Share News

IT Job Crisis: ఐటీలో ఉద్యోగాల ఊచకోత!

ABN , Publish Date - Jul 29 , 2025 | 06:09 AM

ఐటీ ఉద్యోగమంటే నిన్న మొన్నటి వరకు పెద్ద క్రేజ్‌. లక్షల్లో జీతం. వారానికి ఐదు రోజుల పని. ఏటా జీతాల పెంపు..

IT Job Crisis: ఐటీలో ఉద్యోగాల ఊచకోత!
IT Jobs

  • టెకీల పాలిట భస్మాసుర హస్తంగా ఏఐ

  • టీసీఎ్‌సలో 12,000 మందికి ఉద్వాసన

  • ఇదే బాటలో మిగతా కంపెనీలు..?

ఐటీ ఉద్యోగమంటే నిన్న మొన్నటి వరకు పెద్ద క్రేజ్‌. లక్షల్లో జీతం. వారానికి ఐదు రోజుల పని. ఏటా జీతాల పెంపు, రెండు మూడేళ్లకు ఒకసారి ప్రమోషన్లు. ఆ వ్యవహారమే వేరుగా ఉండేది. ఇప్పుడదంతా గతం. ఇప్పుడు ఉన్న ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితి. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనని హడలిపోతున్నారు. ఆటోమేషన్‌, కృత్రిమ మేథ(ఏఐ) కారణంగా దేశంలో లక్ష నుంచి మూడు లక్షల ఐటీ ఉద్యోగాలు పోయే ప్రమాదం ఉందన్న వార్తలు వారిని మరింత భయపెడుతున్నాయి. దేశీయ ఐటీ దిగ్గజ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసె్‌స(టీసీఎస్‌) 12,000 మందికి పైగా ఉద్యోగులను ఇంటికి పంపించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. భవిష్యత్‌ అవసరాలకు తగ్గట్లు కంపెనీని సిద్ధం చేయాలంటే ఈ చర్య తప్పడం లేదని తెలిపింది. టీసీఎస్‌ చేసిన ఈ ప్రకటన ఐటీ రంగంలో పెను సంచలనంగా మారింది. త్వరలో మిగతా ఐటీ కంపెనీలూ ఇదే బాట పట్టబోతున్నాయన్న వార్తలు ఐటీ ఉద్యోగులకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి.

కొత్త టెక్నాలజీల ప్రభావం

ఐటీ రంగంలో ఇప్పుడు ఆటోమేషన్‌, ఏఐ టెక్నాలజీలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ టెక్నాలజీల పుణ్య మా అని పునరావృత(రిపిటేటివ్‌) పనుల్లో ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది. మిగతా పనుల్లోనూ ఐటీ కంపెనీలు ఏఐని విరివిగా ఉపయోగిస్తున్నాయి. అందుకోసం ఉన్న ఉద్యోగులకే కొత్త డిజిటల్‌ టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి వినియోగించుకుంటున్నాయి. ఆ టెక్నాలజీలపై పట్టు సాధించలేని ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నాయి. టీసీఎస్‌ తీసివేతలకు ఇది కూడా ఒక కారణమని తెలుస్తోంది.

ఆర్థిక అనిశ్చితి

ఆర్థిక అనిశ్చితి కూడా ఐటీ ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సుంకాల పోటుతో అమెరికా, ఐరోపా దేశాల్లో అనిశ్చితి మరింత పెరిగింది. దీంతో అక్కడి కంపెనీల నుంచి భారత ఐటీ కంపెనీలకు పెద్దగా ప్రాజెక్టులు రావడం లేదు. దీంతో భారత్‌లోని ఐటీ కంపెనీల్లో బెంచ్‌ మీద ఉండే పనిలేని ఉద్యోగుల సంఖ్య పెరిగిపోతోంది. వీరిని ఇంటికి పంపించేందుకు కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. టీసీఎస్‌ ఇప్పటికే ప్రతి ఉద్యోగి ఏటా కనీసం 225 రోజుల పాటు ఏదో ఒక ప్రాజెక్టుపై పని చేయాలని స్పష్టంచేసింది. ఏ ఉద్యోగి అయినా 35 రోజులకు మించి బెంచ్‌ మీద ఉంటే వారి ఉద్యోగానికి ఎసరు తప్పదని హెచ్చరించింది.


లక్ష నుంచి 11 వేలకు తగ్గిన నియామకాలు

ఐటీ, బీపీవో కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు భారీగా తగ్గిపోయాయి. 2020లో దాదాపు లక్ష మందిని ఐటీ కంపెనీలు నియమించుకుంటే, 2024లో అది ఏకంగా 11,000కు పడిపోయింది. అదే సమయలో గ్లోబల్‌ క్యాపబిలిటీ కేంద్రాలు(జీసీసీ) 1.2 లక్షల మందిని నియమించుకున్నాయి. ఐటీ కంపెనీలు గతంలోలా ఇంజనీరింగ్‌ కాలేజీలకు వెళ్లి ఫ్రెషర్లకు పెద్ద సంఖ్యలో ప్లేస్‌మెంట్లు ఇవ్వడం లేదు. ఉన్న ఉద్యోగులకే కొత్త టెక్నాలజీల్లో శిక్షణ ఇచ్చి పని కానిచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఫ్రెషర్లకు కష్టాలు తప్పవని స్పష్టమవుతోంది.

