Scientists: ఏఐతో నిండు 150 ఏళ్లు
ABN , Publish Date - Jul 07 , 2025 | 02:04 AM
నిండు నూరేళ్లూ చల్లగా ఉండు ..అని పెద్దలు దీవిస్తుంటారు! మనిషికి పూర్ణాయుర్దాయం అంటే వందేళ్లని మనందరి భావన.

2030 కల్లా మనిషి సగటు జీవితకాలం రెట్టింపు.. శాస్త్రజ్ఞుల అంచనా
‘కృత్రిమ మేధ’ సాయంతో జన్యుమార్పిడి, వైద్య రంగాల్లో పరిశోధనలు వేగవంతం
శరీరం లోపలికి వెళ్లి కణాల స్థాయిలో రిపేర్ చేసే నానోబోట్లు అందుబాటులోకి
మనిషి మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీసే సాంకేతిక పరిజ్ఞానం కూడా..
150 ఏళ్లు కాదుగానీ.. నిండు నూరేళ్లు జీవించే చాన్స్: మరికొందరు శాస్త్రజ్ఞులు
న్యూఢిల్లీ, జూలై 6: ‘నిండు నూరేళ్లూ చల్లగా ఉండు’ ..అని పెద్దలు దీవిస్తుంటారు! మనిషికి పూర్ణాయుర్దాయం అంటే వందేళ్లని మనందరి భావన. కానీ.. స్వాతంత్య్రం వచ్చే నాటికి భారతీయుల సగటు జీవితకాలం కేవలం 32 సంవత్సరాలు! మెరుగైన జీవనానికి అవసరమైన సౌకర్యాలు, సరైన వైద్యసదుపాయాలు లేకపోవడం.. తరచూ ప్రబలే అంటువ్యాధులు.. ఇలా రకరకాల కారణాల వల్ల ఒక్క మనదేశంలోనే కాక ప్రపంచంలోని చాలా దేశాల్లో 70-80 ఏళ్ల క్రితం దాకా కూడా సగటు జీవితకాలం చాలా తక్కువగా ఉండేది. కానీ.. వైద్యరంగంలో విప్లవాత్మక పరిశోధనల వల్ల, నూతన సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే సరికొత్త వైద్య ఉపకరణాలు, రకరకాల వ్యాధులను అరికట్టే టీకాలు అందుబాటులోకి రావడం వల్ల.. మనలో ఆరోగ్యం పట్ల పెరిగిన స్పృహవల్ల.. సగటు జీవితకాలం గణనీయంగా పెరిగింది. 70-80 ఏళ్ల క్రితంతో పోలిస్తే శిశుమరణాల రేటు బాగా తగ్గిపోయింది. భారతీయుల సగటు జీవితకాలం ఇప్పుడు 70 ఏళ్లు కాగా.. హాంకాంగ్, దక్షిణ కొరియా పౌరులు 85 ఏళ్ల సగటు జీవితకాలంతో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచారు.
మరి తదుపరి దశ ఏమిటి? ఏ టెక్నాలజీ సాయంతో మనిషి జీవితకాలాన్ని మరింత పెంచవచ్చు? ..అంటే, ఈ ప్రశ్నలకు సమాధానం ‘కృత్రిమమేధ’ అని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ఏఐ వల్ల 2030 నాటికి.. అంటే కేవలం వచ్చే ఐదేళ్లలోనే మానవ జీవితకాలం రెట్టింపు అవుతుందని వారు అంచనా వేస్తున్నారు. రెట్టింపు అంటే.. దాదాపుగా 150 సంవత్సరాలు! మనం అనుకునే పూర్ణాయుష్షు కన్నా యాభై ఏళ్లు ఎక్కువ!! ఆధునిక వైద్యం వల్ల జీవితకాలం పెరిగిందంటే.. దాంట్లో ఒక అర్థం ఉంది. మరి కృత్రిమ మేధతో జీవితకాలం ఎలా రెట్టింపు అవుతుంది? అంటే.. వేలాది పత్రాలను సైతం వేగంగా పరిశీలించి క్షణాల్లో విశ్లేషించే శక్తి ఏఐకి ఉందని శాస్త్రజ్ఞులు గుర్తుచేస్తున్నారు. ఆ శక్తిని వినియోగించుకోవడం ద్వారా.. సరైన చికిత్స లేని పలు ఆరోగ్య సమస్యలకు కొత్త కొత్త పరిష్కారాలను కనుగొనవచ్చని, కొన్ని సమస్యలు అసలు తలెత్తకుండా ముందుజాగ్రత్త పడొచ్చని తద్వారా మనుషుల లైఫ్‌స్పాన్‌ను పెంచడం సాధ్యమని వారు ప్రతిపాదిస్తున్నారు. ఉదాహరణకు.. మన శరీరంలోని క్రోమోజోముల చివరి భాగంలో ఉండే టెలోమియర్ల పొడుగు మన వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతుందని, ఆ ప్రక్రియను నిరోధించగలిగితే వృద్ధాప్యాన్ని జయించవచ్చని శాస్త్రజ్ఞులు ఇప్పటికే గుర్తించారు.
