Kunal Kamra T-shirt: టీ షర్టు వివాదంలో కునాల్ కమ్రా.. బీజేపీ, శివసేన వార్నింగ్
ABN , Publish Date - Nov 26 , 2025 | 02:57 PM
కునాల్ కమ్రా ఈ ఏడాది మొదట్లో ముంబైలోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో జరిగిన షోలో ఒక హిందీ సినిమా పాటను పేరడీ చేస్తూ పాడారు. ఇది శివసేన నేత ఏక్‌నాథ్ షిండే వర్గీయుల ఆగ్రహానికి గురైంది.
ముంబై: కమెడియన్ కునాల్ కమ్రా (Kunal Kamra) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS)ను ఎగతాళి చేస్తున్నట్టుగా కనిపించే టీ-షర్ట్ ధరించిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన పోస్ట్ చేశారు. ఈ చర్యను బీజేపీ, ఆ పార్టీ మిత్రపక్షమైన శివసేన ఖండించాయి. కమ్రాపై పోలీసు చర్య తీసుకుంటామని హెచ్చరించాయి.
కునాల్ కమ్రా ధరించిన టీ షర్టుపై కుక్క బొమ్మతో పాటు ఆర్ఎస్ఎస్‌ను ప్రస్తావించే కంటెంట్ ఉందని మహారాష్ట్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత చంద్రశేఖర్ బవాంకులే తెలిపారు. ఆన్‌లైన్‌లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టేవారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. బీజేపీ మిత్రపక్షమైన శివసేన నేత, మహారాష్ట్ర కేబినెట్ మంత్రి సంజయ్ శిర్సాట్ సైతం వెంటనే స్పందించారు. గతంలోనూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేపై కునాల్ కుమ్రా విమర్శలు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు నేరుగా ఆర్ఎస్ఎస్‌పై దాడి చేసే సాహసం చేశారని విమర్శించారు. ఈ పోస్టుపై బీజేపీ గట్టి స్పందన తెలియజేయాలన్నారు.
కునాల్ కమ్రా ఈ ఏడాది మొదట్లో ముంబైలోని హాబిటాట్ కామెడీ క్లబ్‌లో జరిగిన షోలో ఒక హిందీ సినిమా పాటను పేరడీ చేస్తూ పాడారు. ఇది శివసేన నేత ఏక్‌నాథ్ షిండే వర్గీయుల ఆగ్రహానికి గురైంది. శివసేన యువజన విభాగం కార్యకర్తలు హాబిటాట్ కామెడీ వెన్యూపై దాడి చేసి దానిని ధ్వంసం చేశారు.
ఇవి కూడా చదవండి..
కొత్త ఓటర్లను గౌరవించండి.. భారత పౌరులకు ప్రధాని లేఖ
నాన్న ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చాను..
మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.