Share News

Cleaning Tips: ఓవెన్‌పై మొండి మరకలు ఈ చిట్కాలతో నిమిషాల్లో వదిలిపోతాయ్..!

ABN , Publish Date - Jul 15 , 2025 | 05:02 PM

వంట త్వరగా పూర్తయ్యేందుకు, రెస్టారెంట్ స్టైల్లో డిఫరెంట్ ఐటమ్స్ వేగంగా చేసుకునేందుకు మైక్రోవేవ్ ఓవెన్ చాలా ఉపయోగపడుతుంది. కానీ, దీన్ని శుభ్రం చేసుకోవడమే పెద్ద పని అని అందరూ అనుకుంటారు. ఇంట్లో ఉండే ఈ వస్తువులతో ఓవెన్‌పై పేరుకుపోయిన జిడ్డు, మొండి మరకలను ఇట్టే వదిలించవచ్చు. అదెలాగంటే..

Cleaning Tips: ఓవెన్‌పై మొండి మరకలు ఈ చిట్కాలతో నిమిషాల్లో వదిలిపోతాయ్..!
Microwave Oven Cleaning Hacks

Microwave Oven Cleaning Hacks: ఈ రోజుల్లో దాదాపు అందరి కిచెన్లలో మైక్రోవేవ్ ఓవెన్ దర్శనమిస్తుంది. ఇంట్లో ఓవెన్ ఉంటే అప్పటికప్పుడు ఆహారపదార్థాలు వేడి చేసుకోవచ్చు. అలాగే క్షణాల్లో వంట పూర్తిచేయవచ్చు. కానీ, చాలామంది ఓవెన్ విషయంలో ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య క్లీనింగ్. ఎంత గట్టిగా రుద్దినా ఓవెన్‌పై పేరుకుపోయిన జిడ్డు, ఆహారపదార్థాలు వండినప్పుడు ఏర్పడిన మరకలు ఒక పట్టాన వదలవు. కానీ, ఈ సమస్యకు ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. ఇంట్లో ఉండే ఈ వస్తువులతోనే ఓవెన్‌ను మెరిసిపోయేలా చేయవచ్చు.


1. నిమ్మరసం, నీరు

నిమ్మలో ఉన్న న్యాచురల్ యాసిడ్ జిడ్దును కరిగించడంలో సహాయపడుతుంది. ముందుగా ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, ఒక కప్పు నీరు పోయాలి. ఈ గిన్నెను మైక్రోవేవ్‌లో 3-5 నిమిషాలు హీట్ చేయాలి. ఆవిరి వల్ల ఓవెన్‌పై గట్టిగా అంటుకున్న మరకలు తడిగా అవుతాయి. ఆ తర్వాత ఒక స్పాంజ్ లేదా మైక్రోఫైబర్ క్లాత్‌తో తుడిచేయండి.

2. వెనిగర్, నీరు

వెనిగర్ కూడా శక్తివంతమైన క్లీనింగ్ ఏజెంట్. ముందుగా ఓవెన్‌ను 300 డిగ్రీల ఫారెన్‌హీట్‌కు వేడి చేయాలి. తర్వాత ఓవెన్ సేఫ్ పాత్ర తీసుకొని దానిలో 1-2 కప్పుల వెనిగర్ పోయాలి. కావాలంటే తాజా వాసన కోసం కొన్ని నిమ్మకాయ ముక్కలను కూడా జోడించవచ్చు. దీన్ని మైక్రోవేవ్‌లో వేడి చేయండి. ఆవిరి వలన లోపల ఉన్న మలినాలు తొలగించడం తేలికవుతుంది. తుడవడానికి ముందు ఓ 10 నిమిషాలు డోర్ తెరవకుండా అలాగే ఉంచండి. తర్వాత తడిగుడ్డతో శుభ్రం చేయండి.


3. బేకింగ్ సోడా పేస్ట్

గట్టిగా అంటుకున్న మరకలకు బేకింగ్ సోడా పేస్ట్ అద్భుతంగా పనిచేస్తుంది. ఫస్ట్ బేకింగ్ సోడాను కొద్దిగా నీటిలో వేసి పేస్ట్‌గా చేసుకోవాలి. దీన్ని ఓవెన్ మీద ఎక్కడ మరకలుంటే అక్కడ అప్లై చేయాలి. 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత స్పాంజ్‌తో శుభ్రం చేస్తే సరిపోతుంది.

4. నాన్-టాక్సిక్ క్లీనింగ్ ( ఇంట్లో పిల్లలుంటే)

బేకింగ్ సోడా, నిమ్మరసం కలిపి స్ప్రే బాటిల్‌లో వేసుకుని లోపల స్ప్రే చేయండి. ఇది 100% సేఫ్. ఈ మిక్స్‌ను స్ప్రే చేసిన తర్వాత డోర్ మూసేయండి. 10 నిమిషాల తర్వాత తుడిస్తే చాలు.

5. డోర్, రాక్ క్లీనింగ్

మైక్రోవేవ్ డోర్ మీద ఎక్కువగా ఆయిల్ జిడ్డు వుంటుంది. దీనికి వెనిగర్, నిమ్మ కలిపిన క్లీనింగ్ సొల్యూషన్ వాడండి. టర్న్‌టేబుల్‌ను తీసి దాన్ని ప్రత్యేకంగా ఉడికిన నీటిలో ఉంచి శుభ్రం చేయండి.


6. వెనిగర్, బేకింగ్ సోడా

మీ ఓవెన్‌లో మొండి మరకలు తొలగించేందుకు వెనిగర్, బేకింగ్ సోడా కలిపి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. ఈ పేస్ట్‌ను ఓవెన్ వాల్స్‌పై పూయండి అయితే, ఓవెన్ హీటింగ్ రాడ్‌పై ఈ పేస్ట్‌ను పూయకూడదు. దీన్ని రాత్రంతా అలాగే ఉంచి ఉదయాన్నే శుభ్రం చేయండి.

చివరగా కొన్ని చిట్కాలు

  • వారానికి ఒక్కసారి క్లీనింగ్ అలవాటు చేసుకోండి.

  • వాడిన వెంటనే శుభ్రం చేస్తే పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు.

  • మైక్రోవేవ్ లోపల శుభ్రం చేసేందుకు మినరల్ వాటర్ లేదా ఫిల్టర్డ్ వాటర్ వాడటం మంచిది.

  • ప్లాస్టిక్ బౌల్స్‌ వాడేటప్పుడు అవి మైక్రోవేవ్ సేఫ్ అవునో కాదో చెక్ చేయండి.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ABN ఆంధ్రజ్యోతి బాధ్యత వహించదు.)


Also Read:

చెప్పులు ఎంత కాలం తర్వాత మార్చాలి.. వాటిని మార్చకపోతే..

బాత్రూం క్యాంపింగ్.. జెన్ జీలో పెరిగిపోతున్న నయా ట్రెండ్..

For More Lifestyle News

Updated Date - Jul 15 , 2025 | 05:06 PM