Share News

Chhattisgarh: 41 మంది మావోయిస్టుల లొంగుబాటు.. వీరిలో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు

ABN , Publish Date - Nov 26 , 2025 | 03:35 PM

రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం ప్రోత్సాహకరంగా ఉండటంతో మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని, తక్కిన మావోయిస్టులు కూడా హింసామార్గాన్ని విడనాడాలని ఎస్పీ జితేంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు.

Chhattisgarh: 41 మంది మావోయిస్టుల లొంగుబాటు.. వీరిలో 32 మందిపై రూ.1.19 కోట్ల రివార్డు
Maoists surrender

బిజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నాయి. బిజాపూర్ జిల్లా పోలీసుల సమక్షంలో 41 మంది మావోయిస్టులు బుధవారంనాడు లొంగిపోయారు. వీరిలో 12 మంది మహిళలు ఉన్నారు. లొంగిపోయిన వారిలో 32 మంది మావోయిస్టులపై రూ.1.19 కోట్ల రివార్డు సైతం ఉంది.


ప్రభుత్వ పునరావాస విధానం నచ్చడం వల్లే మావోయిస్టులు లొంగిపోయినట్టు బిజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో పీఎల్‌జీఏ బెటాలియన్ నెంబర్-1కు చెందిన నలుగురు, ఏరియా కమిటీకి చెందిన ముగ్గురు, 11 మంది ప్లాటూన్ అండ్ ఏరియా కమిటీ సభ్యులు, ఇద్దరు పీఎల్‌జీఏ సభ్యులు, నలుగురు ప్లాటూన్ కమాండర్లు, ఒక డిప్యూటీ కమాండర్, ఆరుగురు ప్లాటూన్ మెంబర్లు, తక్కిన వారు నిషేధిత సీపీఐ (మావోయిస్టు)కు చెందిన వారున్నారు. 41 మందిలో 39 మంది మావోయిస్ట్ సౌత్ సబ్-జోనల్ బ్యూరోకి చెందిన వారు. వీరికి దండకారణ్య స్పెషల్ జోన్ కమిటీ, తెలంగాణ స్టేట్ కమిటీ, నిషేధిత ధమ్రతి-గరియాబంద్-నువాపడ డివిజన్లతో సంబంధాలున్నట్టు అధికారులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం కింద తక్షణ సాయంగా రూ.50,000 అందించారు.


హింసను వీడిన 790 మంది మావోయిస్టులు

కాగా, రాష్ట్ర ప్రభుత్వ పునరావాస పథకం ప్రోత్సాహకరంగా ఉండటంతో మావోయిస్టులు హింసను వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారని, తక్కిన మావోయిస్టులు కూడా హింసామార్గాన్ని విడనాడాలని ఎస్పీ జితేంద్ర యాదవ్ విజ్ఞప్తి చేశారు. తాజా లొంగుబాట్లతో జిల్లాలో 2024 జనవరి నుంచి 790 మంది మావోయిస్టులు లొంగిపోయిన్టటు చెప్పారు. ఇదే సమయంలో జిల్లాలో 202 మంంది నక్సలైట్లు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో హతమయ్యారని, 1,031 మందిని అరెస్టు చేశామని తెలిపారు. గత 23 నెలల్లో మావోయిస్టు అగ్రనేతలతో సహా 2,200 మంది క్యాడర్ ఛత్తీస్‌గఢ్‌లో లొంగిపోయినట్టు వివరించారు.


ఇవి కూడా చదవండి..
టీ షర్టు వివాదంలో కునాల్ కమ్రా.. బీజేపీ, శివసేన వార్నింగ్

నాన్న ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చాను..

మరిన్ని జాతీయ వార్తలు కోసం క్లిక్ చేయండి.

Updated Date - Nov 26 , 2025 | 03:38 PM