Share News

Donald Trump: భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం

ABN , Publish Date - Jun 28 , 2025 | 05:07 AM

భారత్‌తో త్వరలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం దిశగా జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపారు.

Donald Trump: భారత్‌తో భారీ వాణిజ్య ఒప్పందం

  • త్వరలోనే కుదుర్చుకోబోతున్నాం

  • నిన్ననే చైనాతో ఒప్పందంపై సంతకం చేశాం

  • అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడి

  • ఒప్పందంపై చర్చల కోసం ఇప్పటికే

  • వాషింగ్టన్‌కు చేరుకున్న భారత బృందం

వాషింగ్టన్‌, జూన్‌ 27: భారత్‌తో త్వరలో అతిపెద్ద వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోనున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం దిశగా జరుగుతున్న చర్చల్లో పురోగతి కనిపిస్తోందని తెలిపారు. గురువారం వైట్‌హౌజ్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ‘‘అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై ఎవరైనా ఆసక్తి చూపుతున్నారా? అని అడిగారు కదా! ప్రతి దేశం అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవాలని, భాగస్వామ్యం కావాలని కోరుకుంటోంది. ప్రభుత్వ యంత్రాంగం దీనిపై రాత్రింబవళ్లు పనిచేస్తోంది. ఒప్పందాలు కుదుర్చుకునే ప్రక్రియ కొనసాగిస్తోంది. కొన్ని గొప్ప ఒప్పందాలు జరగబోతున్నాయి. నిన్ననే చైనాతో ఒప్పందంపై సంతకం చేశాం. భారత్‌తోనూ త్వరలో ఒప్పందం చేసుకోబోతున్నాం. అది భారీ స్థాయిలో ఉండబోతోంది..’’ అని ట్రంప్‌ వెల్లడించారు. అలాగని అన్ని దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోబోమని చెప్పారు. కొందరికి ఒక లేఖ రాసి ధన్యవాదాలు చెబుతామని.. వారు 25శాతమో, 35శాతమో, 45శాతమో పన్ను కట్టాల్సి ఉంటుందని స్పష్టం చేస్తామని పేర్కొన్నారు. కానీ తమవాళ్లు ఇలా చేయాలని కోరుకోవడం లేదని, ఎక్కువ ఒప్పందాలు కుదుర్చుకోవాలని కోరుకుంటున్నారని వెల్లడించారు. అయితే చైనాతో ఒప్పందంలోని అంశాలేమీ ట్రంప్‌ వెల్లడించలేదు. మరోవైపు కొన్ని నియంత్రిత ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేసేందుకు అనుమతిస్తామని.. చైనాకు వ్యతిరేకంగా అమెరికా చేపట్టిన చర్యలను అమెరికా వెనక్కి తీసుకుంటుందని పేర్కొంటూ చైనా వాణిజ్యశాఖ శుక్రవారం ఒక ప్రకటన జారీ చేసింది.


