Mushroom Cleaning Tips: వండేముందు పుట్టగొడుగులను ఎలా శుభ్రం చేయాలి..
ABN , Publish Date - Apr 20 , 2025 | 01:28 PM
How To Clean Mushroom:పుట్టగొడుగులు ఫంగస్ జాతికి చెందినవి. తేమలో పెరిగినందువల్ల అత్యధిక సంఖ్యలో బ్యాక్టీరియా ఉంటుంది. కాబట్టి, నిశితంగా పరిశీలించి శుభ్రపరచుకున్న తర్వాతే వండుకోవాలి. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Mushroom Cleaning Hacks: పుట్టగొడుగుల్లో వందల రకాలున్నాయి. ఫంగస్ జాతికి చెందినప్పటికీ దీనిని కూరగాయగానే పరిగణిస్తారు. ఇవి ఎంత రుచిగా ఉంటాయో అంతే ఆరోగ్యకరం కదా. పుట్టగొడుగులలో అనేక ఖనిజాలు, విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా ఎండబెట్టిన పుట్టగొడుగులు విటమిన్ డి కి గొప్ప మూలం. కానీ చాలా మందికి పుట్టగొడుగులను సరైన పద్ధతిలో ఎలా ఉపయోగించాలో తెలియదు. కొంతమంది ప్యాకెట్ లోంచి నేరుగా బయటకు వాడేస్తారు. మరికొందరు అది కాస్త మురికిగా కనిపించినా కుళ్ళిపోయిందని భావించి పారవేస్తారు. వాసనను బట్టి కుళ్లిపోయిన వాటికి, మురికిగా ఉన్నవాటిని తేడా గుర్తించలేక చాలామంది ఈ తప్పులు చేస్తుంటారు. మరి, మష్రూమ్స్ శుభ్రం చేసేందుకు సరైన పద్ధతులు ఏవో తెలుసుకోండి.
మట్టిలోంచి స్వతహాగా పుట్టుకొచ్చే పుట్టగొడుగులను వండుకునే ముందు కచ్చితంగా పరిశీలించాలి. అందుకే మంచి, చెడు పుట్టగొడుగులకు మధ్య తేడాలను కనిపెట్టి ఎలా శుభ్రం చేయాలో కింది చిట్కాల ద్వారా తెలుసుకుందాం.
మష్రూమ్స్ ఇలా శుభ్రం చేస్తే తప్పు
మీరు ప్యాకెట్ నుండి నేరుగా పుట్టగొడుగులను తీసి వాటిని కడిగి నేరుగా ఉడికిస్తుంటే అది పూర్తిగా తప్పు. ఇతర కూరగాయల మాదిరిగానే పుట్టగొడుగులను కూడా కడిగి తొక్క తీయాలి. నిజానికి, పుట్టగొడుగు దిగువ కాండాన్ని తొలగించిన తర్వాత పైభాగంలో సన్నని తొక్క లాంటి పొర ఉంటుంది. ఉడికించిన బంగాళాదుంప తొక్కలాగా దీన్ని సున్నితంగా తొలగించవచ్చు. ఈ పొరను తొలగించిన తర్వాత పుట్టగొడుగు పూర్తిగా శుభ్రంగా మారుతుంది. తర్వాత వీటిని కడిగి వంట కోసం ఉపయోగించవచ్చు.
పసుపు, ఉప్పు నీరు
పై తొక్కను తీసివేసిన తర్వాత పుట్టగొడుగులను ఉప్పు, పసుపు కలిపిన గోరువెచ్చని నీటిలో రెండు నిమిషాలు నానబెట్టండి. ఆపై బయటకు తీసి కాగితపు టవల్ మీద ఆరబెట్టండి. తడిపోగానే తీసేయండి.
చెడిపోయాయో లేదో ఎలా చెప్పాలి
వీలైనంత వరకూ మార్కెట్ నుంచి తాజా పుట్టగొడుగులనే కొనుగోలు చేసి వాడండి. ఒకవేళ మీరు రెండు నుండి నాలుగు రోజులు రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలనుకుంటే.. వాటిని ప్లాస్టిక్ ప్యాకెట్ నుంచి తీసేసి పేపర్ టవల్‌లో చుట్టండి. ఇలా చేస్తే మష్రూమ్స్ మూడు నాలుగు రోజుల వరకు చెడిపోవు.
పుట్టగొడుగులు ముడతలు పడి, జిగటగా, దుర్వాసన వస్తున్నట్లు కనిపిస్తే వెంటనే వాటిని పారవేయండి. చెడు పుట్టగొడుగులు ఆరోగ్యానికి హానికరం.
నలుపు, గోధుమ లేదా రంగు మారిన పుట్టగొడుగులను తినవద్దు. కొన్నిసార్లు పుట్టగొడుగులకు గాట్లు పడితే వాటిపై మచ్చలు వస్తాయి. ఈ గుర్తులు తాజాగా ఉంటే పర్వాలేదు. లేకుంటే వాటిని పారవేయడమే తెలివైన పని.
Read Also: Fridge Odor Remover: క్లీన్ చేసినా ఫ్రిజ్ దుర్వాసన వస్తోందా.. ఈ టిప్స్‌తో ఈజీగా వదిలిపోతుంది..
Parenting Tips: తల్లిదండ్రులు చేసే ఈ తప్పులు.. పిల్లల చదువును పాడు చేస్తాయి..
Tan Removal Tips: రోజూ ఈ లోషన్ వాడితే ట్యానింగ్ సమస్య ఎప్పుడూ రాదు..