Trump: మస్క్ పూర్తిగా గాడితప్పారు
ABN , Publish Date - Jul 08 , 2025 | 05:24 AM
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయడాన్ని హాస్యాస్పదమైన నిర్ణయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు.

పార్టీ ఏర్పాటు ఓ హాస్యాస్పద నిర్ణయం
నాసాలోకి తన మిత్రుణ్ణి తీసుకోవాలని నాపై ఒత్తిడి: ట్రంప్
న్యూయార్క్, జూలై 7: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ కొత్తగా రాజకీయ పార్టీని ఏర్పాటుచేయడాన్ని హాస్యాస్పదమైన నిర్ణయంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. మస్క్ ఐదు వారాలుగా పూర్తిగా గాడి తప్పిపోయారన్నారు. అమెరికాలో మూడోపార్టీని ఏర్పాటుచేయడం తెలివితక్కువ నిర్ణయమని ట్రంప్ అన్నారు. ద్విపార్టీ వ్యవస్థ నడుస్తున్న అమెరికా రాజకీయాల్లో మూడో పార్టీ ఏర్పాటు గందరగోళానికి దారితీస్తుందని తెలిపారు. అమెరికాలో మూడోపార్టీ విజయం సాధించిన చరిత్రే లేదని వివరించారు. వాహన రాయితీలు రద్దయిపోయి, అందరూ ఎలక్ర్టిక్ వాహనాలు కొనుగోలు చేసేలా మస్క్ ఎత్తు వేశారని ట్రంప్ విమర్శించారు. తన స్నేహితుడు జార్డ్ ఇసాక్‌మన్‌ను నాసాలోకి ప్రవేశపెట్టాలంటూ తనపై మస్క్ ఒత్తిడిని తెచ్చారని ఆరోపించారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లు విషయంలో ట్రంప్‌తో విభేదించి ‘డోజ్’ నుంచి మస్క్ తప్పుకోగానే జార్డ్ ఇసాక్‌మన్‌కు సంబంధించిన నామినేషన్ కూడా రద్దయిపోయింది. స్పేస్ బిజినె్‌సలో ఉన్న ఇసాక్‌మన్‌కు నాసా పగ్గాలు అప్పగించడం సబబు కాదని భావించానని ట్రంప్ తెలిపారు.
ట్రంప్‌పై మస్క్ తొలి దాడి
మస్క్ తన తొలిదాడిని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఎక్కుపెట్టారు. బాలలపై లైంగిక దాడుల కేసుల్లో నిందితుడిగా ఉండి 2019లో పోలీస్ కస్టడీలో మరణించిన జఫ్రీ ఎప్‌స్టీయిన్ వివాదాన్ని ఆయన మరోసారి తెరపైకి తెచ్చారు. ఎప్‌స్టెయిన్ తన క్లయింట్లకు బాలలను సరఫరా చేసేవాడు. ఆ తర్వాత వారిని బెదిరించి డబ్బులు గుంజేవాడు. ఇలాంటి క్లయింట్ల జాబితాలో ట్రంప్ కూడా ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఎప్‌స్టెయిన్ చనిపోయిన వ్యవహారంలో ఇంతవరకు అరెస్టులు జరగలేదని మస్క్ తాజాగా విమర్శించారు.