ఆదాయమే ముఖ్యం

గతంలో ఐటీ కంపెనీల ఆదాయం పెరిగే కొద్దీ, ఉద్యోగుల సంఖ్య పెరిగేది. ఇప్పుడు కంపెనీలు ఉద్యోగాలకు కోత పెడుతూ ఆదాయం పెంచుకుంటున్నాయి. టీసీఎస్‌ సహా అన్ని ఐటీ కంపెనీలు ఇదే బాట పడతాయని నిపుణుల అంచనా. ఇప్పుడు కోడింగ్‌, ప్రోగ్రామింగ్‌ రాసే ఏఐ టూల్స్‌ కూడా వచ్చేశాయి. దీంతో ఐటీ కంపెనీలు ఉన్న ఉద్యోగులను ముఖ్యంగా అధిక జీతాలు ఉండే మిడ్‌, సీనియర్‌ ఉద్యోగులను వదిలించుకునే పనిలో పడ్డాయి. కొవిడ్‌ తర్వాత ఐటీ కంపెనీలకు ఇబ్బడి ముబ్బడిగా ప్రాజెక్టులు వచ్చాయి. కొవిడ్‌ కారణంగా ఐటీ కంపెనీలు అనుసరించిన ‘ఇంటి నుంచి పని’ విధానం ఉద్యోగులకు బాగా కలిసివచ్చింది. ఇప్పుడు డిజిటల్‌ టెక్నాలజీలతో పరిస్థితులు మారిపోయాయి. ఏఐ కారణంగా ఐటీ కంపెనీలు ఉద్యోగాల కోత ప్రారంభించాయి.

- ఆంధ్రజ్యోతి బిజినెస్‌ డెస్క్‌


ఉద్యోగుల తొలగింపు అన్యాయం, అక్రమం

టీసీఎస్‌ నిర్ణయాన్ని జాతీయ ఐటీ ఉద్యోగుల సమాఖ్య నాసెంట్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఎంప్లాయీస్‌ సెనెట్‌(ఎన్‌ఐటీఈఎ్‌స) తీవ్రంగా తప్పుపట్టింది. ‘ఉద్యోగులు చెల్లించాల్సిన ఈఎంఐలు, ఇతర ఆర్థిక బాధ్యతలను నిర్వర్తించడం కష్టమవుతుంది. మానసికంగా, ఆర్థికంగా వారు అనుభవించే బాధ వర్ణనాతీతం’ అంటూ ఎన్‌ఐటీఈఎ్‌స జాతీయ అధ్యక్షుడు హర్‌ప్రీత్‌ సింగ్‌ సలూజా కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకు రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు. వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. లేకపోతే ఐటీ ఉద్యోగులు దేశవ్యాప్తంగా ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరించారు.

మరీ నిరాశ వద్దు

  • ఏఐ గురించి మరీ అంతగా భయపడాల్సిన అవసరం లేదనే వాదనలూ వినిపిస్తున్నాయి. దీంతో కొన్ని ఉద్యోగాలు పోయినా ఏఐ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ప్రాంప్ట్‌ ఇంజనీర్లు వంటి అనేక కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని టెక్‌ మహీంద్రా మాజీ సీఈఓ సీపీ గుర్నానీ వంటి పరిశ్రమ దిగ్గజాలు చెప్పడం విశేషం.

  • ఉద్యోగుల సంఖ్యను బట్టి ఐటీ కంపెనీల ఆదాయాలను అంచనా వేసే రోజులు పోయాయి. ఇక ఏఐ ఆధారంగానే వాటి ఆదాయాలను లెక్కించాల్సి ఉంటుంది.

  • సీపీ గుర్నానీ, మాజీ సీఈఓ, టెక్‌ మహీంద్రా

  • కొంతకాలంగా ఐటీ కంపెనీల లాభాలపై ఒత్తిడి పెరిగింది. టీసీఎస్‌ నిర్ణయానికి ఇది కూడా ఒక కారణం. టీ సఎస్‌ ఉద్యోగాల కోతకు సిద్ధమైనప్పుడు ఇతర ఐటీ కం పెనీలు కూడా అందుకు సిద్దంగా ఉన్నట్టు భావించాలి.

  • అశుతోష్‌ శర్మ, రీసెర్చి డైరెక్టర్‌, ఫారెస్టర్‌ కన్సల్టెన్సీ

  • కొన్ని ఆఫ్‌షోర్‌ ప్రాజెక్టుల పూర్తికి నైపుణ్యాల కొరత ఉంది. ఆ లోటును పూడ్చుకునేందుకు పునర్‌ వ్యవస్థీకరణ తప్పదు.

- సి.విజయ కుమార్‌,

ఎండీ,సీఈఓ,హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌

Updated Date - Jul 29 , 2025 | 07:08 AM