Share News

Asaduddin Owaisi: భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌.. నా అంతరాత్మ ఒప్పుకోదు: ఒవైసీ

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:36 AM

ఆసియాకప్‌-2025లో భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యతిరేకించారు.

Asaduddin Owaisi: భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌.. నా అంతరాత్మ ఒప్పుకోదు: ఒవైసీ

  • రక్తం-నీరు కలిసి ప్రవహించని చోట మ్యాచ్‌ ఎందుకని వ్యాఖ్య

న్యూఢిల్లీ, జూలై 29: ఆసియాకప్‌-2025లో భారత్‌-పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ని మజ్లిస్‌ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ వ్యతిరేకించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ మ్యాచ్‌ సెప్టెంబరు 14న జరగాల్సి ఉండగా.. ప్రతిపక్షాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ప్రత్యేక చర్చ సందర్భంగా లోక్‌సభలో మాట్లాడిన ఒవైసీ.. భారత్‌-పాక్‌ మ్యాచ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘రక్తం-నీళ్లు కలిసి ప్రవహించలేవు అని మనం ప్రకటించాం. అలాంటప్పుడు పాకిస్థాన్‌తో క్రికెట్‌ మ్యాచ్‌ ఆడుతారా? పాక్‌ విమానాలు మన గగనతలంలోకి రావు. వారి పడవలు మన ప్రాదేశిక జలాల్లోకి రావు. పాక్‌తో వాణిజ్య సంబంధాలను పూర్తిగా నిలిపివేశాం. అలాంటి దేశంతో క్రికెట్‌ మ్యాచ్‌ ఎలా ఆడతాం?’’ అని ఆయన నిలదీశారు. ఒకవేళ ఈ మ్యాచ్‌ జరిగినా.. దాన్ని వీక్షించడానికి తన అంతరాత్మ అంగీకరించదన్నారు.


‘భారత్‌ వైపే’ మాట్లాడతా!

  • కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ నర్మగర్భ వ్యాఖ్య

    50.jpg

న్యూఢిల్లీ, జూలై 29: ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై పార్లమెంటులో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీలో వివాదాలు రాజుకున్నాయి. ఈ చర్చలో కీలక నేతలు శశిథరూర్‌, మనీశ్‌ తివారీలు పాల్గొనకుండా పార్టీ పక్కన పెట్టింది. ఈ వ్యవహారంపై శశిథరూర్‌ మౌనంగా ఉండగా.. మనీశ్‌ మాత్రం సోషల్‌ మీడియాలో నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను భారత్‌వైపే మాట్లాడతా.’’ అని పేర్కొన్నారు. పాత హిందీ సినిమా ‘పూరబ్‌ ఔర్‌ పశ్చిమ్‌’లోని ఓ పాటలో చరణాన్ని ఆయన పోస్టు చేశారు. ఒక భారతీయుడిగా తాను భారత వైభవాన్నే కోరుకుంటానని దానర్థం. ‘ఆపరేషన్‌ సిందూర్‌’పై ప్రపంచ దేశాలకు వివరించేందుకు కేంద్రం పంపిన ప్రతినిధుల బృందంలో శశిథరూర్‌, మనీశ్‌ తివారీలు ఉన్నారు. ఈ పోస్టుపై మీడియా ప్రశ్నించగా.. ‘‘నా మౌనాన్ని మీరు అర్థం చేసుకోకపోతే.. నా మాటలను మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు.’’ అని వ్యాఖ్యానించారు.


మోదీది పెద్ద మనసు:సుప్రియా సూలే

51.jpg

న్యూఢిల్లీ, జూలై 29 : నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ) శరదపవార్‌ వర్గం నేత, బారామతి ఎంపీ సుప్రియా సూలే లోక్‌సభ వేదికగా ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టేందుకు దారితీసిన పరిస్థితులను ప్రపంచానికి చెప్పే విషయంలో ప్రతిపక్షాలపై నమ్మకం ఉంచిన ప్రధాని మోదీది పెద్ద మనసు అని కొనియాడారు. ఆపరేషన్‌ సిందూర్‌పై లోక్‌సభలో సోమవారం జరిగిన చర్చలో భాగంగా సుప్రియా సూలే ఈ వ్యాఖ్యలు చేశారు.

Updated Date - Jul 30 , 2025 | 05:36 AM