Share News

US Visa Health Rules: షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం

ABN , Publish Date - Nov 07 , 2025 | 05:26 PM

వీసా నిబంధనలను అమెరికా సర్కారు మరింత కఠినతరం చేసింది. ఇకపై లబ్ధిదారుల అనారోగ్యాల కారణంగా అమెరికా ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందనుకుంటే వారికి వీసాను తిరస్కరించొచ్చని ఎంబసీ, కాన్సులార్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

US Visa Health Rules:  షుగర్ వ్యాధి ఉంటే ఇక వీసా రానట్టే.. అమెరికా నిబంధనలు మరింత కఠినతరం
US visa health rules

ఇంటర్నెట్ డెస్క్: వలసలకు ఎలాగైనా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నిస్తున్న అమెరికా సర్కారు రోజుకో కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోంది. తాజాగా వీసాలకు సంబంధించిన ఆరోగ్య నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది (US New Visa Rules).

అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం, మధుమేహం, బీపీ, ఊబకాయం, గుండెజబ్బుల వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి వీసా తిరస్కరించేలా ట్రంప్ సర్కారు మార్గదర్శకాలు రూపొందించింది. అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ఈ నూతన మార్గదర్శకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంబసీలు, కాన్సులార్ కార్యాలయాలకు పంపించిందట. దీర్ఘకాలిక రోగాలు ఉన్న విదేశీయులను అమెరికా ప్రభుత్వ ఖజానాకు భారంగా పరిగణించి వీసా తిరస్కరించాలని సూచించింది. వృద్ధాప్యం లేదా ఆరోగ్య కారణాల వల్ల అమెరికా ప్రభుత్వ వైద్య సాయంపై ఆధారపడే అవకాశం ఉన్న విదేశీయులను ఆ మేరకు వర్గీకరించాలని సూచించింది (US Visa Rejection on Health Grounds).

వాస్తవానికి ఆరోగ్యకారణాల రీత్యా వీసాను తిరస్కరించే నిబంధనలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. కానీ తాజా మార్గదర్శకాల కారణంగా అధికారుల విచక్షణాధికారాలు మరింత విస్తృతం అవుతాయి. ప్రభుత్వ ఖజానాపై భారం పడే అవకాశం ఉన్న సందర్భాల్లో వీసాను తిరస్కరించే అవకాశాలు పెరుగుతాయి.


గుండె జబ్బులు, ఊపిరితిత్తుల సమస్యలు, క్యాన్సర్, డయాబెటిస్, మెటబాలిక్ సమస్యలు, మానసిక, న్యూరోలాజికల్ రుగ్మతలు వంటివాటికి లక్షల కొద్దీ డాలర్లు ఖర్చు అయ్యే అవకాశం ఉందని విదేశాంగ శాఖ తన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఊబకాయం కారణంగా ఆస్తమా, బీపీ వంటివి పెరిగి మెడికల్ బిల్లులు తడిసి మోపెడవుతాయని తెలిపింది. కాబట్టి, వీసాదరఖాస్తు దారులు సొంతంగా ఈ ఖర్చులు భరించగలరా? లేదా? అనే విషయాన్ని కాన్సులార్ అధికారులు నిర్ధారించాలి. అమెరికా ప్రభుత్వ సాయం అవసరం లేని విధంగా ఖర్చులకు సరిపడా అర్థిక వనరులు లబ్ధిదారుల వద్ద ఉన్నాయో? లేదో? చెక్ చేయాలి. వీసా దరఖాస్తుదారులతో పాటు వారిపై ఆధారపడ్డ కుటుంబం ఆరోగ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

ఇప్పటికే అమెరికా ప్రభుత్వం వలసలను కట్టడి చేసేందుకు అనేక మార్గాలను అవలంబిస్తోంది. శరణార్థులకు వీసాల నిరాకరణ, అక్రమవలసదారులను సొంత దేశాలకు పెద్ద ఎత్తున డిపోర్టు చేయడం, వీసా నిబంధనలు కఠినతరం చేయడం వంటి చర్యలు తీసుకుంది. ఇక తాజా నిబంధనలతో వీసాలు లభించడం మరింత కష్టమయ్యే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి:

ట్రంప్‌‌నకు ఝలక్.. న్యూయార్క్ నగర మేయర్‌గా జొహ్రాన్ మమ్దానీ ఎన్నిక

హెబ్-1బీ వీసా.. లేబర్ సర్టిఫికేషన్ దరఖాస్తుల పరిశీలన ప్రారంభం

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 07 , 2025 | 06:09 PM