Share News

Winter: చలి నుంచి రక్షణనిచ్చే వంటకాలేంటో తెలుసుకుందామా...

ABN , Publish Date - Nov 30 , 2025 | 10:45 AM

సాధారణంగా లడ్డూ అనగానే నోరూరుతుంది. అయితే అన్ని లడ్డూలు తియ్యగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. దిల్లీలో ప్రసిద్ధిచెందిన ‘రామ్‌ లడ్డూ’లో ఉన్నదంతా కారమే. శీతాకాలం వచ్చిందంటే దేశ రాజధాని దిల్లీలో చలిని తట్టుకోవడం చాలా కష్టం.

Winter: చలి నుంచి రక్షణనిచ్చే వంటకాలేంటో తెలుసుకుందామా...

- చలికాలం.. నులివెచ్చగా...

చలికాలం వచ్చిందంటే చాలు... స్వెట్టర్లు, జాకెట్లు, మఫ్లర్లు, శాలువాలు, రగ్గులు బయటికి తీస్తారు. చలిమంటలు, హీటర్లు వేసుకుంటారు. శరీరానికి వెచ్చదనాన్నిచ్చే ఆహారం కూడా ఉంటుంది. చలి నుంచి రక్షణ కోసం చాలా వంటకాలే ఉన్నాయి. అయితే ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రుచి. కేవలం టీలు, సూప్‌లే కాకుండా... శరీరానికి వేడిని అందించే ఆయా రాష్ట్రాల ‘వింటర్‌ ఫుడ్‌’ విశేషాలే ఈవారం కవర్‌స్టోరీ.

చేదు లేకుండా...

book6.2.jpg

గుజరాతీయులు భోజనప్రియులు అన్నది తెలిసిందే. శీతాకాలంలో గుజరాత్‌లో ప్రత్యేకంగా కనిపించే వంటకం ‘మేతీ నూ పాక్‌’. దక్షిణ భారత మైసూర్‌ పాక్‌ లాంటిదే అని... పేరును బట్టే అర్థం అవుతోంది కదూ. అయితే మెంతులతో తీపి వంటకం ఏమిటన్నదే పెద్ద ప్రశ్న. మెంతిపొడి, నెయ్యి, చక్కెర లేదా బెల్లంతో ఈ వంటకాన్ని తయారుచేస్తారు. ఇంకా గోధుమ పిండి, శనగ పిండి, మినప్పిండితో పాటు గోంద్‌, వివిధ రకాల డ్రైఫ్రూట్స్‌ను చేర్చి మేతీ నూ పాక్‌ను తయారు చేస్తారు. ఇలా వివిధ రకాల పదార్థాలు మెంతిలోని చేదును తగ్గిస్తాయి. ఈ స్వీట్‌ను తినడం వల్ల త్వరితగతిన వేడి, శక్తి చేకూరుతుంది. రోగనిరోధకత పెరుగుతుంది. శరీరాన్ని రోజంతా వెచ్చగా ఉంచుతుంది. కీళ్ల నొప్పులూ, జీర్ణకోశ ఇబ్బందులూ తగ్గుతాయి.


ఆ రుచే అమృతం...

book6.6.jpg

హిమాలయాల దిగువనే ఉన్న పంజాబ్‌లో చలి తీవ్రత మరీ ఎక్కువ. శీతాకాలంలో అక్కడ ప్రతి ఇంట్లోనూ చేసుకునే వంటకం ‘పంజరి’. ఇదో తీపి వంటకం. నేతిలో గోధుమ పిండి, చక్కెరని వేయిస్తారు. నేతిలోనే వేయించిన డ్రైఫ్రూట్స్‌ ముక్కలను, గోందును కలిపితే ‘పంజరి’ తయారవుతుంది. సాధారణంగా గోధుమలు వేడిని కలిగిస్తాయి. తగినంత శక్తితో పాటు, రోగనిరోధక శక్తిని పెంచేందుకు ఈ వంటకం ఉపయోగపడుతుంది. జీర్ణాశయానికి బాగుంటుంది. చలికాలంలో సంరక్షణ అవసరమైన చర్మం, కురుల రక్షణకు తోడ్పడుతుంది. ఎన్నో పోషక విలువలు ఉన్న పంజరి మహిళల ఆరోగ్యానికి మరీ మంచిది. అనేక ప్రయోజనాలు ఉన్న ఈ వంటకం పంజాబ్‌తో పాటు పాకిస్తాన్‌లోనూ ప్రసిద్ధి.


