Water Bomb: భారత్‌పై చైనా వాటర్ బాంబు.. అరుణాచల్ సీఎం కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 09 , 2025 | 09:12 PM
డ్యామ్ పూర్తయి అకస్మాత్తుగా జలాలను విడుదల చేస్తే తమ సియాంగ్ బెల్ట్ మొత్తం నాశానమమవుతుందని, ఆదివాసీలు పూర్తిగా భూములు, ఆస్తులు, చివరకు ప్రాణాలు కూడా కోల్పోతారని పెమా ఖండూ అన్నారు.

న్యూఢిల్లీ: అరుణాచల్ ప్రదేశ్ (Arunachal Pradesh) సరిహద్దులోని బ్రహ్మపుత్ర నదిపై చైనా ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టు (Yarlung Tsango project) నిర్మిస్తుండటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పెమా ఖండూ (Pema Khandu) ఆందోళన వ్యక్తం చేశారు. ఇది భారత్‌పై చైనా 'వాటర్ బాంబ్' (Water Bomb)గా ఆయన అభివర్ణించారు. చైనా మిలటరీ కంటే కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చారు. ఈ ప్రాజెక్టుతో దిగువ ప్రాంతాల్లో నివసించే ప్రజల ప్రాణాలకు.. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్, అసోంకు ముప్పు ఉంటుందని 'పీటీఐ'కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు.
అంతర్జాతీయ నీటి పంపకాల ఒప్పందానికి చైనా నిరాకరిస్తుండటంతో ఈ ప్రాజెక్టు మరింత ఆందోళన కలిగిస్తోందని పెమా ఖండూ అన్నారు. 'సమస్య ఏమిటంటే చైనాను విశ్వసించలేం. వారు ఏమి చేస్తారో ఎవరికీ తెలియదు. ప్రాజెక్టు వల్ల మా గిరిజనులు, వారి అస్థిత్వానికి కూడా ముప్పు ఉంటుంది. ఈ ప్రాజెక్టును వాటర్ బాంబ్‌గా కూడా ఉపయోగించవచ్చు' అని తెలిపారు. చైనా కనుక అంతర్జాతీయ జలాల పంపిణీ ఒప్పదంపై సంతకాలు చేస్తే డ్యామ్ వల్ల ఎంతో ఉపయోగం ఉంటుందని అన్నారు. అరుణాచల్, అసోంలో రుతుపవనాలతో వచ్చే వరదలను నిరోధించవచ్చని, అలాంటి ఒప్పదాలు లేకపోతే తలెత్తే ముప్పు కూడా తీవ్రంగా ఉండవచ్చని హెచ్చరించారు.
డ్యామ్ పూర్తయి అకస్మాత్తుగా జలాలను విడుదల చేస్తే తమ సియాంగ్ బెల్ట్ మొత్తం నాశానమవుతుందని, ఆదివాసీలు పూర్తిగా భూములు, ఆస్తులు, చివరకు ప్రాణాలు కూడా కోల్పోతారని అన్నారు. ఈ ప్రమాదాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టు కోసం కృషి చేస్తోందన్నారు. ఇది మనను మనం పరిరక్షించుకునేందుకు, మన నీటి అవసరాలను తీర్చుకునేందుకు ఉపయుక్తమవుతుందన్నారు.
చైనా ఇప్పటికే వారిపైపు ఉన్న బ్రహ్మపుత్ర నదిపై ప్రాజెక్టు ప్రారంభించడం కానీ ప్రారంభానికి సిద్ధంగా ఉండటం కానీ చేస్తోందని ఆయన పునరుద్ఘాటించారు. అయితే భారత్‌తో ఎలాంటి అప్‌డేటెడ్ సమాచారం పంచుకోవడంలేదని చెప్పారు. డ్యామ్ పూర్తయితే లాంగ్ రన్‌లో మన సియాంగ్, బ్రహ్మపుత్ర నదులు గణనీయంగా ఎండిపోయే అవకాశాలున్నాయని అన్నారు. చైనా ఒకవేళ ఆకస్మికంగా వరద జలాలను వదిలిపెడితే దానిని అదుపు చేసేందుకు మనం సొంత మౌలిక సదుపాయాలతో సిద్ధంగా ఉండాలని అన్నారు.
కాగా, చైనా డ్యామ్ ప్రాజెక్టు, బ్రహ్మపుత్రకు సంబంధించి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామని, దేశ ప్రయోజనాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం గత మార్చిలో తెలిపింది.
ఇవి కూాడా చదవండి..
సీఎం మార్పు ఊహాగానాలు... ప్రియాంకను కలిసిన డీకే
జస్టిస్ వర్మ అభిశంసనపై సంతకాలు షురూ.!
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి