Share News

Aam Aadmi Party: ఉప ఎన్నికల్లో ఆప్‌ హవా

ABN , Publish Date - Jun 24 , 2025 | 04:21 AM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. గుజరాత్‌, పంజాబ్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల విజయబావుటా ఎగురవేసింది.

Aam Aadmi Party: ఉప ఎన్నికల్లో ఆప్‌ హవా

  • పంజాబ్‌, గుజరాత్‌లో ఒక్కో చోట గెలుపు

  • గుజరాత్‌లో ‘కడీ’ని నిలబెట్టుకున్న బీజేపీ

  • కేరళలో కాంగ్రెస్‌, బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌కు ఒక్కో సీటు

న్యూఢిల్లీ, జూన్‌ 23: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌).. గుజరాత్‌, పంజాబ్‌లలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల విజయబావుటా ఎగురవేసింది. గుజరాత్‌లో రెండు స్థానాలకు, పంజాబ్‌, కేరళ, బెంగాల్లో ఒక్కో సీటుకు ఈ నెల 19న పోలింగ్‌ జరిగింది. సోమవారం ఓట్ల లెక్కింపు జరిగింది. గుజరాత్‌లో విసావదర్‌ స్థానంలో ఆప్‌, కడీ(ఎస్సీ) నియోజకవర్గంలో బీజేపీ గెలిచాయి. 3 దశాబ్దాలుగా రాష్ట్రంలో బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తున్నా.. జునాగఢ్‌ జిల్లాలోని విసావదర్‌లో మాత్రం 2007 నుంచి గెలవకపోవడం విశేషం. 2023లో ఆప్‌ ఎమ్మెల్యే భూపేంద్ర భయానీ పార్టీకి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. తాజాగా ఇక్కడి నుంచి బరిలోకి దిగిన ఆప్‌ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా తన సమీప బీజేపీ ప్రత్యర్థి కిరీట్‌ పటేల్‌పై 17,554 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. మెహసానా జిల్లా కడీలో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర చావ్‌డా.. కాంగ్రెస్‌ అభ్యర్థి రమేశ్‌ చావ్‌డాపై 39,452 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. పంజాబ్‌లోని లూథియానా పశ్చిమ స్థానాన్ని ఆప్‌ నిలబెట్టుకుంది.


ఆ పార్టీ అభ్యర్థి, ఎంపీ సంజీవ్‌ అరోరా.. సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి భరత్‌ భూషణ్‌ ఆషుపై 10,637 ఓట్ల తేడాతో గెలిచారు. ఇక్కడ బీజేపీకి 20,323 ఓట్లు రాగా.. శిరోమణి అకాలీదళ్‌కు కేవలం 8,203 ఓట్లు మాత్రమే దక్కాయి. కేరళలో సీఎం పినరయి విజయన్‌ సారథ్యంలోని పాలక ఎల్‌డీఎఫ్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వయనాడ్‌ లోక్‌సభ పరిధిలోని నీలాంబర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ విజయం సాధించింది. కాంగ్రెస్‌ అభ్యర్థి ఆర్యదన్‌ షౌకత్‌.. సీపీఎం అభ్యర్థి స్వరాజ్‌పై 11,077 ఓట్ల ఆధిక్యంతో గెలిచారు. ఎల్‌డీఎఫ్‌ తన సిటింగ్‌ స్థానాన్ని ఉప ఎన్నికల్లో కోల్పోవడం ఇదే ప్రథమం. అలాగే విజయన్‌ రెండో టర్మ్‌లో నాలుగు స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే సీపీఎం ఒక్క సీటు కూడా గెలవలేదు. ఇక బెంగాల్లోని కాళీగంజ్‌ స్థానాన్ని టీఎంసీ భారీ మెజారిటీతో నిలబెట్టుకుంది. గత ఎన్నికల్లో ఇక్కడ గెలిచిన టీఎంసీ నేత నసీరుద్దీన్‌ అహ్మద్‌ మరణంతో ఆయన కుమార్తె ఆలీఫా అహ్మద్‌ టీఎంసీ తరఫున పోటీచేశారు. ఆమె తన సమీప బీజేపీ ప్రత్యర్థి ఆశిష్‌ ఘోష్‌పై 50,049 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. ఇదిలా ఉండగా, సంజీవ్‌ అరోరా లూథియానా వెస్ట్‌ ఉప ఎన్నికలో విజయం సాధించడంతో ఆయన స్థానంలో పంజాబ్‌ నుంచి తాను రాజ్యసభకు వెళ్తానంటూ వస్తున్న వార్తలను ఢిల్లీ మాజీ సీఎం, ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ ఖండించారు. తాను ఎగువసభకు వెళ్లడం లేదని స్పష్టంచేశారు. అరోరా రాజ్యసభ స్థానానికి రాజీనామా చేశాక ఎవరిని ఎంపిక చేయాలో తమ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) నిర్ణయిస్తుందన్నారు.

Updated Date - Jun 24 , 2025 | 04:24 AM