Canada Trade Talks: కెనడాపై ట్రంప్ ఆగ్రహం.. వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు ప్రకటన
ABN , Publish Date - Jun 28 , 2025 | 07:55 AM
అమెరికా కంపెనీలపై విధించే డిజిటల్ సర్వీస్ ట్యాక్స్ విషయంలో గుర్రుగా ఉన్న ట్రంప్ కెనడాతో వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు.

ఇంటర్నెట్ డెస్క్: కెనడా విధిస్తున్న డిజిటల్ సర్వీస్ ట్యాక్స్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుర్రుగా ఉన్నారు. ఈ విషయంలో పొరుగుదేశం వెనక్కు తగ్గకపోవడంతో వాణిజ్య చర్చలు (US Canada Trade Talks) ముగిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. అమెరికన్ కంపెనీలపై విధిస్తున్న డిజిటల్ ట్యాక్స్‌ను దాడిగా అభివర్ణించారు. ఇందుకు దీటుగా కెనడాపై కూడా సుంకాలు విధిస్తామని అన్నారు. త్వరలో ఈ వివరాలు వెల్లడిస్తానని తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో పేర్కొన్నారు. కెనడాలో 20 మిలియన్ డాలర్లకు మించి రెవెన్యూ ఉన్న అమెరికా టెక్ సంస్థలపై కెనడా డిజిటల్ సర్వీస్ పన్ను విధిస్తోంది. దీంతో, యాపిల్, అమెజాన్, మెటా లాంటి సంస్థలు మూడు శాతం పన్ను చెల్లించాల్సి వస్తోంది. గతేడాది ఈ పన్నును అమల్లోకి తెచ్చారు. రెట్రోస్పెక్టివ్‌గా దీన్ని 2022 నుంచి వర్తిస్తామని కెనడా ప్రభుత్వం పేర్కొంది.
కెనడా విధిస్తున్న ఈ సర్వీసు ట్యాక్స్‌పై ట్రంప్ మొదటి నుంచీ గుర్రుగా ఉన్నారు. ఈ విషయంలో ఇరు దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో చివరకు వాణిజ్య చర్చలు ముగిస్తున్నట్టు వెల్లడించారు. ‘ఇది చాలా దారుణమైన పన్ను, అందుకే కెనడాతో వాణిజ్య చర్చలన్నిటికీ తక్షణం ముగింపు పలుకుతున్నాము. కెనడాతో వాణిజ్యం చాలా కష్టం. వారు తమ తీరు మార్చుకునే వరకూ ఎలాంటి చర్చలూ ఉండవు’ అని ట్రంప్ పేర్కొన్నారు.
కాగా, ట్రంప్ ప్రకటనపై కెనడా ఆచితూచి స్పందించింది. ‘కెనడా వర్కర్లు, వ్యాపారాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అమెరికాతో ఈ సంక్లిష్ట వాణిజ్య చర్చల్లో పాల్గొంటాము’ అని కెనడా ప్రధాని మార్క్ కార్నీ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికాకు కెనడా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. గతేడాది ఇరు దేశాల మధ్య 760 బిలియన్ డాలర్ల విలువైన వాణిజ్యం జరిగింది. ట్రంప్ అధికారంలోకి వచ్చాక వాణిజ్య లోటును పూడ్చుకునేందుకు కెనడాపై భారీగా సుంకాలు విధించారు. ఆ తరువాత సుంకాల విధింపును తాత్కాలికంగా పక్కనపెట్టి కెనడాతో చర్చలు మొదలెట్టారు.
ఇటీవలి జీ7 సమ్మిట్‌లో కూడా ఇరు దేశాలు మధ్య వాణిజ్యం చర్చకు వచ్చింది. ఆమోదయోగ్యమైన వాణిజ్య ఒప్పందాన్ని 30 రోజుల్లో కుదుర్చుకోవాలని ట్రంప్, కార్నీ అంగీకరించారు. ఇంతలోనే చర్చలకు ముగింపు పడటంతో మళ్లీ వివాదం మొదటికి వచ్చినట్టైంది.
ఇవీ చదవండి:
ట్రంప్ వీసా ఆంక్షలతో వైద్య సిబ్బంది కొరత.. అందోళనలో అమెరికా ఆసుపత్రులు
కెనడాలో భారతీయ యువతి మృతి.. వెల్లడించిన కాన్సులేట్ కార్యాలయం
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి