Share News

Bombay High Court Acquittal: ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో ఆ 12 మందీ నిర్దోషులే

ABN , Publish Date - Jul 22 , 2025 | 04:03 AM

ముంబై లోకల్‌ ట్రైన్లలో వరుస బాంబుపేలుళ్ల కేసులో శిక్షలుపడిన మొత్తం 12 మందినీ విడుదల చేయాలని బొంబాయి హైకోర్టు

Bombay High Court Acquittal: ముంబై రైళ్లలో పేలుళ్ల కేసులో ఆ 12 మందీ నిర్దోషులే
Bombay High Court Acquittal

  • నిందితులను హింసించి నేరం ఒప్పించారు

  • బాంబే హైకోర్టు సంచలన తీర్పు

  • ఉరిశిక్ష పడిన ఐదుగురు సహా నిందితులందరి విడుదలకు ఆదేశం

ముంబై, జూలై 21: ముంబై లోకల్‌ ట్రైన్లలో వరుస బాంబుపేలుళ్ల కేసులో శిక్షలుపడిన మొత్తం 12 మందినీ విడుదల చేయాలని బొంబాయి హైకోర్టు ఆదేశించింది. 2006 జూలై 11 నాటి ఈ ఘటనలో 189 మంది మరణించగా, 800మందికిపైగా గాయపడ్డారు. ఈ కేసులో నిందితులుగా పోలీసులు పేర్కొన్న 12 మందికి 2015 సెప్టెంబరు 30న మోకా (మహారాష్ట్ర కంట్రోల్‌ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌) ప్రత్యేక కోర్టు శిక్షలు విధించింది. వీరిలో ఐదుగురికి మరణశిక్షను, మిగతావారికి యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. మరణశిక్షలు పడిన ఐదుగురు ఈ తీర్పును సవాల్‌ చేస్తూ బాంబే హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. జస్టిస్‌ అనిల్‌ కిలోక్‌, జస్టిస్‌ ఎస్సీ చంద్రక్‌లతో కూడిన ప్రత్యేక బెంచ్‌ 8 నెలలపాటు ఈ పిటిషన్లపై విచారణ జరిపి గత నెల 31న తీర్పును రిజర్వు చేసింది. సోమవారం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో అరెస్టు చేసిన 12 మందిని దోషులుగా నిర్ధారించే ఆధారాలేవీ ప్రాసిక్యూషన్‌ సమర్పించలేకపోయిందని 671 పేజీల తీర్పులో స్పష్టం చేసింది. తమ పిటిషనర్లను తీవ్ర చిత్రహింసలకు గురిచేసి నేరాన్ని ఒప్పించారన్న న్యాయవాది వాదనతో ఏకీభవించింది. పేలుళ్లకు ఏ రకం పదార్థం ఉపయోగించారనేది వివరించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమైందని స్పష్టం చేసింది. ఘటన జరిగిన నాలుగేళ్లకు నిందితులను గుర్తించడానికి పరేడ్‌ నిర్వహించడం అసాధారణమని ఆశ్యర్యం వ్యక్తం చేసింది. పౌరు లు చట్టం, కోర్టుల పట్ల ఉంచిన విశ్వాసాన్ని తక్కువచేసే విధంగా ప్రాసిక్యూషన్‌ చర్య ఉందని ఆక్షేపించింది. కాగా, ఈ కేసులో స్పెషల్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రాజా ఠాకారే వాదనలు వినిపించారు. మహారాష్ట్రలోని పలు జైళ్లలో ఉన్న పిటిషనర్లు వీడియోకాన్ఫరెన్సింగ్‌ పద్ధతిలో విచారణలో పాల్గొన్నారు. మరణశిక్ష పడి నాగపూర్‌ కేంద్ర కారాగారంలో ఉన్న నవేద్‌ హుస్సేన్‌ ఖాన్‌ తన వాదనలు తానే వినిపించుకున్నారు. కాగా, హైకోర్టు తీర్పు విస్మయం కలిగించిందని సుప్రీంకోర్టులో సవాల్‌ చేస్తామని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ అన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 04:03 AM