Share News

Thailand Cambodia Conflict: ముదురుతున్న టెంపుల్‌ వార్‌!

ABN , Publish Date - Jul 26 , 2025 | 03:28 AM

పురాతన శైవ ఆలయాలున్న ప్రాంతం కోసం థాయ్‌లాండ్‌, కాంబోడియా మధ్య మొదలైన యుద్ధం ముదురుతోంది..

Thailand Cambodia Conflict: ముదురుతున్న టెంపుల్‌ వార్‌!

థాయ్‌లాండ్‌, కంబోడియా మధ్య మరింత పెరిగిన దాడులు

  • 20కి చేరిన మృతులు

  • ఇరువైపులా లక్షన్నర మంది సురక్షిత ప్రాంతాలకు..

  • థాయ్‌లాండ్‌ సరిహద్దుల్లోని 8 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి

బ్యాంకాక్‌, జూలై 25: పురాతన శైవ ఆలయాలున్న ప్రాంతం కోసం థాయ్‌లాండ్‌, కాంబోడియా మధ్య మొదలైన యుద్ధం ముదురుతోంది. మొదట వివాదాస్పద ప్రాంతాల్లోనే పరస్పరం దాడులు చేసుకున్న ఇరుదేశాల సైన్యాలు.. శుక్రవారం 817 కిలోమీటర్ల మేర ఉన్న సరిహద్దుల వెంట ఇతర ప్రాంతాల్లో శతఘ్నులు, హెవీ మెషీన్‌ గన్‌లతో భారీగా కాల్పులకు దిగాయి. కాంబోడియా స్వల్పశ్రేణి రాకెట్లు ప్రయోగిస్తుండగా, థాయ్‌లాండ్‌ డ్రోన్లతో బాంబులు వేస్తోంది. దీనితో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఇరువైపులా లక్షన్నర మందికిపైగా సరిహద్దుల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలినట్టు అంచనా. కాంబోడియా సరిహద్దుల్లోని తమ ఎనిమిది రాష్ట్రాల్లో థాయ్‌లాండ్‌ అత్యవసర పరిస్థితి ప్రకటించింది. సరిహద్దుల్లోని ఆరు జాతీయ పార్కులను మూసివేసి, సిబ్బందిని అక్కడి నుంచి తరలించింది. శుక్రవారం నాటికి థాయ్‌లాండ్‌లో మృతుల సంఖ్య 20కి పెరిగింది. మరో 65 మంది తీవ్రంగా గాయపడ్డారు. కాంబోడియాలో ఒకరు మరణించినట్టు, పదుల సంఖ్యలో గాయపడినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. యుద్ధం నేపథ్యంలో థాయ్‌లాండ్‌, కాంబోడియాలకు వెళ్లే తమ దేశ ప్రయాణికులకు భారత్‌, యూఎ్‌సఏ, జపాన్‌ హెచ్చరికలు జారీ చేశాయి.


భద్రతా మండలి అత్యవసర సమావేశం

ఆసియాన్‌కు నేతృత్వం వహిస్తున్న మలేషియా ప్రతిపాదన మేరకు కాల్పుల విరమణకు తాము సిద్ధమైనా.. థాయ్‌లాండ్‌ వినడం లేదని, ఈ అంశంలో ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలని కాంబోడియా ప్రధాని హున్‌ మానెట్‌ విజ్ఞప్తి చేశారు. దీనితో ఈ యుద్ధం అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించేందుకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సిద్ధమైంది. ఇక థాయ్‌లాండ్‌తో వివాదం నెలకొన్న నాలుగు ప్రాంతాలకు సంబంధించి అంతర్జాతీయ కోర్టు (ఐసీజే)లో కాంబోడియా తాజాగా మళ్లీ ఫిర్యాదు చేసింది. ఇంతకు ముందు ఐసీజే తీర్పులను థాయ్‌లాండ్‌ తోసిపుచ్చిన నేపథ్యంలో కాంబోడియా తాజా ఫిర్యాదు.. ఉద్రిక్తతలను మరింత పెంచుతుందనే అభిప్రాయం నెలకొంది. మరోవైపు తమ వివాదంలో మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని ఒప్పుకోబోమని థాయ్‌లాండ్‌ ప్రకటించింది.

రక్షణ సామర్థ్యంలో ఎంతో తేడా!

పరస్పరం యుద్ధానికి కాలు దువ్వుతున్న థాయ్‌లాండ్‌, కాంబోడియాల మధ్య రక్షణ సామర్థ్యంలో తేడా అంతా ఇంతా కాదు. రక్షణ వ్యయం, యుద్ధ విమానాలు, సైన్యం సంఖ్య.. ఇలా ఎలా చూసినా కాంబోడియా కంటే థాయ్‌లాండ్‌ సామర్థ్యం చాలా ఎక్కువ. అంతర్జాతీయ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ స్ట్రాటజిక్‌ స్టడీస్‌ నివేదిక ప్రకారం.. గత ఏడాది థాయ్‌ రక్షణ బడ్జెట్‌ సుమారు రూ.49.3 వేల కోట్లు. 3.6 లక్షల మంది సైనికులు ఉన్నారు. 400 యుద్ధ ట్యాంకులు, 2,600 శతఘ్నులు, అమెరికా తయారీ 28 ఎఫ్‌-16లు సహా 112 యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లు, దాడులు చేయగల డ్రోన్లు, ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌ క్యారియర్‌, మరో 7యుద్ధ నౌకలు థాయ్‌ అమ్ములపొదిలో ఉన్నాయి. మరోవైపు కాంబోడియా రక్షణ బడ్జెట్‌ రూ.11.2 వేల కోట్లు మాత్రమే. సైనికుల సంఖ్య 1.24 లక్షలు. 200 యుద్ధ ట్యాంకులు, 480 శతఘ్నులు, 16 యుద్ధ హెలికాప్టర్లు ఉన్నాయి. ఒక్క యుద్ధ విమానం కూడా లేదు.


ఇవి కూడా చదవండి

వాయుగుండం.. మళ్లీ భారీ వర్షాలు

పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఈ మోసాల గురించి హెచ్చరిక..

For More Andhrapradesh News And Telugu News

Updated Date - Jul 26 , 2025 | 03:28 AM