Happy birthday Thaman: 10 గంటల్లో.. 6 పాటలు కంపోజ్ చేశా...
ABN , Publish Date - Nov 16 , 2025 | 06:36 AM
తెలుగు సినీ సంగీతంలో ‘దూకుడు’ చూపిస్తూ ‘సౌండ్ ఆఫ్ సక్సెస్’గా పేరుతెచ్చుకున్నాడు.. తమన్. ప్రతీ బీట్‌లో మాస్, ప్రతీ ట్యూన్‌లో క్లాస్.. అదే ఆయన స్టైల్. ఈ మ్యూజిక్ మాస్ట్రో పుట్టినరోజు నేడు(నవంబర్ 16). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
తెలుగు సినీ సంగీతంలో ‘దూకుడు’ చూపిస్తూ ‘సౌండ్ ఆఫ్ సక్సెస్’గా పేరుతెచ్చుకున్నాడు.. తమన్. ప్రతీ బీట్‌లో మాస్, ప్రతీ ట్యూన్‌లో క్లాస్.. అదే ఆయన స్టైల్. ఈ మ్యూజిక్ మాస్ట్రో పుట్టినరోజు నేడు(నవంబర్ 16). ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు..
నా మ్యూజిక్ టైమ్...
అర్థ్థరాత్రి 2 నుంచి ఉదయం 6 గంటల మధ్య నా మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అదే నా మ్యూజిక్ టైమ్. ఆ సమయంలో కాఫీ తాగుతూ పియానో వద్ద కూర్చుంటా. ఒక ట్యూన్ మనసులో పుట్టాక, దాన్ని పూర్తి చేసేవరకు కూర్చున్నచోట నుంచి లేవను. ఒక్కోసారి భోజనం చేయడం కూడా మరిచిపోతా. స్టూడియోలో ఉన్న గణనాథుడి విగ్రహానికి దండం పెట్టుకుని, ఒక స్ట్రాంగ్ కాఫీ తాగి ట్యూన్ మొదలెడతా. అలా చేస్తే ట్యూన్ సులభంగా వస్తుందనేది నా నమ్మకం.
52 సార్లు ట్యూన్ మార్చా..

పాట వర్కవుట్ అవుతుందో, లేదో తెలుసుకోవడానికి మొదట ఒక చిన్న టెస్ట్ చేస్తా. పాట పూర్తయిన తర్వాత దాన్ని కారులో వింటూ డ్రైవ్‌కి వెళ్తా. అలా ప్రయాణిస్తూ ఆ పాట విన్నంతసేపూ ఏదో తెలియని ఫీలింగ్ కలిగితే ఆ పాట హిట్ అని అర్థం. లేకపోతే తిరిగి స్టూడియోకి వెళ్లి కొత్త ట్యూన్ మొదలెడతా. అలా ‘భీమ్లా నాయక్’ టైటిల్ ట్రాక్ కోసం 52 సార్లు ట్యూన్ మార్చా. చివరికి 53వ టేక్ హిట్ అయ్యింది.
ఆ పాటకి.. 12 నిమిషాలే..

‘అఖండ’లోని టైటిల్ సాంగ్ చేయడానికి నెలరోజుల సమయం పట్టింది. అదే ‘బిజినెస్‌మేన్’లోని ‘సారొస్తారా...’ సాంగ్ మాత్రం కేవలం 12 నిమిషాల్లోనే అయిపోయింది. ఒకరోజు ‘బిజినెస్‌మేన్’ షూటింగ్ కోసం అందరం గోవా వెళ్లాం. నేను, భాస్కరభట్ల గారు ఓ రూమ్‌లో ట్యూన్ చేయడం మొదలెట్టాం. నేను ‘తారత్తరత్తారే... రత్తారత్తారత్తారే..’ అంటూ ట్యూన్ వినిపించాను. భాస్కరభట్ల వెంటనే అందుకుని ‘సారొస్తారా’ అని పాట రాసి ఇచ్చేశారు. అలా 12 నిమిషాల్లో పూర్తిచేసేశాం. ఆ సినిమాకు అ పాటే పెద్ద అసెట్ అయింది. 10 గంటల్లో 6 పాటలు కంపోజ్ చేసిన రోజులూ ఉన్నాయి.
అదే నా కల...

ఆర్థికంగా వెనకబడిన వారికి ఉచితంగా సంగీతం నేర్పించాలనేది నా కల. అందుకే వారికోసం ప్రపంచస్థాయి మ్యూజిక్ స్టూడియోని నిర్మించాలనుకుంటున్నా. వాళ్లలో ఇంకో తమన్ పుడితే అదే నా జీవితంలో గొప్ప విజయం అవుతుంది. సంగీతం ఉన్న చోట నేరాల రేటు చాలా తక్కువగా ఉంటుందనేది నా నమ్మకం.
ఆయనే నా స్ఫూర్తి...

నేను ట్యూన్స్ కాపీ కొడుతున్నానంటూ కొన్ని సందర్భాల్లో విమర్శలు వస్తుంటాయి. అవి విన్నప్పుడు కొంత బాధగా ఉంటుంది. ఆ బాధను పోగొట్టుకోవడానికి వెంటనే గ్రౌండ్‌కి వెళ్లి క్రికెట్ ఆడతా. క్రికెటర్స్‌లో నాకు ధోని అంటే చాలా ఇష్టం. ఒక పాట బాగోలేదంటే చాలు.. ‘నీకెందుకన్నా సంగీతం’ అంటూ విమర్శిస్తుంటారు. ఇలాంటి భావోద్వేగ పరమైన విషయాల్లో నాకు స్ఫూర్తి ధోనీనే.
పర్సనల్ ఛాయిస్..
- నాకు మ్యూజిక్ ఎంత పిచ్చి అంటే.. రాత్రిపూట నిద్రలో కూడా టేబుల్ మీద టప్ టప్ అని కొడుతుంటానట. నా ఫ్రెండ్ చెప్తుంటాడు.
- నా పాట సూపర్ హిట్ అవ్వగానే.. మొదట మా అమ్మకి ఫోన్ చేసి చెప్తా.
- ఆర్థిక పరిస్థితులు బాగాలేని సమయంలో ఈఎమ్‌ఐలో నా మొదటి కీబోర్డు కొన్నా. ఇప్పటికీ దాన్ని భద్రంగా ఉంచుకున్నా.
- మహేష్‌బాబుకి కూల్ బీట్, బాలయ్యకి మాస్ బీట్...
ఇలా హీరో బాడీ లాంగ్వేజ్‌ను బట్టి మ్యూజిక్ ఇస్తుంటా.
- ‘గేమ్ ఛేంజర్’లోని ‘రా మచ్చా మచ్చా’ సాంగ్ బీజీఎం కోసం
సుమారు 900 ట్రాక్స్ మిక్స్ చేశా.
- ‘అఖండ’ సినిమాకు మ్యూజిక్ చేసే టైమ్‌లో ఆ పరమశివుడే నన్ను ఆవహించాడనే భావన కలిగింది. అందుకే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను పూనకాలు వచ్చే విధంగా డిజైన్ చేశా.
- ‘ఓజీ’ కోసం జపాన్ వాయిద్య పరికరం ‘కోటో’ను ఉపయోగించి బీజీఎం క్రియేట్ చేశా.