వాషింగ్టన్‌కు చేరుకున్న భారత బృందం

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేశ్‌ అగర్వాల్‌ నేతృత్వంలోని భారత బృందం గురువారమే వాషింగ్టన్‌కు చేరుకుంది. ట్రంప్‌ సుంకాల ప్రకటన నేపథ్యంలో.. ద్వైపాక్షిక ఒప్పందంపై ఇరు దేశాల మధ్య కొన్ని నెలలుగా చర్చలు జరుగుతున్నాయి. సుంకాల అమలుకోసం పెట్టుకున్న గడువు జూలై 9వ తేదీ నాటికి ఒప్పందం కుదుర్చుకునే దిశగా అడుగులు పడుతున్నాయి. యాపిల్స్‌, నట్స్‌, కొన్ని రకాల జన్యుమార్పిడి వ్యవసాయ ఉత్పత్తులు, పాడి ఉత్పత్తులు, పలు రకాల పారిశ్రామిక ఉత్పత్తులు, ఎలక్ట్రిక్‌ వాహనాలు, మద్యం, పెట్రోలియం ఉత్పత్తులపై దిగుమతి సుంకాలు మినహాయించాలని అమెరికా కోరుతుంది. ఇందులో వ్యవసాయ, పాడి దిగుమతుల విషయంలో కస్టమ్స్‌ పన్నును మినహాయించే/ తగ్గించే అంశంలో పీటముడి పడుతోంది. అలా చేస్తే భారత రైతులపై ప్రభావం పడుతుందన్న ఆందోళన ఉంది. ఇక జౌళి ఉత్పత్తులు, వస్త్రాలు, ఆభరణాలు, రత్నాలు, తోలు, ప్లాస్టిక్‌ ఉత్పత్తులు, రసాయనాలు, నూనె గింజలు, రొయ్యలు, ద్రాక్ష, అరటి వంటివాటిపై దిగుమతి సుంకాలు మినహాయించాలని/తగ్గించాలని అమెరికాను భారత్‌ కోరుతోంది.


మెరిట్‌ ఆధారిత వీసా ప్రక్రియ ఉండాలి అమెరికా కొత్త నిబంధనలపై భారత్‌

న్యూఢిల్లీ, జూన్‌ 27: వీసాల మంజూరు విషయంలో అమెరికా కొత్త నిబంధనలు, మార్గదర్శకాలపై భారత్‌ స్పందించింది. భారతీయుల వీసా దరఖాస్తులను మెరిట్‌ ఆధారంగా పరిగణించాలని విదేశాంగ శాఖ అఽధికార ప్రతినిధి జైశ్వాల్‌ కోరారు. భారతీయ పౌరుల చట్టబద్ధమైన హక్కులను కాపాడేందుకు కాన్సులర్‌ సేవలకు సంబంధించిన అన్ని విషయాల్లో అమెరికాతో భారత్‌ నిరంతరం టచ్‌లో ఉంటుందని పేర్కొన్నారు. ఇక నుంచి తమ దేశ వీసాకు దరఖాస్తు చేసే వారందరూ గత ఐదేళ్లలో వినియోగించిన అన్ని సోషల్‌ మీడియా ఖాతాల యూజర్‌ నేమ్‌లు లేదా హ్యాండిల్స్‌ వివరాలను డీఎస్‌-160 ఫామ్‌లో వెల్లడించాలని భారత్‌లోని అమెరికా ఎంబసీ గురువారం ఓ ప్రకటనలో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. లేదంటే అప్లికేషన్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశంతో పాటు భవిష్యత్తులో వీసా పొందేందుకు అనర్హులవుతారని హెచ్చరించింది. మరోవైపు వలసదారులకు యూఎస్‌ సిటిజన్‌షిప్‌ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ సర్వీసెస్‌ (యూఎ్‌ససీఐఎస్‌) గట్టి హెచ్చరికలు చేసింది. ఎవరైనా తమ దేశ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, వారి గ్రీన్‌కార్డులు, వీసాలను రద్దు చేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ‘ఎక్స్‌’లో పోస్టు చేసింది. ఉగ్రవాదానికి మద్దతు పలకడం, ప్రోత్సహించడం వంటి తీవ్ర నేరాల్లో దోషులుగా తేలినవారి గ్రీన్‌కార్డులు, వీసాలను రద్దు చేస్తామని పేర్కొంది. అమెరికాలో నివసించడం షరతులతో కూడిన ప్రత్యేక సౌకర్యం మాత్రమేనని, హమీ ఇవ్వబడిన హక్కు కాదని స్పష్టం చేసింది. హింసను ప్రోత్సహించినా, ఉగ్ర కార్యకలాపాలకు మద్దతు పలికినా.. అమెరికాలో నివసించేందుకు అనర్హులవుతారని పేర్కొంది.

Updated Date - Jun 28 , 2025 | 05:07 AM