Share News

Taliban Warns Pakistan: పాక్‌తో యుద్ధానికి సిద్ధమే.. శాంతి చర్చల్లో ప్రతిష్టంభనపై అఫ్గాన్ మండిపాటు

ABN , Publish Date - Nov 08 , 2025 | 09:39 PM

అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్‌ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.

Taliban Warns Pakistan: పాక్‌తో యుద్ధానికి సిద్ధమే.. శాంతి చర్చల్లో ప్రతిష్టంభనపై అఫ్గాన్ మండిపాటు
Noorullah Noori

ఇస్తాంబుల్: అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య ఇస్తాంబుల్‌లో తాజా రౌండ్ శాంతి చర్చల్లో మళ్లీ ప్రతిష్టంభన తలెత్తింది. ఎలాంటి శాంతి ఒప్పందం కుదరకుండా చర్చలు అర్ధాంతరంగా ముగియడంతో పాకిస్థాన్‌పై ఇస్లామిక్ ఎమెరేట్ ఆఫ్ ఆప్ఘనిస్థాన్ తీవ్ర పదజాలంపై విరుచుకుపడింది. ఇస్లామాబాద్‌కు ఎలాంటి చిత్తశుద్ధి లేదని, కాబూల్‌పై నెపం పెట్టేసేందుకు సాకులు వెతుక్కుంటోందని ఆరోపించింది. తుర్కియే, ఖతార్‌లు మధ్యవర్తిత్వానికి ఎంతగా ప్రయత్నిస్తున్నప్పటికీ చర్చలు ఎలాంటి పురోగతికి నోచుకుండా బాధ్యాతారాహిత్యంతో పాకిస్థాన్ వ్యవహరిస్తోందని తాలిబాన్ ప్రభుత్వం ఆక్షేపణ తెలిపింది.


'అఫ్గాన్ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. మా గడ్డపై నుంచి మరో దేశంపై దాడి చేసేందుకు ఎవరినీ మేము అనుమతించం. అఫ్గాన్ సార్వభౌమాధికారం, స్వాతంత్రానికి వ్యతిరేకంగా ఏ దేశం వ్యహరించినా అందుకు అనుమతించే ప్రసక్తే లేదు. ప్రజలు, భూభాగం కాపాడుకోవడం ఎమెరేట్స్ విధి. ఎలాటి దురాక్రమణలకు పాల్పడినా ప్రజలు, అల్లా సహాయంతో ఎదుర్కొంటాం' అని తాలిబన్ సర్కార్ పేర్కొంది.


అనిశ్చితి కొనసాగుతోంది: పాక్

కాగా, పాక్-అఫ్గాన్ మధ్య మూడో రౌండ్ శాంతి చర్యల్లో అనిశ్చితి నెలకొందని, ఎలాంటి ఒప్పదం కుదరలేదని పాక్ రక్షణశాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్‌ ధ్రువీకరించారు. నాలుగో రౌండ్‌కు సంబంధించి ఇంకా ఎలాంటి యోచన లేదని చెప్పారు.


మా సహనం పరీక్షించొద్దు: అఫ్గాన్ మంత్రి

మరోవైపు, అఫ్గాన్ సహనాన్ని పరీక్షించవద్దని ఆ దేశ గిరిజన, సరిహద్దు వ్యవహారాల శాఖ మంత్రి నూరుల్లా నూరి పాకిస్థాన్‌ను హెచ్చరించారు. పాక్ సాంకేతక సామర్థ్యంపై ఖ్వాజా అసిఫ్‌ మరీ ఎక్కువ ధీమాతో ఉన్నట్టు కనిపిస్తోందని, యుద్ధం అనేది వస్తే పిల్లల నుంచి పెద్దల వరకూ అఫ్గాన్ పౌరులు పోరాటానికి వెనుకాడరని హెచ్చరించారు.


గత కొద్దికాలంలో పాక్-అఫ్గాన్ సరిహద్దుల్లో దాడులు, ప్రతిదాడులతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కాల్పుల్లో ఇరువైపులా ప్రాణనష్టం జరిగింది. ఈ తరుణంలో తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకారం కుదిరినప్పటికీ ఎప్పుడు మళ్లీ యుద్ధం చోటుచేసుకుంటుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఉగ్రవాదుల ఏరివేత పేరుతో తమ సరిహద్దుల్లో దాడులు చేస్తున్న పాక్ ఆర్మీపై అఫ్గాన్ కూడా ప్రతిదాడులు జరుపుతోంది. భారతదేశం ఆదేశాల మేరకే తమపై తాలిబన్లు దాడులకు దిగుతున్నారని పాక్ అక్కసు వెళ్లగక్కుతోంది.


ఇవి కూడా చదవండి:

ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్

డీఎన్ఏ నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త జేమ్స్ డీ వాట్సన్ కన్నుమూత

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 08 , 2025 | 09:42 PM