కొన్ని ఇంజెక్షన్లు, మందుల ద్వారా టెలోమియర్ల పొడుగును తగ్గించకుండా ఆపొచ్చని వారి పరిశోధనల్లో వెల్లడైంది. కానీ.. వాటివల్ల కణవిభజన అపరిమితంగా జరిగి క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందని తెలిసింది. దీంతో.. ఆ ముప్పు లేకుండా టెలోమియర్ల పొడుగు తగ్గిపోయే ప్రక్రియను నిరోధించే దిశగా శాస్త్రవేత్తలు చాలాకాలంగా పరిశోధనలు చేస్తున్నారు. ఆ పరిశోధనలకు ఏఐని ఊతంగా వాడుకోగలిగితే ఇంకా వేగంగా ఫలితాలను సాధించవచ్చని కొందరు శాస్త్రజ్ఞులు అభిప్రాయపడుతున్నారు.
మెడికల్ నానోబోట్లు..
ఏఐ సాయంతో మానవ జీవితకాలాన్ని వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయొచ్చని.. అమెరికాలోని క్యాలిఫోర్నియాకు చెందిన ప్రముఖ ఏఐ సంస్థ ‘ఆంథ్రోపిక్’ వ్యవస్థాపకుడు డేరియో పదేపదే చెబుతున్నారు. మరో నిపుణుడు.. రే కర్జ్‌వెయిల్‌ది కూడా ఇదే మాట. మానవుల్లో వయసుమీరే ప్రక్రియను 2032 నాటికి ఏఐ నియంత్రించగలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పటికి కృత్రిమమేధతో పనిచేసే మెడికల్ నానోబోట్లు అందుబాటులోకి వస్తాయని, మనకు ఏదైనా రోగం వచ్చినప్పుడు ఏఐ సాయంతో సమస్య ఏమిటో గుర్తించి.. ఈ మెడికల్ నానోబోట్లను శరీరంలోకి పంపిస్తే అవి కణ స్థాయిలో మరమ్మతులు చేస్తాయని చెప్పారు. అలాగే.. ఏఐ సాయంతో అప్పటికి మన మెదడులోని సమాచారాన్ని బ్యాకప్ తీయడం కూడా సాధ్యమవుతుందని ఆయన అంచనా. అలా బ్యాకప్ తీయగలిగితే మనిషి భౌతికంగా లేకపోయినా మానసికంగా చిరంజీవిగానే మిగిలినట్టు!!
జన్యు పరిశోధనలకు..
జన్యులోపాలను సరిచేయడానికి ప్రస్తుతం క్రిస్పర్ అనే జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ, అది ఇంకా చాలా ప్రాథమిక స్థాయిలో ఉంది. లోపం ఉన్న చోట సవరణకే ఉపయోగిస్తున్నారు. కానీ.. మన శరీరంలోని జన్యువులు కాలక్రమంలో రకరకాల ప్రభావాలకు లోనై మార్పులు చెందుతుంటాయి. వాటన్నింటినీ ఊహించి (లేదా) ముందే అంచనా వేసి జన్యుసవరణ చేసే వెసులుబాటు ప్రస్తుతానికి అందుబాటులో లేదు. ఈ ప్రక్రియలో ఏఐ సాయం తీసుకుంటే.. కాలక్రమంలో ఒక జన్యువులో ఎలాంటిమార్పులు సంభవించే అవకాశం ఉందో సమగ్రంగా విశ్లేషించి అంచనా వేస్తుంది. దానివల్ల చాలారకాల అనారోగ్యాలను రాకుండా అడ్డుకునే అవకాశం ఉందని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.
ఇంత త్వరగానా?
కృత్రిమ మేధ సామర్థ్యం గురించి కొందరు శాస్త్రజ్ఞులు ఆశావహ దృక్పథంతో ఆలోచిస్తుండగా.. మరికొందరు మాత్రం ఇవన్నీ ఐదేళ్లలో సాధ్యమవుతాయనకోలేమంటున్నారు. ‘‘సినిమాల్లో చూపించినట్టుగా ఏఐ మనల్ని హద్దుల్లేని శక్తులుగా తయారుచేసేయలేదు. కాకపోతే, మనల్ని మరింత ఆరోగ్యంగా, చురుగ్గా ఉంచగలుగుతుంది. మరీ 150 ఏళ్లు కాదుగానీ.. ఏఐ మనుషులు కనీసం వందేళ్లు జీవించడం మన జీవితకాలంలోనే చూడగలుగుతాం’’ అని ‘డేటా సొసైటీ’ కంపెనీ చీఫ్ సైంటిస్ట్ ద్మిత్రీ అడ్లెర్ తెలిపారు.