US Foreign Student Visa Issues: మా చట్టాలు ఉల్లంఘించొద్దు
ABN , Publish Date - Apr 19 , 2025 | 03:58 AM
అమెరికా విదేశీ విద్యార్థులకు హెచ్చరిక, చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాలని తెలిపారు. వీసాల రద్దు కారణంగా విదేశీ విద్యార్థులు భయాందోళనలో ఉన్నారు

ధిక్కరిస్తే తీవ్ర పర్యవసానాలు.. విదేశీ విద్యార్థులకు అమెరికా హెచ్చరిక
న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: అమెరికా చట్టాలను ఉల్లంఘించడానికి ప్రయత్నించే విదేశీ విద్యార్థులు బహిష్కరణతో పాటు పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ దేశ విదేశాంగ శాఖ హెచ్చరించింది. అక్రమ వలసల నేపథ్యంలో ట్రంప్ ప్రభుత్వం ఇమిగ్రేషన్ చట్టాలను కఠినంగా అమలు చేస్తోందని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మార్గరెట్ మెక్‌లియోడ్ వెల్లడించారు. ‘మా చట్టాలను పాటించేవారికి అమెరికా మంచి అవకాశాలు కల్పిస్తుంది. కానీ చట్టాన్ని ఉల్లంఘించేవారు తీవ్ర పర్యవసానాలు ఎదుర్కొంటారు’ అని ఆమె స్పష్టం చేశారు. పీటీఐకి వర్చువల్‌గా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. జరిమానా పడకుండా ఉండాలంటే అమెరికా చట్టాలకు, వీసా ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని చెప్పారు. సరిహద్దు భద్రతకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని, చట్టాలను ఉల్లంఘించి దేశంలోకి చొరబడేవారిని స్వాగతించబోమని పేర్కొన్నారు. భారతీయుల బంధువులతో సహా అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వారంతా స్వచ్ఛందంగా తమ దేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ‘మీ స్వదేశాలకు తిరిగి వెళ్లడానికి ఇంకా అవకాశం ఉంది. అందుకోసం డీహెచ్‌ఎ్‌సను సంప్రదించాలి. లేదా సీబీపీ యాప్‌ను ఉపయోగించాలి’ అని మార్గరెట్ సూచించారు. కాగా, 2023-24 విద్యా సంవత్సరంలో 3.3 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికాలోని ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశాలు పొందారు. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 23 శాతం అధికం. అయితే ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరిలో భారతీయ విద్యార్థులకు జారీ చేసిన వీసాల సంఖ్య 30శాతం తగ్గుదల నమోదైంది.
విదేశీ విద్యార్థులకు గడ్డుకాలం
అమెరికాలో విదేశీ విద్యార్థులకు గడ్డుకాలం నడుస్తోంది. గత కొన్ని వారాల వ్యవధిలోనే వెయ్యి మందికి పైగా అంతర్జాతీయ విద్యార్థుల వీసాలను, వారి చట్టబద్ధ హోదాను ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలంటూ బాధితుల్లో పలువురు కోర్టులను ఆశ్రయిస్తున్నారు. విద్యార్థుల చట్టపరమైన హోదాను రద్దు చేయడానికి ఫెడరల్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో వందలాది మంది నిర్బంధం, బహిష్కరణ ముప్పు ముంగిట్లో నిలిచారు. చిన్నచిన్న కాలేజీలతో పాటు హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్ వంటి ప్రైవేట్ వర్సిటీలు, యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్, ఒహియో స్టేట్ యూనివర్సిటీ వంటి పెద్ద ప్రభుత్వ సంస్థల్లోని విద్యార్థులు ఈ జాబితాలో ఉన్నారు. అసోసియేటెడ్ ప్రెస్ అంచనాల ప్రకారం.. గత మార్చి చివరివారం నుంచి ఇప్పటి వరకూ అమెరికా వ్యాప్తంగా 160 కాలేజీలు, వర్సిటీలకు చెందిన కనీసం 1,024 మంది విద్యార్థుల వీసాలు రద్దయ్యాయి. ఇంత హఠాత్తుగా తమ వీసాలు రద్దు చేయడానికి ప్రభుత్వం వద్ద సమర్థనీయ కారణాలేవీ లేవని డీహెచ్‌ఎ్‌సకు వ్యతిరేకంగా కోర్టుల్లో దావాలు వేస్తున్న విద్యార్థులు ఆరోపిస్తున్నారు.
