BJP New Chief: 10 రోజుల్లో బీజేపీకి కొత్త సారథి
ABN , Publish Date - Apr 18 , 2025 | 03:27 AM
భారతీయ జనతా పార్టీలో పది రోజుల్లో కొత్త జాతీయ అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు పూర్తయ్యింది. మేలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణతో పాటు గవర్నర్ల నియామకాలపై చర్చలు జరుగుతున్నాయి

పార్టీ జాతీయ అధ్యక్షుడి నియామకంపై
ఆరెస్సెస్, బీజేపీ అగ్రనేతల మధ్య ఏకాభిప్రాయం
మేలో పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
4-5 రాష్ట్రాలకు గవర్నర్ల నియామకాలపై చర్చలు
మేలో పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
4-5 రాష్ట్రాల్లో గవర్నర్ల నియామకాలపై చర్చలు
సంఘ్ మార్గదర్శకత్వంలో భారీ మార్పులు?
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): దేశ రాజధానిలో రాజకీయంగా స్తబ్దత నెలకొన్నప్పటికీ.. అది తుఫాను ముందు ప్రశాంతతలాగా కనిపిస్తోంది. త్వరలో భారతీయ జనతా పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ కీలక మార్పులు జరగనున్నట్లు రాజకీయ వర్గాల సమాచారం. ఆ వర్గాలు చెబుతున్నదాని ప్రకారం.. మరో వారం పది రోజుల్లో బీజేపీకి జాతీయ అధ్యక్షుడు రానున్నారు. పార్టీపై పూర్తిగా పట్టుబిగించి ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయనున్న బలమైన నేతనే పార్టీ అధ్యక్షుడుగా నియమించే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నేతలకు, బీజేపీ అగ్రనేతలకు మధ్య ఏకాభిప్రాయం కుదిరిందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, హరియాణా సహా పలు రాష్ట్రాల్లో పార్టీ అధ్యక్షులను నియమించేందుకు కూడా కసరత్తు పూర్తయినట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. అలాగే.. పార్టీలో సిద్దాంతానికి కట్టుబడి ఉండే నేతలను ప్రధాన కార్యదర్శులుగా, కార్యదర్శులుగా నియమించే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. మే నెలలో ప్రధాని మోదీ పూర్తిస్థాయి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరపనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. పార్టీతో సంబంధం లేని ఐఏఎస్, ఐపీఎస్, ఇతర నేతలను తప్పించి.. పార్టీలో సుదీర్ఘకాలం పనిచేస్తున్నవారికి అవకాశం కల్పించనున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. పార్టీలోనూ, మంత్రివర్గంలోనూ యువనేతలకు కూడా కీలక ప్రాధాన్యం కల్పించనున్నట్లు తెలిసింది. నాలుగైదు రాష్ట్రాల్లో గవర్నర్లను కూడా నియమించే విషయంపై చర్చలు జరిగినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి.
అప్పట్నుంచీ..
రెండు వారాల క్రితం నాగపూర్‌లో సంఘ్ కార్యాలయానికి వెళ్లొచ్చిన నాటి నుంచీ మోదీ ఎక్కువగా బయటి కార్యక్రమాలు పెట్టుకోకుండా ఢిల్లీలోనే తన ఆంతరంగికులతో విస్తృత చర్చలు జరుపుతున్నారు. రెండు రోజుల క్రితం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును సైతం కలుసుకుని సుదీర్ఘ మంతనాలు జరిపారు. శనివారం జరగాల్సిన ప్రధాని జమ్ముకశ్మీర్ పర్యటన కూడా వర్షాల పేరుతో వాయిదా పడింది. మరోవైపు హోంమంత్రి అమిత్ షా కూడా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ తో చర్చలు జరిపారు. మోదీ కూడా వీరితో మంతనాలు జరిపినట్లు సమాచారం.
సంఘ్ నిర్దేశకత్వంలో..
హరియాణా, మహారాష్ట్రలో పార్టీ విజయానికి పనిచేసిన ఆర్‌ఎ్‌సఎస్ దేశంలో వివిధ రాష్ట్రాల్లో తమ ఫార్ములాలకు అనుగుణంగా బీజేపీ పనిచేసేందుకు దిశా నిర్దేశం చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు అనుగుణంగానే తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైను తొలగించి అన్నాడీఎంకే నేతృత్వంలో పనిచేయాలని బీజేపీ నిర్ణయించింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేవనెత్తిన భాష, తదితర అంశాల నేపథ్యంలో దక్షిణాదికి, ఉత్తరాదికి మధ్య అగాథం ఏర్పడకుండా జాగ్రత్తపడాలని సంఘ్ సూచించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే.. అన్నామలైను కేంద్ర మంత్రివర్గంలో చేర్చుకునే అవకాశం కూడా లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీతో చేతులు కలపడం కూడా సంఘ్ ఫార్ములా ప్రకారమే జరిగిందని.. తెలంగాణలో కూడా అలాంటి ఫార్ములాను రూపొందించేందుకు కసరత్తు జరుగుతోందని ఆ వర్గాలు తెలిపాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రైవేట్ ఆస్పత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది
తెలంగాణ పోలీసులకు సీఎం అభినందనలు
Read Latest Telangana News and National News