Share News

BJP: రాజ్‌నాథ్‌ లేదా నడ్డా!

ABN , Publish Date - Jul 24 , 2025 | 03:29 AM

భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతను ఎన్నుకునేందుకు బీజేపీ అగ్రనేతలు సన్నాహాలు ప్రారంభించారు.

BJP: రాజ్‌నాథ్‌ లేదా నడ్డా!

  • కొత్త ఉపరాష్ట్రపతిగా వీరిలో ఒకరికి చాన్స్‌.. బీజేపీ వర్గాల్లో చర్చ

  • మోదీ, షాకు నమ్మదగ్గ నేతలుగా రాజ్‌నాథ్‌, నడ్డాకు గుర్తింపు

  • పరిశీలనలో మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌,

  • బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌, డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ పేర్లూ..

న్యూఢిల్లీ, జూలై 23 (ఆంధ్రజ్యోతి): భారత ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్‌ ధన్‌ఖడ్‌ రాజీనామా చేయడంతో ఆ పదవిలో మరో నేతను ఎన్నుకునేందుకు బీజేపీ అగ్రనేతలు సన్నాహాలు ప్రారంభించారు. ఆ పార్టీ వర్గాల అంచనా ప్రకారం కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ లేదా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10వ తేదీతో 74 ఏళ్లు పూర్తిచేసుకున్న రాజ్‌నాథ్‌సింగ్‌.. ప్రధాని నరేంద్రమోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు నమ్మదగ్గ నేతగా నిరూపించుకున్నారు. ప్రతిపక్షాల గౌరవం కూడా చూరగొన్న రాజ్‌నాథ్‌సింగ్‌ ఇరు వర్గాల మధ్య వారధిలా ఉపయోగపడతారని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఇప్పటికే పదవీకాలం పూర్తయిన జేపీ నడ్డా పేరును కూడా అగ్రనేతలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.


మోదీ, షాలకు తలలో నాలుకలా నడ్డా ఉన్నారని, స్పీకర్‌ ఓం బిర్లా లాగే సభను నియంత్రించగలరని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే బీజేపీ కొత్త జాతీయ అధ్యక్షుడి పేరు ఖరారు కానంత వరకూ నడ్డా విషయం తేల్చడం కష్టమని ఈ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ పేరు బుధవారం మీడియా వర్గాల్లో చక్కర్లు కొట్టింది. తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాధాకృష్ణన్‌కు ఆర్‌ఎ్‌సఎస్‌ నేపథ్యం ఉంది. మర్యాదస్తుడిగా పేరుంది. గతంలో కొన్నాళ్లు జార్ఖండ్‌, తెలంగాణ రాష్ట్రాలకు కూడా ఆయన గవర్నర్‌గా వ్యవహరించారు. తమిళనాడులో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకొని అధికారం దక్కించుకోవాలనే ప్రయత్నంలో బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో అదే రాష్ట్రానికి చెందిన నేతకు ఉపరాష్ట్రపతి పదవి కట్టబెట్టడం ద్వారా తమిళ ప్రజలకు చేరువ కావాలని కమలం పార్టీ యోచిస్తున్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు జమ్ము కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ పేర్లు కూడా ఉపరాష్ట్రపతి పదవికి చర్చకు వస్తున్నాయి.

Updated Date - Jul 24 , 2025 | 03:29 AM