Air India Flights: ఎప్పుడు రద్దయ్యేది..ఎప్పుడు వెళ్లేదీ తెలియదు
ABN , Publish Date - Jun 29 , 2025 | 04:26 AM
అమెరికాకు చెందిన అనీశ్ అగర్వాల్ తల్లి, తండ్రి.. అనీశ్ సోదరుడు ఈనెల 27న ఎయిర్ ఇండియా విమానం (ఏ1-190)లో టొరంటో నుంచి ఢిల్లీ మీదుగా పుణె రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఎయిర్ ఇండియా సంస్థ వారి ప్రయాణ తేదీలను మార్చేసింది!

ఎయిర్ ఇండియా సర్వీసులతో ప్రయాణికుల ఇబ్బందులు
పుణె, జూన్ 28: అమెరికాకు చెందిన అనీశ్ అగర్వాల్ తల్లి, తండ్రి.. అనీశ్ సోదరుడు ఈనెల 27న ఎయిర్ ఇండియా విమానం (ఏ1-190)లో టొరంటో నుంచి ఢిల్లీ మీదుగా పుణె రావాల్సి ఉంది. అయితే ఉన్నట్టుండి ఎయిర్ ఇండియా సంస్థ వారి ప్రయాణ తేదీలను మార్చేసింది! ముగ్గురూ వేర్వేరు విమానాల్లో.. వేర్వేరు తేదీల్లో వెళ్లాల్సి ఉంటుందని నిర్దేశించింది. ఆ మేరకు తన సోదరుడు 27న, తండ్రి 28న, తల్లి 30న టొరంటో నుంచి విమానాల్లో భారత్‌కు బయలుదేరాల్సి ఉంటుందంటూ సందేశం వచ్చిందని అనీశ్ పేర్కొన్నారు. దీనిపై తాను ఎయిర్ ఇండియా కస్టమర్ సపోర్టు నంబరుకు ఫోన్ చేసినా ఫలితం లేకపోయిందని.. తనకాల్‌ను నాలుగు గంటలపాటు హోల్డ్‌లో పెట్టి, ఆ తర్వాత కట్ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పని పరిస్థితుల్లో అదనంగా మూడు రోజుల పాటు టొరంటో హోటల్ గదుల్లో ఉండిపోయామని చెప్పారు. ఇక పుణె నుంచి ముంబై మీదుగా అమెరికా వెళ్లాల్సిన నలుగురు కుటుంబసభ్యులకూ ఇదే పరిస్థితి ఎదురైంది. ఎయిర్ ఇండియా విమానాల్లో టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఇటీవల ఇలాంటి చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. విమానాల నిర్వహణ, ప్రయాణికుల భద్రతకు సంబంధించి తమ అంతర్జాతీయ సర్వీసులను 15శాతం మేర తాత్కాలికంగా కుదించినట్లు సంస్థ పేర్కొంది. దేశీయంగా కొన్ని సర్వీసులనూ తగ్గించినట్లు వెల్లడించింది. ఎయిర్ ఇండియాలో సింగపూర్‌కు వెళ్లిన ఓ ప్రయాణికుడు తనకు ఎదురైన అనుభవాన్ని వివరించారు. తాను.. జూన్ 23న సింగపూర్‌కు బయలుదేరాల్సి ఉండగా 12 గంటల ముందు విమానం రద్దయిందని సమాచారం ఇచ్చారని, తర్వాత ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసినా ముందు సర్వీసు కన్నా 8గంటలు నిరీక్షించాల్సి వచ్చిందని చెప్పారు.