహార్‌ (Bihar)కు ప్రత్యేక కేటాయింపులు చేశారు. బీహార్‌లో మఖానా బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. మఖానా వ్యాపారం కోసం రైతుల సౌకర్యార్థం ఈ బోర్డు పని చేయబోతోంది. అలాగే బీహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో యాభై వేల ఎకరాలకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కేనాల్‌కు ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించారు. ఇక, బీహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. అలాగే ఐఐటీ పట్నాను కూడా విస్తరిస్తామని హామీ ఇచ్చారు.


అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ కార్యకలాపాలకు మద్దతు ఇచ్చేందుకు బీహార్‌లో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ప్రస్తుతం బీహార్‌లో జేడీయూతో కలిసి బీజేపీ అధికారాన్ని పంచుకుంటోంది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో జేడీయూ కీలక భాగస్వామి. బీహార్‌కు ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌ను పక్కన పెట్టిన కేంద్రం.. బడ్జెట్‌లో కీలక కేటాయింపులు చేసింది. బీహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

Updated Date - Feb 01 , 2025 | 12:46 PM