దిల్లీ వీధుల్లో...

book6.4.jpg

సాధారణంగా లడ్డూ అనగానే నోరూరుతుంది. అయితే అన్ని లడ్డూలు తియ్యగా ఉంటాయని అనుకుంటే పొరపాటే. దిల్లీలో ప్రసిద్ధిచెందిన ‘రామ్‌ లడ్డూ’లో ఉన్నదంతా కారమే. శీతాకాలం వచ్చిందంటే దేశ రాజధాని దిల్లీలో చలిని తట్టుకోవడం చాలా కష్టం. అలాంటి చలిలో కారంకారంగా ఉండే ‘రామ్‌ లడ్డూ’ తినేందుకు దిల్లీవాసులు తెగ ఇష్టపడతారు. ఈ లడ్డూలను ప్రధానంగా పెసరపప్పుతో తయారుచేస్తారు. ఇంకా శనగపప్పు, మినప్పప్పు, అల్లం, మిర్చిలను చేర్చి, రుబ్బుకుని నూనెలో బజ్జీల్లాగా వేయిస్తారు. అక్కడ ఇదో చాట్‌ తరహా వంటకం. చల్లని సాయంత్రం పూట ప్లేటు నిండా రామ్‌ లడ్డూలను పెట్టుకుని గ్రీన్‌ చట్నీలో నంజుకుని తినడం దిల్లీవాసులకు అలవాటు. చలికాలంలో రామ్‌ లడ్డూ అనగానే చాలామంది తమ చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళతారు. పానీపూరీ బండ్ల లాగానే దిల్లీలో రామ్‌ లడ్డూ బళ్లు విపరీతంగా కనిపిస్తాయి. ప్రొటీన్‌ రిచ్‌ స్నాక్‌గా రామ్‌ లడ్డూను అభివర్ణించ వచ్చు. పైగా ఇది గ్లూటెన్‌ ఫ్రీ వంటకం. జీర్ణక్రియకు చక్కగా సహాయపడుతుంది. శరీరానికి కావాల్సిన వేడిని అందిస్తుంది.


దేవతల భూమిలో...

book6.5.jpg

కేరళ అనగానే కొబ్బరి రుచులే గుర్తుకు వస్తాయి. కానీ ఈ సముద్రతీర రాష్ట్రంలో చలికాలంలో ప్రత్యేకంగా ‘బీట్‌రూట్‌ తోరన్‌’ను ఎక్కువగా వండుతారు. వాస్తవానికి కేరళ సంప్రదాయ వంటకాల్లో ఇది ఒకటి. ‘ఓనమ్‌ సద్యా’ (ఓనమ్‌ మహావిందు)లో తప్పకుండా వండే వంటకం బీట్‌రూట్‌ తోరన్‌. ఆయా ఇళ్లల్లోని పద్ధతుల ఆధారంగా ఇందులో వేసే పదార్థాలు మారుతుంటాయి. కొంతమంది బీట్‌రూట్‌ తురుము, కొబ్బరినూనె, కరివేపాకుతో చేస్తే మరికొందరు కొబ్బరికి బదులుగా ఉల్లి, వెల్లుల్లిలతో కూడా చేస్తుంటారు. చలికాలంలో అక్కడ ఈ డిష్‌ తప్పనిసరి. అన్నం, చపాతీల్లోకి బాగుంటుంది. బీట్‌రూట్‌లో ఉన్న ఫైబర్‌, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్ల వల్ల శరీరంలో రక్తప్రసరణ మెరుగై, గుండెకు మేలు చేస్తుంది. త్వరితగతిన శక్తిని అందిస్తుంది. చలికాలం వాపులను తగ్గిస్తుంది. మెదడు పనితీరును మెరుగు పరుస్తుంది.


టూ ఇన్‌ వన్‌

చలికాలం అనగానే గుర్తుకువచ్చే వాటిల్లో మొక్కజొన్న పొత్తులూ ముఖ్యమైనవి. సాయంత్రం వేడి నిప్పులపై కాల్చిన మొక్కజొన్న కంకికి కాస్త ఉప్పూకారంలో అద్దిన నిమ్మ బద్దను రాసుకుని తింటే ఆ మజానే వేరు. మనం ఎండాకాలంలో రాగి జావను చేసుకున్నట్టు చలికాలంలో రాజస్థాన్‌లో మొక్కజొన్నలతో జావ చేసుకుంటారు. అదే ‘మక్కీ కీ రాబ్‌’. మజ్జిగలో మొక్కజొన్న పిండిని కలిపి, అందులో ఉడికించిన పొత్తులను వేసి పొయ్యి మీద వేడి చేస్తే ‘మక్కీ కీ రాబ్‌’ తయారవుతుంది. రుచి కోసం జీలకర్ర పొడి, ఉప్పు కలుపుతారు. కొందరు పసుపు, కారం, అల్లం తురుము కూడా చేర్చుకుంటారు. సూప్‌లా అనిపించే ఈ ద్రావణం అక్కడ ఎంతో ఫేమస్‌.


