Share News

Pahalgam Attack: పహల్గాం ఉగ్రవాదులను పట్టించిన శాటిలైట్‌ ఫోన్‌

ABN , Publish Date - Jul 30 , 2025 | 05:21 AM

పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్‌ను.. అతడి ఇద్దరు సహచరులను మట్టుబెట్టిన మన భద్రతా దళాలు అసలు వారి ఉనికిని ఎలా పసిగట్టాయి? వారి దాకా ఎలా చేరుకున్నాయి

Pahalgam Attack: పహల్గాం ఉగ్రవాదులను పట్టించిన శాటిలైట్‌ ఫోన్‌

న్యూఢిల్లీ, శ్రీనగర్‌, జూలై 29: పహల్గాం ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్‌ను.. అతడి ఇద్దరు సహచరులను మట్టుబెట్టిన మన భద్రతా దళాలు అసలు వారి ఉనికిని ఎలా పసిగట్టాయి? వారి దాకా ఎలా చేరుకున్నాయి? అంటే.. ఆ వివరాలన్నింటినీ అమిత్‌ షా లోక్‌సభ సాక్షిగా వెల్లడించారు. 26 మంది ప్రాణాలను బలిగొన్న పహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజు రాత్రి నుంచే ఆపరేషన్‌ మహదేవ్‌ ప్రారంభమైందని.. ఆ దాడికి పాల్పడిన ముగ్గురు ఉగ్రవాదుల గుర్తింపును ధ్రువీకరించుకోవడానికి, వారిని వేటాడడానికి కొన్ని నెలల సమయం పట్టిందని ఆయన వెల్లడించారు.


పహల్గాం దాడి వెనుకే కాక.. 2024 అక్టోబరులో సోనామార్గ్‌ పట్టణానికి సమీపంలోని గగన్‌గిర్‌లో జరిగిన ఉగ్రదాడి వెనుక కూడా సులేమాన్‌ హస్తం ఉందని అమిత్‌ షా చెప్పారు. ఏప్రిల్‌ 22న పహల్గాం దాడి జరిగినప్పటి నుంచి సులేమాన్‌, హంజా అఫ్గానీ, జిబ్రాన్‌ను హతం చేసే దాకా జరిగిన పరిణామాలను ఆయన వివరించారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం..

  • పహల్గాం ఉగ్రదాడి జరిగిన రోజున ప్రభుత్వం భద్రతా సమావేశం నిర్వహించింది. ఆ మర్నాడు కూడా (ఏప్రిల్‌ 23న) ఇండియన్‌ ఆర్మీ, సీఆర్పీఎఫ్‌, బీఎ్‌సఎఫ్‌, జమ్ముకశ్మీర్‌ పోలీసులతో మరో భేటీ నిర్వహించారు. ఉగ్రవాదులు ఎట్టిపరిస్థితుల్లోనూ భారత్‌ను దాటి పాకిస్థాన్‌లో ప్రవేశించకుండా అడ్డుకోవాలని నిర్ణయించారు. మే 22వ తేదీన.. దాచిగాం ప్రాంతంలో ఉగ్రవాదుల కదలికలపై ఇంటెలిజెన్స్‌ బ్యూరోకి సమాచారం అందింది.

  • ఉగ్రవాదుల సిగ్నల్స్‌ను పట్టుకోవడానికి మన ఇంటెలిజెన్స్‌, ఆర్మీ.. దేశీయంగా తయారుచేసిన పరికరాలనే ఉపయోగించాయి. అప్పట్నుంచీ ఉగ్రవాదుల సిగ్నల్స్‌ను వెతుకుతూ.. మన ఆర్మీ, నిఘా, సీఆర్పీఎఫ్‌ అధికారులు ఉత్తకాళ్లతో పలు పర్వతాలను అధిరోహించారు.

