Share News

Heroine Samyukta Menon: విరామం దొరికితే... రిషికేశ్‌లో వాలిపోతా...

ABN , Publish Date - Nov 30 , 2025 | 06:52 AM

విరామం దొరికితే చాలు... రిషికేశ్‌లో వాలిపోతా... అంటున్నారు ప్రముఖ హీరోయిన్‌గా సంయుక్త మీనన్. నాలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువని, ‘చిన్మయ విద్యాలయ’లో చదవడంవల్ల చిన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా తెలుసుకున్నా.. అంటున్నారు. ఇంకా ఆమె ఏమన్నారంటే...

Heroine Samyukta Menon: విరామం దొరికితే... రిషికేశ్‌లో వాలిపోతా...

‘భీమ్లానాయక్‌’తో తెలుగు తెరకు పరిచయమైన సంయుక్త ... ఆ తర్వాత ‘బింబిసార’, ‘సార్‌’, ‘విరూపాక్ష’ వంటి వరుస విజయాలతో స్టార్‌ హీరోయిన్‌గా మారింది. తాజాగా ‘అఖండ 2’తో సందడి చేయనున్న సందర్భంగా ఈ మలయాళ సోయగం పంచుకున్న విశేషాలివి...

ఈవెంట్‌ మేనేజర్‌గా...

సినిమాల్లోకి రాకముందు నేనొక ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలో పనిచేశా. మొదటి నుంచి క్రియేటివ్‌ ఫీల్డ్‌ అంటే ఆసక్తి. ఈ క్రమంలో ఈవెంట్‌ ప్లానింగ్‌, క్రియేటివ్‌ ప్రజెంటేషన్‌, కమ్యూనికేషన్‌... వంటి అనేక విషయాలు నేర్చుకున్నా. నేను పనిచేసిన సంస్థ సినిమా ఈవెంట్లు కూడా నిర్వహించేది. అలా ఇండస్ట్రీ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి, సినిమా అవకాశాలొచ్చాయి.


ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతా...

నాలో ఆధ్యాత్మిక భావనలు ఎక్కువ. ‘చిన్మయ విద్యాలయ’లో చదవడంవల్ల చిన్నప్పుడు ఆధ్యాత్మిక విషయాల గురించి ఎక్కువగా తెలుసుకున్నా. చిన్నప్పుడే శ్లోకాల్నీ నేర్చుకున్నా. అప్పుట్లో వాటి అర్థం పూర్తిగా తెలిసేది కాదు. ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నా. గంగా ఒడ్డున లేదంటే ఏదైనా ఆలయ ప్రాంగణంలో ఆధ్యాత్మిక పుస్తకాలు చదువుతూ కూర్చోవడమంటే ఇష్టం.


book1.2.jpg

విమర్శలు మామూలే...

నాకు విమర్శలు కొత్తేమీ కాదు. 2016లో నా తొలి మలయాళ చిత్రం ‘పాప్‌కార్న్‌’ చూసి అందరూ నాకు నటించడం రాదన్నారు. వాస్తవానికి అప్పటికి నాకు సినిమాల గురించి అంతగా తెలియదు. ఏదో అవకాశం వచ్చిందని క్యాజువల్‌గా నటించేశా. ఆ చిత్రం తర్వాతే ఇండస్ట్రీ గురించి పూర్తిగా అవగాహన వచ్చింది. కెరీర్‌ మొదట్లో చాలామంది నా కళ్లు చిన్నగా ఉంటాయని విమర్శించేవాళ్లు. కానీ ఇప్పుడో... ‘కళ్లతోనే కోటి భావాలను పలికించగలవు’ అని అంటున్నారు.


భయపడ్డా... కానీ...

బాలయ్య సార్‌తో సినిమా (‘అఖండ 2’) అనగానే ముందుగా భయపడ్డా. నిజంగా ఆయనో లెజెండ్‌. లొకేషన్‌కి వెళ్లాక, ఆర్టిస్టులను ఆయన ఓన్‌ చేసుకునే తీరు చూసి ఆశ్చర్యపోయా. సెట్‌కు వెళ్లిన తొలి గంటలోనే నా అనుమానాలన్నీ పటాపంచలైపోయాయి. ‘నువ్వు మంచి నటివి.. నీకు ఇది పెద్ద విషయం కాదు..’ అంటూ భుజం తట్టేవారు.


book1.3.jpg

ఆమె నటనకు ఫిదా...

ఈతరం కథానాయికల్లో సాయిపల్లవి అంటే చాలా ఇష్టం. మొదటిసారి ఆమెను తెరపై చూసినప్పుడే తన నటనకు ఫిదా అయిపోయా. సింపుల్‌ లుక్‌, సహజమైన అభినయం, మోముపై స్వచ్ఛమైన చిరునవ్వు, కళ్లలో భావోద్వేగం.. అవే ఆమెను ప్రత్యేకంగా నిలిపాయి. ఇక తన డ్యాన్స్‌ గురించి చెప్పాలంటే మాటలు చాలవు. ఎంత కఠినమైన మూవ్‌ అయినా... ఆమె చేస్తే చాలా ఈజీగా, సహజంగా కనిపిస్తుంది.


అవే నాకిష్టం..

ప్రతీరోజూ ఒకేలా గడిస్తే నాకు నచ్చదు. కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త ప్రదేశాల్ని చూడటం నాకిష్టం. ఒంటరిగా ప్రయాణాలు చేస్తా. సినిమాల మధ్య విరామం దొరికితే బ్యాగు సర్దుకుని రిషికేశ్‌లో వాలిపోతా. అక్కణ్నుంచి హిమాలయాలకు వెళ్తుంటా. నచ్చిన చోటుకి వెళ్లడం, అక్కడి అందాల్ని తనివితీరా ఆస్వాదించి, వాటిని డైరీలో రాసుకోవడం అలవాటు.


book1.4.jpg

అమ్మను వెంట తీసుకెళ్లను...

అమ్మతో సినిమా కథలు, రెమ్యునరేషన్‌ గురించి ఏదీ చర్చించను. సెట్స్‌కీ తీసుకెళ్లను. తల్లీకూతుళ్ల మధ్య అనుబంధం వేరు. అందులో వృత్తికి చోటివ్వొద్దని అనుకుంటా. పిల్లలు డాక్టర్‌, ఇంజనీర్‌ అయితే... వారి వృత్తిలో తల్లిదండ్రులు తలదూర్చరు కదా. ఈ ఫీల్డ్‌లో కూడా అలానే ఉండాలనుకుంటా. చిన్నప్పట్నుంచీ కాస్త స్వేచ్ఛగానే పెరిగా.


ఫటాఫట్‌...

- నచ్చిన నటుడు: మమ్ముట్టి

- నా గురించి ఒక్క మాటలో: ఇండిపెండెంట్‌

- ఫేవరెట్‌ మ్యూజిక్‌: మెలోడీ

- ఇష్టమైన షాపింగ్‌ స్పాట్‌: లోకల్‌ మార్కెట్స్‌

- బ్యాగ్‌లో తప్పక ఉండేవి: జర్నల్‌, కెమెరా

- ఫేవరెట్‌ బీచ్‌ డెస్టినేషన్‌: మాల్దీవులు


ఈ వార్తలు కూడా చదవండి..

రాజకీయంగా ఎదుర్కోలేకే ఆరోపణలు

నేడు, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 30 , 2025 | 07:34 AM