‘రాజస్థాన్‌ డిలైట్‌’గా కూడా పిలుస్తారు. ఒకప్పుడు మట్టి పాత్రల్లో వండుతూ అందులోనే తాగేవారు. అక్కడ జరిగే శీతాకాల పెళ్లిళ్లలో ఈ స్పెషల్‌ డిష్‌ తప్పకుండా ఉండాల్సిందే. మొక్కజొన్నకు సహజంగానే వేడిని కలిగించే స్వభావం ఉంటుంది. అందుకే శరీర ఉష్ణోగ్రతలను నిలకడగా ఉంచేందుకు, తక్షణ శక్తిని అందించేందుకు, ‘మక్కీ కీ రాబ్‌’ను మించింది లేదని రాజస్థానీయులు పేర్కొంటారు. ఇది గ్లూటెన్‌ ఫ్రీ ద్రావకం. కాబట్టి అందరూ అన్ని వేళల్లో తాగవచ్చు. ఇలాంటిదే ‘బాజ్రే కి ఖట్టి’ కూడా. మొక్కజొన్న పిండికి బదులుగా ఇందులో సజ్జల పిండి వాడతారు. మజ్జిగ, మసాలాలు మామూలే. అయితే శీతాకాలంలోనే కాదు, మండు వేసవిలో కూడా చలువ చేసేదిగా ఉపయోగిస్తారు. షుగర్‌ను నియంత్రించడానికి, జీర్ణక్రియకు దోహదపడుతుంది. బాజ్రే కి ఖట్టిని రాజస్థానీయులే కాకుండా గుజరాతీయులు కూడా ఇష్టంగా సేవిస్తారు.


పచ్చి బఠానీలతో...

book6.3.jpg

చలికాలంలో కూరగాయల షాపుల్లోనే కాకుండా బండ్ల మీద పచ్చి బఠానీలను ఎక్కువగా అమ్ముతుంటారు. పచ్చిబఠానీల సీజన్‌ ఇదే కదా. పచ్చి బఠానీలతో చేసే ‘మటర్‌ కా నిమోనా’ ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన శీతాకాల వంటకం. గుండె ఆరోగ్యానికి, బరువు నియంత్రణకూ సహాయపడుతుంది. జీర్ణవ్యవస్థకూ మంచిది. పచ్చి బఠానీలతో పాటు ఆలుగడ్డ, సుగంధద్రవ్యాలతో తయారుచేసే కూరలా దీన్ని భావించవచ్చు. ప్రొటీన్లు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పచ్చి బఠానీల్లో ఉంటాయి. అందుకే కొలెస్ట్రాల్‌ను తగ్గించే, రక్తపోటును నియంత్రించగల శక్తి దీనికి ఉంది. కాబట్టి ఈ వంటకంతో వేడిని, ఆరోగ్యాన్ని పొందవచ్చని అక్కడివారు నమ్ముతారు. చలికాలం రెస్టారెంట్లలో కూడా మటర్‌ కా నిమోనాకు గిరాకీ బాగుంటుంది.


ఎడారి ప్రాంతాల్లో...

సాధారణంగా తీపి పదార్థాలను పండగలు, పబ్బాలప్పుడు ఇళ్లల్లో చేసుకుంటూనే ఉంటాం. అయితే రాజాస్థాన్‌లో ఎంతో ప్రసిద్ధి చెందిన ‘గోంద్‌ కే లడ్డూ’ను కేవలం శీతాకాలంలోనే చేసుకోవడం విశేషం. గోంద్‌, నెయ్యి, చక్కెర లేదా బెల్లంతో తయారుచేసే లడ్డూ ఇది. ఇటీవల కాలంలో డ్రైఫ్రూట్స్‌తో పాటు వివిధ రకాల గింజలనూ చేరుస్తున్నారు. ఈ లడ్డూలను తినడం వల్ల చలికాలం వచ్చే జలుబు, దగ్గుల నుంచి ఉపశమనం పొందవచ్చు. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు, కీళ్ల దృఢత్వానికి తోడ్పడుతుంది. సత్వరశక్తిని చేకూరుస్తుంది. ఈ గోంద్‌ కే లడ్డూ గర్భిణులు, పాలు పడుతోన్న తల్లుల ఆరోగ్యానికి మంచిది. బాలింతల ఆరోగ్యం కోసం దక్షిణ రాష్ర్టాల్లో ఈ లడ్డూలను ప్రత్యేకంగా తయారు చేయడం మామూలే.


