Zohran K Mamdani: వట్టి చేతులతో తింటావా! మమ్దానీపై ఎందుకింత అక్కసు?
ABN , Publish Date - Jul 01 , 2025 | 10:12 PM
భారత సంతతికి చెందిన న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై అక్కసు చూపించాలనుకొని, నెట్టింట నవ్వుల పాలవుతున్నాడు బ్రాండన్ గిల్. మమ్దానీపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తన అక్కసును వెళ్లగక్కాడు. ఇక ఇప్పుడు..

ఇంటర్నెట్ డెస్క్: భారత సంతతికి చెందిన న్యూయార్క్ నగర మేయర్ అభ్యర్థి జోహ్రాన్ మమ్దానీపై అక్కసు చూపించాలనుకొని, నెట్టింట నవ్వుల పాలవుతున్నాడు బ్రాండన్ గిల్. డెమోక్రాట్ పార్టీ తరపున మేయర్ గా మమ్దానీ బరిలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. మమ్దానీపై అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తన అక్కసును వెళ్లగక్కాడు. మమ్దానీ న్యూయార్క్ నగర మేయర్‌గా గెలిస్తే, ఒక్క రూపాయి కూడా నిధులు ఇవ్వనంటూ ట్రంప్ ప్రకటించారు. ఇక, ఇప్పుడు అమెరికాలోని అధికార రిపబ్లికన్ పార్టీకి, అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మద్దతుదారుడైన బ్రాండన్ గిల్, మమ్దానీ సాంస్కృతిక ఆచారాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
మమ్దానీ చేతితో భోజనం చేస్తాడంటూ అవహేళన చేశాడు. జోహ్రాన్ మమ్దానీ స్పూన్, ఫోర్క్ లతో కాకుండా, వట్టి చేతులతో అన్నం తింటున్న వీడియోను సోషల్ మీడియాలో బ్రాండన్ గిల్ పోస్ట్ చేశారు. ఆ వీడియోతో పాటు నాగరిక ప్రజలు అలా తినరని, పాశ్చాత్య ఆచారాలను అవలంబించాలని కోరుతూ ఒక కామెంట్ పెట్టాడు. అంతేకాదు, మీరు పాశ్చాత్య ఆచారాలను స్వీకరించడానికి నిరాకరిస్తే, మీ మూడవ ప్రపంచానికి తిరిగి వెళ్ళిపోండన్నాడు బ్రాండన్ గిల్.
అయితే, బ్రాండన్ గిల్ పోస్ట్ పై నెటిజన్లు తీవ్ర విమర్శలు, కౌంటర్లు సంధిస్తున్నారు. జాత్యహంకార వ్యాఖ్యని కొందరంటే, గిల్ భారత సంతతికి చెందిన మామ(భార్య తండ్రి) దినేష్ డిసౌజా గతంలో తన చేతులతో తింటున్న ఫోటోను నెటిజన్లు ఇప్పుడు తవ్వి తీసి జవాబిస్తున్నారు. 'టాకోస్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్స్ వంటివి ఎలా తింటారు? నువ్వు కూడా ఫోర్క్ తో లేస్ తింటావా? అంటూ ముప్పేట దాడి చేస్తు్న్నారు. మీ మామను కూడా ఇండియా పంపిస్తావా? అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇలా ఉంటే, గిల్ భార్య తన భర్తకు మద్దతుగా నిలిచింది. 'తానెప్పుడూ చేతులతో అన్నం తినలేదు. ఎల్లప్పుడూ స్పూన్, ఫోర్క్ ఉపయోగించా, నేను అమెరికాలో పుట్టాను. నేను క్రిస్టియన్‌ను. నా తండ్రి బంధువులు భారతదేశంలో నివసిస్తున్నారు. వారు కూడా క్రైస్తవులు. వారు ఫోర్కులను ఉపయోగించే భోజనం చేస్తారు' అని బ్రాండన్ గిల్ భార్య డేనియల్ డిసౌజా గిల్ చెబుతోంది.
ఇవి కూడా చదవండి:
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
For More Telangana News and Telugu News