Free Electricity: బిహార్‌లో ఉచిత విద్యుత్ పథకం
ABN , Publish Date - Jul 18 , 2025 | 05:45 AM
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాష్ట్ర ప్రజలకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఉచిత విద్యుత్ పథకం ప్రకటించారు. గృహ వినియోగదారులందరికి ప్రతినెల 125 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

గృహ వినియోగదారులకు నెలకు 125 యూనిట్ల వరకూ ఉచితం.. సీఎం నితీశ్‌కుమార్ వెల్లడి
అసెంబ్లీ ఎన్నికల వేళ పోటాపోటీ హామీలు
తాము అధికారంలోకి వస్తే నెలకు 200 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తామని ఇప్పటికే ఆర్జేడీ హామీ
పట్నా, జూలై 17: అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. రాష్ట్ర ప్రజలకు బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఉచిత విద్యుత్ పథకం ప్రకటించారు. గృహ వినియోగదారులందరికి ప్రతినెల 125 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని గురువారం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీనివల్ల 1.67 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఉచిత విద్యుత్ పథకం ఆగస్టు నుంచే అమల్లోకి రానున్నదని కూడా ఆయన తెలిపారు. అంటే జూలై నుంచే 125 యూనిట్ల విద్యుత్ వాడకంపై బిల్లు వసూ లు చేయరు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలకు చౌకగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని నితీశ్ కుమార్ వెల్లడించారు.
వచ్చే మూడేళ్లలో ‘కుటీర్ జ్యోతి యోజన’ పథకం కింద రాష్ట్రంలో 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. కాగా, గృహ వినియోగదారులకు 125 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం వల్ల.. ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.16 వేల కోట్ల భారం పడుతుందని డిప్యూటీ సీఎం-బీజేపీ నేత సామ్రాట్ చౌదరి మీడియాకు చెప్పారు. మరోవైపు, ఇండియా కూటమికి సారథ్యం వహిస్తున్న ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్.. తమకు అధికారమిస్తే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల విద్యుత్ ఉచితంగా పంపిణీ చేస్తామని ఇంతకు ముందే ప్రకటించడం గమనార్హం.