Reels Addiction Tips: రీల్స్ అలవాటు మానుకోలేకపోతున్నారా? ఈ టిప్స్ ట్రై చేయండి..
ABN , Publish Date - Jul 12 , 2025 | 05:12 PM
నేటికాలంలో వారూ వీరు అని లేకుండా ప్రతి ఒక్కరూ రీల్స్ చేసేందుకూ, చూసేందుకూ విపరీతమైన ఆసక్తి చూపుతున్నారు. క్రమంగా ఇది చాలా మందికి ఒక వ్యసనంలా మారిపోయింది. ఎంతలా అంటే, ముఖ్యమైన పనులు పక్కన పెట్టి మరీ రీల్స్ చూడటంలోనే నిమగ్నమవుతున్నారు. రీల్స్ వ్యామోహం నుంచి బయటపడాలనే కోరిక ఉన్నా బయటపడలేక సతమతమవుతుంటే ఈ టిప్స్ ట్రై చేయండి.

How to Overcome Social Media Reels Habit: ఈ డిజిటల్ యుగంలో అందరికీ ప్రతిదీ త్వరత్వరగా పూర్తయిపోవాలి. ఏ పనికోసమూ సమయం కేటాయించేంత తీరిక ఉండదు. అయితే, ఎంత బిజీ లైఫ్ లీడ్ చేసేవారైనా రోజులో సొంత పనులు మానుకుని మరీ రీల్స్‌కు గంటల తరబడి బందీ అయిపోతున్నారు. ఆ సోషల్ మీడియా మహాసముద్రంలోని చిన్న చిన్న షార్ట్ వీడియోలే అమూల్యమైన తమ సమయాన్ని హరిస్తున్నాయని గుర్తించలేకపోతున్నారు. ఒకవేళ గుర్తించినా రీల్స్ అడిక్షన్ అనే ఊబిలోంచి బయటకు రాలేక కొట్టుమిట్టాడుతున్నారు. అయితే, తలచుకోవాలే గానీ ఈ చెడు అలవాటును వదిలించుకునే మార్గాలు బోలెడు. అవేంటో తెలుసుకుని పాటిస్తే జీవితాన్ని జీవించేందుకు అవకాశం లభిస్తుంది.
టైం లిమిట్
రీల్స్ చూడకుండా ఉండలేం అనుకునేవారు ఒక టైం లిమిట్ సెట్ చేసుకోండి. క్రమక్రమంగా సమయాన్ని తగ్గించుకుంటూ రండి. రోజుకు ఇంతసేపు కంటే ఎక్కువ చూడకూడదు అనే నియమం ప్రకారం నడుచుకుంటే అదే ఒక అలవాటుగా మారిపోతుంది. ఉదాహరణకు రోజు 15 నుంచి 20 నిమిషాలకు మించకుండా రీల్స్ చూడకూడదని నిర్ణయం తీసుకోండి.
నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయండి
ఫోన్లో నోటిఫికేషన్ కనిపించగానే తెలియకుండానే ఓపెన్ చేసేస్తాం. అలా ఒక లింక్ నుంచి మరో లింక్ ఓపెన్ చేస్తూ పోతుంటాం. ఈ పద్ధతి మీకు తెలియకుండానే విలువైన సమయాన్ని కిల్ చేస్తుంది. అందుకే ముఖ్యమైనవి తప్ప ఇతర నోటిఫికేషన్‌లను ఆఫ్ చేయాలి. మీ స్నేహితులు లేదా సన్నిహితులు రీల్స్ షేర్ చేస్తే సోషల్ మీడియాను మళ్లీ మళ్లీ తనిఖీ చేయాల్సి ఉంటుంది. అలాంటివాటిని ఆఫ్ చేయండి.
కొత్త అలవాట్లు
చాలా మంది తమ ఖాళీ సమయంలో రీల్స్ చూస్తారు. ఇది వ్యసనంగా మారితే సొంత పనులు మానేసుకుని రీల్స్ చూడటం కోసమే సమయాన్ని కేటాయించుకుంటారు. అందుకే, రీల్స్ చూడటానికి బదులుగా ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, పాటలు వినడం, డ్రాయింగ్ వేయడం, ఆటలు ఆడటం, మీకిష్టమైన హాబీల కోసం ఉపయోగించుకోండి. ఈ అలవాటు సంతోషాన్ని పంచడంతో పాటు రీల్స్ వ్యసనం నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది.
మొబైల్ డేటా
మీ మొబైల్ డేటాను ఎల్లప్పుడూ ఆన్‌లో ఉంచుకోకండి. ముఖ్యంగా మీరు కుటుంబం, స్నేహితులతో ఉన్నప్పుడు మొబైల్ డేటాను ఆఫ్ చేసి ఫోన్‌ను దూరంగా ఉంచండి. వేరే పనుల్లో నిమగ్నమైతే ఆటోమేటిగ్గా రీల్స్ చూసే సమయం తగ్గిపోతుంది.
వ్యసనానికి కారణాలు అర్థం చేసుకోండి
రీల్స్ చూడకుండా ఎందుకు ఉండలేకపోతున్నారో మీకు మీరే ప్రశ్నించుకుని కారణాలు అన్వేషించండి. విసుగ్గా, ఒంటరిగా లేదా ఖాళీగా ఇలా ఏ సమయాల్లో ఎక్కువగా రీల్స్ చూడటానికి ఇష్టపడుతున్నారో గమనించుకుని ధ్యాసను వేరే పనులపై మళ్లించుకోండి. ఒకవేళ దీన్నుంచి బయటపడలేమని అనుకుంటూ ఉంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మానసిక నిపుణుల సాయం తీసుకోండి. వీలైనంత వరకూ ఫోన్‌ను దూరంగా ఉంచి అవసరమైనప్పుడు మాత్రమే వాడితే రీల్స్ అడిక్షన్ నుంచి బయటపడవచ్చు.
డిజిటల్ డిటాక్స్
వారానికి ఒక రోజు సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండండి. దీన్నే డిజిటల్ డిటాక్స్ అంటారు. ఆ రోజున పూర్తిగా మొబైల్‌కు దూరంగా ఉండి కుటుంబం లేదా స్నేహితులతో బయటకు వెళ్లి సరదాగా గడపండి. ఈ రోజున పెట్స్ లేదా నచ్చిన పనులతో గడిపేందుకు ప్రయత్నించండి. ఇలా చేస్తే క్రమంగా రీల్స్, మొబైల్ అడిక్షన్లను వదిలించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
ఫోన్ పోగొట్టుకున్నారా.. వెంటనే ఈ ఐదు పనులు చేయండి
సౌతిండియా చుట్టేందుకు గొప్ప ఛాన్స్.. IRCTC 13 రోజుల ఆధ్యాత్మిక యాత్ర..
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి