Share News

Putin: ఉక్రెయిన్ మాదే..పుతిన్ సంచలన వ్యాఖ్యలు

ABN , Publish Date - Jun 21 , 2025 | 05:12 PM

రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని, ఉక్రెయిన్ తమకు తామే సమస్యలు సృష్టించుకుంటోందన్నారు.

Putin: ఉక్రెయిన్ మాదే..పుతిన్ సంచలన వ్యాఖ్యలు
Vladimir Putin

మాస్కో: రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ (Vladimir Putin) సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యన్లు, ఉక్రెయిన్లు ఒక్కటేనని, ఉక్రెయిన్ మొత్తం రష్యాదేనని అన్నారు. సరిహద్దుల వెంబడి ఉక్రెయిన్ నిరంతర షెల్లింగ్‌కు పాల్పడుతున్నందున సుమీ ప్రాంతంలో రష్యాబలగాలు మరింత ముందుకు వెళ్తాయని హెచ్చరించారు. పరిస్థితి తీవ్రంగా మారితే దాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం లేకపోలేదని చెప్పారు. సరిహద్దు వెంబడి సెక్యూరిటీ జోన్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నామని చెప్పారు.


రష్యాలోని సెయింట్ పీటర్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరంలో పుతిన్ మాట్లాడుతూ, ఉక్రెయిన్‌ను నాశనం చేసే ఉద్దేశం తమకు లేదని, ఉక్రెయిన్ తమకు తామే సమస్యలు సృష్టించుకుంటోందన్నారు. తన దృష్టిలో రష్యన్లు, ఉక్రెయిన్లు ఒకటేనన్నారు. ఉక్రెయిన్ నాటోలో చేరాలనే ఆకాంక్షలను వదులుకోవాలని, ఉక్రెయిన్ ఆక్రమిత ప్రాంతాలసపై మాస్కో నియంత్రణను అంగీకరించాలని అన్నారు. ఉక్రెయిన్ స్వతంత్రంగా మారిన 1991 ఒప్పందాన్ని గుర్తుచేసుకోవాలని అన్నారు. క్షేత్ర స్థాయిలో వాస్తవాలను, మాస్కో భౌగోళిక ప్రయోజనాలను గుర్తుంచుకోవాలని, తమ సైనిక చర్య తీవ్రం కాకముందే మాతో ఒప్పందానికి రావాలని పుతిన్ హెచ్చరించారు.


చర్చలకు సిద్ధమే కానీ ...

ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని నివాస ప్రాంతాలపై దాడులు చేస్తున్నారంటూ కొన్ని వర్గాలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ, తమ సైన్యం సైనిక స్థావరాలపైనే దాడులు చేస్తోందన్నారు. శాంతి చర్చలుకు తాము సిద్ధమేనని, అయితే చర్చల ఫలితాలపై చట్టబద్ధమైన అధికారులే సంతకం చేయాలని అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ అధ్యక్ష పదవీకాలం గత ఏడాది ముగిసిందని, మార్షల్ లా విధించడంతో అతని వారసుని ఎన్నుకోలేదని చెప్పారు. ఇప్పుడు ఒప్పందం చేసుకుని ఆ తర్వాత వచ్చే వాళ్లు కాదంటే ఏమి చేయాలని ప్రశ్నించారు. చట్టబద్ధమైన అధికారులతో సంతకం జరిగితే జెలెన్‌స్కీ చర్చలకు వచ్చినా తమకు అభ్యంతరం లేద్నారు.కాగా, ప్రస్తుత పరిణామాల ప్రభావం ఆర్థిక వృద్ధిపై పడనుందంటూ తన ప్రభుత్వంలో కొందరు హెచ్చరిస్తున్న విషయాన్ని పుతిన్ ప్రస్తావించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆర్థిక మాంద్యం పరిస్థితి రానీయమని అన్నారు.


ఇవి కూడా చదవండి..

9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను

For International News And Telugu News

Updated Date - Jun 21 , 2025 | 06:18 PM