Share News

PM Modi IBSA Meet: ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యం

ABN , Publish Date - Nov 23 , 2025 | 05:32 PM

మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్‌ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు.

PM Modi IBSA Meet: ఐరాస భద్రతా మండలిలో సంస్కరణలు అనివార్యం
PM Modi

జొహన్నెస్‌బర్గ్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) అన్నారు. సంస్కరణ అనేది ఇష్టం ఉన్నప్పుడు ఎంపిక చేసుకునేది కాదని, దీనిని అమలు చేయడం అవసరమని అన్నారు. ప్రపంచ పరిపాలనా వ్యవస్థలో సంస్కరణలు కావాలని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా ట్రోయికా స్పష్టమైన సందేశం ఇవ్వాలని సూచించారు. ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా (IBSA) లీడర్ల సదస్సును ఉద్దేశించి మోదీ ఆదివారంనాడు మాట్లాడుతూ, ప్రపంచం ఛిన్నాభిన్నంగా, విభజనకు గురవుతున్నట్టు కనిపిస్తున్న తరుణంలో ఐక్యత, సహకారం, మానవత్వ సందేశాన్ని ఐబీఎస్ఏ ఇవ్వాలని పిలుపునిచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లుల డిసిల్వా ఈ సదస్సులో పాల్గొన్నారు.


ఐబీఎస్ఏ ఎన్ఎస్ఏ స్థాయి సమావేశాన్ని సంస్థాగతం చేయడం ద్వారా ఇండియా-బ్రెజిల్-సౌత్ ఆఫ్రికా దేశాల మధ్య భద్రతా సహకారాన్ని పటిష్టం చేయాలని మోదీ ప్రతిపాదించారు. 'ఉగ్రవాదంపై పోరులో పరస్పర సమన్వయంతో మనం ముందుకు వెళ్లాలి. ఇలాంటి సీరియస్ అంశాల విషయంలో ద్వంద్వ ప్రమాణాలకు తావులేదు' అని అన్నారు.


మానవ కేంద్రీకృత అభివృద్ధిలో టెక్నాలజీ అనేది చాలా కీలకమని మోదీ పేర్కొన్నారు. ఇందుకోసం 'ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నొవేషన్ అలయెన్స్' ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ప్రతిపాదించారు. యూపీఏ, కోవిన్ వంటి హెల్త్‌ఫ్లాట్‌ఫాంలు, సైబర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమాచారాన్ని పంచుకునే అవకాశం ఉంటుందని అన్నారు. 40 దేశాల్లో విద్య, ఆరోగ్య, మహిళా సాధికారత, సోలార్ ఎనర్జీ వంటి రంగాలకు ఐబీఎస్ఏ ఫండ్స్ సపోర్ట్‌గా నిలబడటం ప్రశంసనీయమని అన్నారు. వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం (క్లైమేట్ రిసిలెంట్ అగ్రికల్చర్) కోసం ఐబీఎస్ఏ ఫండ్‌కు మోదీ ప్రతిపాదన చేశారు. సౌత్-సౌత్ కోఆపరేషన్‌ను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ఈ చర్య ఉపకరిస్తుందని అన్నారు.


ఐబీఎస్ఏ కేవలం మూడు దేశాల గ్రూప్ కాదని, మూడు ఖండాలు, మూడు ప్రజాస్వామ్య దేశాలు, మూడు కీలక ఆర్థిక వ్యవస్థలను కలిపే కీలకమైన వేదిక అని మోదీ అభివర్ణించారు. మిల్లెట్స్, ప్రకృతి వ్యవసాయం, డిజాస్టర్ రెసిలెన్స్, గ్రీన్ ఎనర్జీ, సంప్రదాయ ఔపధాలు, ఆరోగ్య భద్రత వంటి రంగాల్లో పరస్పరం సహకరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. వచ్చే ఏడాది ఇండియాలో జరిగే 'ఐఏ ఇంపాక్ట్ సమ్మిట్‌'కు హాజరుకావాలని ఐబీఎస్ఏ నేతలను మోదీ ఆహ్వానించారు.


ఇవి కూడా చదవండి..

సింథటిక్‌ డ్రగ్స్‌ మహా ప్రమాదం

చైనాలో పెరిగిన పెళ్లిళ్ల సంఖ్య.. ప్రభుత్వ వర్గాల్లో హర్షం

Read Latest International And Telugu News

Updated Date - Nov 23 , 2025 | 05:35 PM