వీసాల రద్దు ఎందుకంటే...?
అనేక కారణాల వల్ల వీసాలు రద్దయ్యే అవకాశం ఉన్నప్పటికీ ట్రాఫిక్ ఉల్లంఘనల వంటి చిన్న కారణాలే ఎక్కువగా ఉన్నాయని.. అదీ చాలాకాలం క్రితం నాటి ఘటనలు కూడా ఇప్పుడు తెరపైకి తెస్తున్నారని కాలేజీ యాజమాన్యాలు చెబుతున్నాయి. మరికొన్ని కేసుల్లో అసలు తమను ఎందుకు టార్గెట్ చేశారో అర్థం కావడం లేదని విద్యార్థులు వాపోతున్నారు. ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తే దేశవ్యాప్తంగా భారీ సంఖ్యలో విదేశీ విద్యార్థి వీసాలను రద్దుచేసే విధానాన్ని డీహెచ్‌ఎస్ పాటిస్తోందని అర్థమవుతోందని మిషిగాన్ వర్సిటీ న్యాయవాదులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. డార్ట్‌మౌత్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదువుతున్న చైనా విద్యార్థి వీసా రద్దు చేసిన కేసులో న్యూహాం్‌పషైర్ ఫెడరల్ కోర్టు జడ్జి దాన్ని కొట్టివేస్తూ గతవారం ఉత్తర్వులు జారీ చేశారు. జార్జియా, కాలిఫోర్నియాల్లోనూ న్యాయవాదులు ఇటువంటి వ్యాజ్యాలను దాఖలు చేశారు. ఈ పరిణామాలపై డీహెచ్‌ఎస్ అధికారులు నోరు మెదపడం లేదు. ఒకటి రెండు కేసులు మినహా చాలా కేసుల్లో పాలస్తీనా అనుకూల కార్యకలాపాల్లో తమ విద్యార్థులు పాల్గొన్న దాఖలాలు లేవని కాలేజీలు సైతం స్పష్టం చేస్తున్నాయి.
విద్యార్థుల్లో భయాందోళనలు
చట్టబద్ధమైన హోదా కోల్పోయిన విద్యార్థులు దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. లేకుంటే వారిని ఇమిగ్రేషన్ అధికారులు నిర్బంధించే ప్రమాదం ఉంది. అరెస్టు భయంతో ఇప్పటికే కొంతమంది విద్యార్థులు తమ చదువులను మధ్యలోనే వదిలేసి అమెరికా విడిచి స్వదేశాలకు వెళ్లిపోయారు. ప్రయాణ సమయంలో వీసా, పాస్‌పోర్టుతో పాటు ఇతర కీలక పత్రాలను వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నాయి. అయితే అరెస్టులు, వీసా రద్దు వంటి చర్యలు అంతర్జాతీయ విద్యార్థుల్లో అమెరికా పట్ల విముఖత కలిగిస్తాయని విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ కారణంగా తమ వీసాను రద్దు చేస్తున్నారో స్పష్టత లేకపోవడం వారిలో భయాందోళనలకు కారణమవుతున్నాయని పేర్కొంటున్నారు.
విద్యార్థి వీసాల రద్దుపై కాంగ్రెస్ ఆందోళన
విదేశీ విద్యార్థుల వీసా రద్దు కేసుల్లో 50% భారతీయులవేనని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ అసోసియేషన్ (ఏఐఎల్‌ఏ) పేర్కొనడంపై కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఏఐఎల్‌ఏ విడుదల చేసిన ప్రకటనను కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేశ్ ‘ఎక్స్’లో షేర్ చేశారు. వీసా రద్దుకు కారణాలు స్పష్టంగా లేకపోవడం భయాందోళన కలిగిస్తోందని పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి జైశంకర్ అసలు ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ మంత్రి దృష్టికి తీసుకెళ్లారా అని ఆయన ప్రశ్నించారు. కాగా, న్యాయవాదులు, విద్యార్థులు, వివిధ వర్సిటీల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం 327 మంది విదేశీ విద్యార్థుల వీసాలు రద్దయ్యాయని, వారిలో సగం మంది భారత్ నుంచి వచ్చినవారే కావడం గమనార్హం.