కళ్లలో దుమ్ము పడితే ఏం చేయాలి? ఏం చేయకూడదు?
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:16 AM
Eye Care Tips: బైక్ లేదా స్కూటర్ నడుపుతున్నప్పుడు లేదా రోడ్డుపై వెళ్లేటప్పుడు ఈదురు గాలి చెలరేగినా కళ్లలో దుమ్ము కణాలు లేదా చిన్న కీటకాలు పడే అవకాశముంది. అలాంటి పరిస్థితిలో ఇలా మాత్రం ఎప్పుడూ చేయకండి.

Eye Dust Removal Tips: ఇంట్లో దుమ్మూ, ధూళి నిండిన ప్రదేశాలు శుభ్రం చేస్తున్నప్పుడో లేదా బైక్ లేదా స్కూటర్ నడిపే సమయంలో హఠాత్తుగా ఈదురుగాలి చెలరేగినప్పుడో కళ్లలోకి దుమ్ము ప్రవేశించవచ్చు. దీని కారణంగా కళ్లు దురదగా అనిపించడం, మంట, మూసుకుపోవడం జరగవచ్చు. కళ్ళకు కలిగిన ఈ అసౌకర్యాన్ని తొలగించడానికి వెంటనే ఎక్కువమంది చేత్తో నులిమేస్తుంటారు. ఇలా చాలా తప్పు. ఇలాంటి సమయంలో ఏమాత్రం అజాగ్రత్త వహించినా రెటీనా వంటి సున్నిత అవయవం దెబ్బతినే ప్రమాదముంది. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే దుమ్ము పడిన మరుక్షణమే ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
దుమ్ము కణాలు లేదా మరేదైనా మీ కళ్ళలోకి ప్రవేశిస్తే వెంటనే ఈ పనులు చేయండి.
డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీ కళ్ళలోకి ఏదైనా పడితే వాహనాన్ని సైడ్ ఇండికేటర్‌తో నెమ్మదిగా పక్కన ఆపండి. ఎందుకంటే, తరచుగా అలాంటి సందర్భాలలో యాక్సిండెంట్ జరిగే అవకాశం ఉంటుంది.
కళ్లలో దుమ్ము పడిన మరుక్షణమే శుభ్రమైన నీటిని మొహంపై చల్లుకోండి. ఇలా చల్లుకోవడం వల్ల కళ్లలో పడిన దుమ్ము కణాలు లేదా సూక్ష్మజీవులు లోపలికి వెళ్లకుండా నీటి ద్వారా బయటకు వస్తాయి. అయితే, తలను వంచి కంటిపై నుంచి నీటిని పోయాలి.
దగ్గరలో నీరు లేకపోతే కళ్ళు వేగంగా రెప్పవేయండి. దీనివల్ల కళ్ళలో నీరు కారుతుంది. కీటకాలు లేదా కణాలు బయటకు రావచ్చు.
కింది కనురెప్పను క్రిందికి, పై కనురెప్పను పైకి లాగుతూ కనుగుడ్డును చాలా సున్నితంగా రుద్దండి. ఇలా చేయడం వల్ల కూడా దుమ్ము కణాలు లేదా కీటకాలను తొలగించవచ్చు.
అద్దంలో చూసుకోండి. కళ్లలో ఏదైనా కీటకం లేదా దుమ్ము కనిపిస్తే శుభ్రమైన గుడ్డ సహాయంతో దానిని సున్నితంగా తొలగించండి.
ధూళి కణాలను తొలగించిన తర్వాత కూడా కళ్ళలో నొప్పి లేదా ఎరుపు ఉంటే కచ్చితంగా కంటి వైద్యుడితో చెకప్ చేయించుకోండి.
కంటిలోకి దుమ్ము లేదా కీటకాలు పడితే ఏమి చేయకూడదు?
ఈ సమయంలో పొరపాటున కూడా మీ కళ్ళను బలంగా రుద్దకండి. రుద్దడం వల్ల కళ్ళలోని రెటీనాకు గాయం అయ్యే ప్రమాదం ఉంది.
ఒకవేళ విషపూరితమైన సూక్ష్మ కీటకం కళ్లలో పడితే నులమడం వల్ల కంటికి హాని కలగవచ్చు.
ఇవి కూడా చదవండి:
శరీర దుర్వాసనతో బాధపడుతున్నారా.. ఈ టిప్స్ పాటిస్తే తక్షణ ఫలితం
ఈ డాక్యుమెంట్లు ఉంటే ట్రాఫిక్ చలాన్ నుండి మీరు సేఫ్
మరిన్ని లైఫ్ స్టైల్ కోసం క్లిక్ చేయండి