Operation Sindhu: ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరిన మరో 311 మంది భారతీయులు
ABN , Publish Date - Jun 22 , 2025 | 05:43 PM
ఇరాన్‌లో చిక్కుకున్న తమ పిల్లల పరిస్థితి ఏవిధంగా ఉందో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న వారి తల్లిదండ్రులు 'ఆపరేషన్ సింధు' పేరుతో వారిని భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు.

న్యూఢిల్లీ: ఇజ్రాయెల్‌తో యుద్ధం కొనసాగుతుండటంతో ఇరాన్‌లో చిక్కుకుపోయిన భారతీయుల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధు (Operation Sindhu)లో భాగంగా 311 మంది భారతీయులతో మహాన్ ఎయిర్ ఫ్లైట్ (డబ్ల్యు50071ఏ) సురక్షితంగా ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారంనాడు చేరుకుంది. వీరిలో ఎక్కువమంది ఇరాన్‌లో చదువుకునేందుకు వెళ్లిన విద్యార్థులే ఉండగా, ఇందులోనూ 200 మంది వరకూ కశ్మీర్ విద్యార్థులు ఉన్నారు. ఇరాన్ అణుస్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా వైమానిక దాడులు జరిన నేపథ్యంలో ఆ దేశంలో ఉద్రిక్తతలు మరింత పెరిగిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది.
ఇరాన్‌లో చిక్కుకున్న తమ పిల్లల పరిస్థితి ఏవిధంగా ఉందో అని వేయికళ్లతో ఎదురుచూస్తున్న వారి తల్లిదండ్రులు 'ఆపరేషన్ సింధు' పేరుతో వారిని భారత ప్రభుత్వం సురక్షితంగా వెనక్కి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు. దీనిపై భారత ప్రభుత్వానికి జమ్మూకశ్మీర్ స్టూడెంట్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేసింది. ఇరాన్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో భారత్, ఇరాన్ అధికారులు చక్కటి సమన్వయంతో పనిచేయడాన్ని అసోసియేషన్ ప్రశంసించింది.
కాగా, ఇంతవరకూ ఇరాన్ నుంచి సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చిన భారతీయుల సంఖ్య 1428 మందికి చేరినట్టు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్ అధ్యక్షుడికి మోదీ ఫోన్.. తక్షణ శాంతికి పిలుపు
ఇజ్రాయెల్ నుంచి కూడా భారతీయుల తరలింపు
For National News And Telugu News