Share News

మహానుభావా.. నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో

ABN , Publish Date - Jun 08 , 2025 | 12:58 PM

‘మహానుభావా.. నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో.. ఎప్పుడు ఎలాగుంటావో ఆ దేవుడికెరుక!. ఒకసారి చైనా తోలు తీస్తానంటావు. తెల్లారేసరికి చేతులెత్తేస్తావు. ఇంకోసారి రష్యాపై గర్జిస్తావు.

మహానుభావా.. నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో

  • టాకో ట్రంప్‌..

‘మహానుభావా.. నువ్వెప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటావో.. ఎప్పుడు ఎలాగుంటావో ఆ దేవుడికెరుక!. ఒకసారి చైనా తోలు తీస్తానంటావు. తెల్లారేసరికి చేతులెత్తేస్తావు. ఇంకోసారి రష్యాపై గర్జిస్తావు. మధ్యాహ్నానికే మాట మారుస్తావు. ఇక, ఇండియాను అయితే బెదిరించని రోజు లేదు... రోజుకు ఒక నిబంధన, వారానికి ఒక వాణిజ్య విధానం. ఇలాగైతే మా పెట్టుబడులు ఏం కాను?’ అంటున్నారు స్టాక్‌మార్కెట్‌ ఇన్వెస్టర్లు. ఇదంతా అంటున్నది అమెరికా అధ్యక్ష మహాశయ అయిన ట్రంప్‌ గురించే! ఆయన చంచల మనస్తత్వానికి కొత్తగా పెట్టిన పేరు ‘టాకో ట్రంప్‌’. విదేశీ వాణిజ్య విధానంపై రోజుకొక ప్రకటనతో ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న ట్రంప్‌ను ‘టాకోట్రంప్‌’ అంటూనే ‘చికెన్‌ అవుట్‌’ అంటున్నారు.


book9.jpg

‘చికెన్‌ అవుట్‌’ అంటే ఒక నిర్ణయం తీసుకున్న వెంటనే భయంతో మళ్లీ వెనక్కి తగ్గడం అన్నమాట. చైనా, ఐరోపా, ఆసియా దేశాల ఎగుమతులపై అధిక సుంకాలు విధించినప్పటికీ.. గడువును పదే పదే పొడిగించడం, వెనక్కినెట్టడం.. మళ్లీ కొన్ని సుంకాలను తగ్గించడం.. ప్రారంభంలో పెట్టిన డిమాండ్‌లను సవరించడం... వంటివన్నీ ట్రంప్‌ విదేశీ వాణిజ్య విధానంలో కనిపిస్తున్న అంశాలు. ఈ గందరగోళ నిర్ణయాలపై అమెరికాతో పాటు అనేక దేశాల్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన ఫైనాన్సియల్‌ టైమ్స్‌ కాలమిస్ట్‌ రాబర్ట్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌ తొలిసారిగా ‘టాకోట్రంప్‌’ అన్న పదబంధాన్ని వాడారు.


book9.3.jpg

ట్రంప్‌ చంచల మనస్తత్వంపై పీకల్లోతు కోపంతో ఊగిపోతున్న విమర్శకులకు ఆ కొత్తపదం పరమాన్నంలా అనిపించింది. ఇంకేముంది? టాకోట్రంప్‌.. టాకోట్రంప్‌.. అంటూ పలు కథనాలు, ప్రసంగాలలో విరివిగా వచ్చేసింది. మీమ్స్‌ అయితే చెప్పక్కర్లేదు. చికెన్‌ అవుట్‌, టాకోట్రంప్‌ అంటూ స్లోగన్స్‌తో టీషర్టులు, సైన్‌బోర్డులు, నేమ్‌ప్లేట్స్‌ వెల్లువెత్తాయి. ఇంతకూ టాకో అంటే ఏంటి? ఎందుకీ పేరు అంత క్లిక్‌ అయ్యిందంటే.. మన దగ్గర సమోసాలు ఎంత ఫేమస్సో.. అమెరికా పొరుగు దేశమైన మెక్సికోలో టాకోలు అంత ఫేమస్సు. చౌకధరల్లోనే అందరికీ లభిస్తాయవి. వీధుల్లో ఎక్కడ చూసినా అమ్ముతుంటారు.


అంటే చిల్లర వ్యాపారం లాంటిదన్న మాట. ట్రంప్‌ అసమర్ధ వాణిజ్య విధానాల వల్ల స్టాక్‌మార్కెట్‌ పడుతూలేస్తూ ఉంది. పెట్టుబడిదారులకు పప్పుబెల్లాల్లాంటి లాభాలే వస్తున్నాయి.. ఆ లాభం టాకోలు కొనుక్కునేంత చిల్లరలాంటిదన్న మాట. అందుకే ట్రంప్‌వన్నీ టాకోట్రేడ్‌ విధానాలే అన్న భావనతో ఆ పేరు పెట్టాడు రాబర్ట్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌. అమెరికాలోని ఓవల్‌ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఒక విలేఖరి టాకోట్రంప్‌ ట్రెండింగ్‌ గురించి ప్రస్తావించాడు. అందుకు స్పందించిన ట్రంప్‌ .. ‘ఓహ్‌ నేను కూడా ఆశ్చర్యపోయాను. అది బాగుంది కదా!.. ఇంతవరకూ నేనెప్పుడూ అలాంటి మాట వినలేదు...’ అన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. నిలకడగా బంగారం ధరలు..

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Jun 08 , 2025 | 12:58 PM