  • ఎన్‌ఐఏ అధికారులు తమ దర్యాప్తులో భాగంగా బాధితులు, పహల్గాంలో గుర్రాలు నడిపేవారు (పోనీవాలాలు), పర్యాటకులు, ఫొటోగ్రాఫర్లు, స్థానిక దుకాణదారులు.. ఇలా 1055 మందితో.. 3000 గంటలకు పైగా మాట్లాడారు. వారంతా చెప్పిన వివరాల ఆధారంగా ఉగ్రవాదుల ఊహాచిత్రాలు గీయించారు. పర్యాటకులను కాల్చిచంపిన ఉగ్రవాదులకు.. ఆశ్రయం ఇచ్చిన బషీర్‌, పర్వేజ్‌లను ఎన్‌ఐఏ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

  • ఏప్రిల్‌ 21వ తేదీ రాత్రి 8 గంటల సమయంలో ఉగవ్రాదులు బైసారన్‌లోయకు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమ గుడిసె వద్దకు వచ్చారని.. వారు ఏకే-47 తుపాకులను, ఎం9 రైఫిళ్లను ధరించి ఉన్నారని.. తమ వద్ద భోజనం చేశారని బషీర్‌, పర్వేజ్‌ తెలిపారు. ఇలా నెలల తరబడి సేకరించిన సమాచారం ఆధారంగా వేట కొనసాగించిన మన దళాలకు జూలై 22న ఆ ఉగ్రవాదుల జాడ తెలిసింది.


రెండుసార్లు సంకేతం..

ఆపరేషన్‌ మహదేవ్‌ గురించి విశ్వసనీయ వర్గాలు తెలిపిన సమాచారం ప్రకారం.. ఉగ్రవాదులు ఉపయోగించిన చైనీస్‌ ఉపగ్రహ ఫోన్‌ నుంచి శనివారం వచ్చిన సంకేతంతో ఆర్మీ, జమ్ముకశ్మీర్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. అప్పటికి 17 రోజుల క్రితం అదే తరహా సంకేతం వచ్చి ఉండడంతో.. అది ఉగ్రవాదులకు సంబంధించేనని భావించి వేట కొనసాగించారు. ఆ సంకేతం ఆధారంగా డ్రోన్ల సాయంతో వారిని అన్వేషిస్తూ శ్రీనగర్‌ శివార్లలో ఉన్న దాచిగాం అడవులు, జబర్వాన్‌ పర్వత శ్రేణిలో.. మహదేవ్‌పీక్‌ సమీపంలోని ముల్నార్‌ పీక్‌ వద్దకు చేరుకున్నారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక.. 2 గంటల సమయంలో సులేమాన్‌ బృందం తమ వద్ద ఉన్న టీ82 అలా్ట్రసెట్‌ కమ్యూనికేషన్స్‌ డివై్‌సను ఆన్‌ చేసింది. దాన్ని మన దళాలు గుర్తించాయి. సోమవారం ఉదయం డ్రోన్‌తో వారి జాడ కోసం గాలించాయి. డ్రోన్‌ పంపిన విజువల్స్‌ ఆధారంగా వారు ఉన్న స్థలాన్ని గుర్తించారు. ఉదయం 10 గంటల సమయంలో.. ఆర్మీకి చెందిన రాష్ట్రీయ రైఫిల్స్‌ ఉగ్రవాద నిర్మూలన దళం, 4 పారా స్పెషల్‌ ఫోర్సె్‌సతో కలిసి మహదేవ్‌ శిఖరంపైకి ఎక్కడం ప్రారంభించారు. అరగంటలోపే ఉగ్రవాదులు ఉన్న ప్రదేశానికి చేరుకున్నారు. 11 గంటల సమయంలో వారిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు. 11.45 గంటలకల్లా ఆపరేషన్‌ మహదేవ్‌ ముగిసింది.


ఈ వార్తలు కూడా చదవండి

సుప్రీంకోర్టులో సీఎం రేవంత్ రెడ్డికి ఊరట

హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 30 , 2025 | 05:21 AM