హిమగిరుల్లో...

book6.7.jpg

చలికాలంలో హిమాలయాల్లో జీవనం సాగించే వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే. మంచుకురిసే వేళల్లో లేహ్‌, సిక్కిం, అరుణాచల్‌ ప్రదేశ్‌, నేపాల్‌ లాంటి ప్రాంతాల్లో తప్పక కనిపించే వంటకం ‘తుప్కా’. ఇది ‘వన్‌ పాట్‌’ మీల్‌. తినగానే కడుపు నిండిన ఫీలింగ్‌ కలుగుతుంది. నూడుల్స్‌, ఉడికించిన రకరకాల కూరగాయలు, హిమాలయ మసాలా దినుసులు కలబోసిన సూప్‌ లాంటి ద్రావకం ఇది. గరం మసాలా, పుట్టగొడుగులు, పాలకూర లాంటివి కూడా కలుపుతారు. వాస్తవానికి తుప్కాను మొదట తయారుచేసింది టిబెటన్లు. అక్కడి నుంచే మిగతా హిమాలయ ప్రాంతాలకు ఈ వంటకం పాకింది. పీచుపదార్థాలు, విటమిన్లు, ఖనిజాలమయం ఈ తుప్కా. ప్రాంతాన్ని బట్టి ఇందులో చేర్చే పదార్థాలు, మసాలా దినుసులు మారుతుంటాయి.


ఇట్టే కరిగిపోతుంది...

బెంగాలీలు మిఠాయి ప్రియులన్నది జగమెరిగిన సత్యం. బెంగాలీ స్వీట్ల గురించి వేరే చెప్పక్కర్లేదు. అయితే శీతాకాలంలో అక్కడ చేసుకునే ప్రత్యేక స్వీట్‌ ‘నోలెన్‌ గుడ్‌ సందేశ్‌’. తాజా జున్ను, ఖర్జూర బెల్లంతో దీన్ని తయారుచేస్తారు. ఆకు మాదిరిగా ఈ తీపి పదార్థాన్ని రూపొందిస్తారు. నోట్లో వేసుకోగానే కరిపోయేంత మెత్తగా ఉంటుంది. ఖర్జూరబెల్లాన్ని శీతాకాలంలోనే ఎక్కువగా తయారుచేస్తారు. అందుకే ఇది శీతాకాల స్వీట్‌గా మారింది. జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ) అందుకున్న ఈ స్వీట్‌ను బెంగాలీలు తమ సంస్కృతిలో భాగం చేసుకున్నారు. ఇక పోషకాలపరంగా చూస్తే... ఇందులో సహజ చక్కెరలు ఉంటాయి కాబట్టి తక్షణ శక్తి కోసం ఈ స్వీట్‌ను ఆరగించవచ్చు. ఖర్జూర బెల్లంలో ఉన్న క్యాల్షియం, ఐరన్‌ లాంటివి ఎముకల బలానికి, కురుల సౌందర్యానికి దోహదపడతాయి.


ఇవి కూడా...

book6.8.jpg

ఇవే కాకుండా కశ్మీర్‌లో హర్రీసా, గుష్‌తబా, రోగన్‌ జోష్‌, బీహార్‌లో తుల్కుట్‌, దిల్లీలో దౌలత్‌ కీ ఛాట్‌, గోవాలో బతికా, పంజాబ్‌లో సర్సో కా సాగ్‌, గుజరాత్‌లో ఉందియు, లాప్సి, అసోమ్‌లో తిల్‌ పితా, దక్షిణాదిన క్యారెట్‌ పొరియల్‌... ఇవన్నీ శీతాకాల వంటకాలుగా పేరు తెచ్చుకున్నాయి. ఇక అన్ని చోట్లా చేసుకునే గాజర్‌ హల్వా, మలై మఖన్‌, మేథి పకోడా, నువ్వుల చిక్కీ, నిహారి, పాయా షోర్బా... దేశమంతా ఇలాంటి వంటకాలు అనేకం ఉన్నాయి. ఆ రుచులను ఆస్వాదిస్తూ చలిని తరిమికొట్టాల్సిందే.

- సండే డెస్క్‌


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు

నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2025 | 10:46 AM