Donald Trump: జెలెన్‌స్కీపై మండిపడ్డ డొనాల్డ్ ట్రంప్.. కృతజ్ఞత లేదని ఆగ్రహం
ABN , Publish Date - Nov 24 , 2025 | 08:13 AM
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగించేందుకు అమెరికా కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిపై స్విట్జర్‌ల్యాండ్ వేదికగా అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. అయితే, చర్చలు మొదలైన కొన్ని గంటలకే ఉక్రెయిన్ అధ్యక్షుడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. తమ ప్రయత్నాలపై ఉక్రెయిన్‌కు అసలు కృతజ్ఞతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి నెలకొల్పే దిశగా అమెరికా ప్రయత్నాలపై ఉక్రెయిన్‌కు అసలు కృతజ్ఞతే లేదని మండిపడ్డారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు అమెరికా ప్రతిపాదించిన ప్లాన్‌పై స్విట్జర్‌ల్యాండ్ వేదికగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ కామెంట్స్ చేశారు (Trump criticizes Zelensky).
జెలెన్‌స్కీ తీరుపై మండిపడుతూ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పోస్టు పెట్టారు. అమెరికా, ఉక్రెయిన్ నాయకత్వం సరిగ్గా వ్యవహరించి ఉంటే అసలు రష్యాతో యుద్ధం జరిగి ఉండేదే కాదని అన్నారు. ఇలాంటి యుద్ధం తనకు సంక్రమించిందని వ్యాఖ్యానించారు. స్విట్జర్‌ల్యాండ్‌లో అమెరికా, ఉక్రెయిన్ బృందాల మధ్య చర్చలు మొదలైన కొన్ని గంటలకే ట్రంప్ ఇలా మండిపడటం గమనార్హం. అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై వాడీవేడిగా చర్చ జరిగిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి (US Peace Proposal).
అయితే, ట్రంప్ పోస్టు పెట్టిన కొద్ది సేపటికే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్ వేదికగా స్పందించారు. అమెరికా అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు. పరిస్థితులను చక్కదిద్దడంలో అమెరికా నాయకత్వ పాత్ర కీలకమని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ భద్రత కోసం అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు కృతజ్ఞత వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికా 28 పాయింట్లతో ఓ ప్రతిపాదన తెచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం స్విట్జర్‌ల్యాండ్‌లో అమెరికా, ఉక్రెయిన్ ప్రతినిధులు ఈ ప్రతిపాదనపై చర్చలు జరుపుతున్నారు. ఈ ముసాయిదా ఒప్పందం ప్రకారం, శాంతి స్థాపనకు ఉక్రెయిన్ తమ దేశంలోని కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. సైనిక శక్తినీ తగ్గించుకోవాలి. నాటో కూటమిలో చేరాలన్న ప్రయత్నాలను కట్టిపెట్టాలి.
ఉక్రెయిన్ మాత్రం ఈ ప్రతిపాదనపై సుముఖంగా లేదు. నాలుగేళ్లుగా రష్యాతో ఉక్రెయిన్ సైన్యం పోరాడుతోంది. ఈ పరిస్థితుల్లో భూభాగాన్ని వదులుకోవడమంటే.. రష్యాకు లొంగిపోయినట్టే అన్న భావన ఉక్రెయిన్ సైనిక వర్గాల్లో వినిపిస్తోంది. యుద్ధం మరింత కాలం పాటు కొనసాగించేందుకు ఉక్రెయిన్‌కు సాధ్యం కాదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాదిస్తున్నారు. జెలెన్‌స్కీకి ఐరోపా దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ తన భూభాగాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
హెజ్‌బొల్లా చీఫ్ ఆఫ్ స్టాఫ్ టార్గెట్‌గా బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి
చైనాలో పెరిగిన పెళ్లిళ్ల సంఖ్య.. ప్రభుత్వ వర్గాల్లో హర్షం
Read Latest International And Telugu News