Amit Shah: ‘పహల్గాం’ ముష్కరులను మట్టుపెట్టాం: షా
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:16 AM
పహల్గాం మారణకాండలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు హతమార్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీరు పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు వెల్లడించారు.

ఆపరేషన్ మహాదేవ్‌లో సులేమాన్, అఫ్గానీ, జిబ్రాన్ హతమయ్యారు
ఈ ముగ్గురూ ఉగ్రదాడిలో పాల్గొన్నారు
అందుకు పక్కా ఆధారాలు ఉన్నాయి
లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి షా
కాంగ్రెస్ తప్పిదం వల్లే పాక్ ఏర్పడిందని విమర్శ
న్యూఢిల్లీ, జూలై 29: పహల్గాం మారణకాండలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను మన భద్రతా బలగాలు హతమార్చాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీరు పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ మహాదేవ్‌లో ఉగ్రవాదులను కాల్చి చంపినట్లు వెల్లడించారు. పహల్గాం దాడిలో పాల్గొన్నది వీరేనని పక్కా ఆధారాలతో గుర్తించినట్లు అమిత్ షా తెలిపారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై జరిగిన ప్రత్యేక చర్చలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ మహాదేవ్‌లో మరణించిన ఉగ్రవాదులను సులేమాన్ అలియాస్ ఫైజల్, అఫ్గానీ, జిబ్రాన్‌గా గుర్తించినట్లు చెప్పారు. సులేమాన్, అఫ్గానీలు లష్కరే తాయిబాలో ఏ క్యాటగిరీ కమాండర్లని, జిబ్రాన్ కూడా కరడుగట్టిన ఉగ్రవాది అని తెలిపారు. పహల్గాం దాడికి ముందు వీరికి ఆశ్రయం కల్పించి, భోజనం పెట్టిన వారిని భద్రతాదళాలు అదపులోకి తీసుకున్నాయని.. ప్రస్తుతం వారే ఈ ముగ్గురు ఉగ్రవాదులను గుర్తించారని వివరించారు. ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న రెండు ఏకే-47 రైఫిళ్లు, ఒక ఎం-9ను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపగా.. పహల్గాం దాడిలో వాడిన బుల్లెట్లు ఈ తుపాకుల నుంచి వచ్చినవేనని ఆరుగురు నిపుణులు తనకు వీడియో కాల్ చేసి చెప్పారని షా వెల్లడించారు. మరణించిన ఇద్దరు ఉగ్రవాదుల నుంచి రెండు పాకిస్థాన్ ఓటరు ఐడీ కార్డులతో పాటు పాక్‌లో తయారైన చాక్లెట్లు, ఆయుధాలను కూడా మన బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదులను జమ్మూకశ్మీరులోకి పంపుతోందని, కశ్మీరులో స్థానిక ఉగ్రవాదులు ఎవరూ లేరని షా స్పష్టం చేశారు. ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన వార్త విని అధికార, ప్రతిపక్ష సభ్యులందరూ ఎంతో సంతోషిస్తారని భావించానని.. విపక్ష సభ్యుల ముఖాలు మాత్రం దిగాలుగా ఉన్నాయని చురకలంటించారు. అన్ని రకాల ఉగ్రవాదానికి పాకిస్థానే మూలం అని.. కాంగ్రెస్ చేసిన తప్పిదం వల్లే పాకిస్థాన్ ఉద్భవించిందని ఆరోపించారు. వారు విభజనను వ్యతిరేకించి ఉంటే.. పాకిస్థాన్ అనేదే ఉండేది కాదని అన్నారు. 1948లో మన సాయుధ బలగాలు పాక్ ఆక్రమిత కశ్మీరును స్వాధీనం చేసుకొనే స్థితిలో ఉండగా.. నాటి ప్రధాని నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విరమణను ప్రకటించారని అమిత్ షా గుర్తుచేశారు. 1971లో 93 వేల మంది పాక్ సైనికులు మనకు లొంగిపోయారని, 15 వేల చదరపు కిలోమీటర్ల మేర పాకిస్థాన్ భూభాగం మన అధీనంలో ఉందని.. అయినా పీవోకేను తిరిగి తీసుకోలేకపోయారని చెప్పారు. 1962లో చైనాతో యుద్ధం సమయంలో నాటి ప్రధాని నెహ్రూ ఆకాశవాణిలో ప్రసంగిస్తూ అసోంకు వీడ్కోలు పలికారన్నారు.
ఆధారాలు ఇస్తా
చిదంబరం వ్యాఖ్యలపై అమిత్ షా స్పందిస్తూ.. హోం మంత్రిగా చేసిన వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం చాలా దురదృష్టకరమని చెప్పారు. ‘‘వాళ్లు ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఎవరిని రక్షించాలని చూస్తున్నారు? ఉగ్రవాదులు పాకిస్థానీలు కాదని చెబుతున్నారు. తద్వారా మాజీ హోం మంత్రి చిదంబరం పాకిస్థాన్‌కు క్లీన్‌చిట్ ఇవ్వాలని చూస్తున్నారు’’ అని షా ధ్వజమెత్తారు. ఉగ్రదాడిలో పాక్ ప్రమేయాన్ని యావత్ ప్రపంచం అంగీకరించగా.. చిదంబరం మాత్రం సందేహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. ఆధారాలు కావాలని చిదంబరం అడిగితే తాను ఇస్తానని అమిత్ షా చెప్పారు. ఈ సందర్భంగా ఆయన 2008లో జరిగిన సంఘటనను గుర్తుచేశారు. ఢిల్లీలోని బాట్లా హౌస్‌లో దాక్కొన్న ఇద్దరు ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాదులను మన బలగాలు కాల్చి చంపాయని, ఆ వార్త తెలిసిన సోనియా కన్నీళ్లు పెట్టుకోవడం తనకు ఆశ్చర్యం కలిగించిందన్నారు. అలాంటి కాంగ్రె్‌సకు ఉగ్రవాదంపై ఏం చర్యలు తీసుకున్నారని తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు. ఇదిలా ఉండగా, పాకిస్థాన్ భూభాగంలోని ఉగ్రవాదంపై ఆ దేశం చర్యలు తీసుకోలేకపోతే సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ చెప్పారు. పీవోకే భారత్‌లో కలిసే రోజు ఎంతో దూరంలో లేదన్నారు.
ఖర్గేకు నడ్డా క్షమాపణ
రాజ్యసభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చలో ఖర్గే గంటకుపైగా ప్రసంగించారు. అనంతరం బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ.. ఖర్గే మతిస్థిమితం కోల్పోయినట్లున్నారని, అందుకే ప్రధాని మోదీపై ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. నడ్డా వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నడ్డా క్షమాపణలు చెప్పాలని ఖర్గే డిమాండ్ చేశారు. స్పందించిన నడ్డా.. ‘‘నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నా. ఒకవేళ ఖర్గేను నా వ్యాఖ్యలు బాధించి ఉంటే, క్షమాపణ చెబుతున్నా’’ అన్నారు.