Share News

PM Modi: స్నేహానికి తొలి ప్రాధాన్యం.. మాల్దీవులకు రూ.4,850 కోట్ల ఆర్థిక సాయం

ABN , Publish Date - Jul 25 , 2025 | 08:41 PM

ఈ ఏడాది భారత్-మాల్దీవులు మధ్య దౌత్య సంబంధాలు 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాయనీ, ఇరుదేశాల మధ్య సంబంధాలు అతి పురాతనమైనవని, గాఢమైన అనుబంధం కలిగినవని మోదీ చెప్పారు. రెండుదేశాల మారిటైమ్ హెరిటేజ్‌కు గుర్తుగా ఇరుదేశాల సంప్రదాయ పడవలున్న స్మారక స్టాంపులను ఈ సందర్భంగా విడుదల చేశారు.

PM Modi: స్నేహానికి తొలి ప్రాధాన్యం.. మాల్దీవులకు రూ.4,850 కోట్ల ఆర్థిక సాయం
Modi with Maldives president Mohammed Muizzu

మాలే: భారత్, మాల్దీవుల మధ్య ద్వౌపాక్షిక సంబంధాలు ఈనెల 24వ తేదీతో 60వ వసంతాలు పూర్తి చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల్లో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇరుదేశాల మధ్య మైత్రీ సంబంధాల ప్రాధాన్యతను పునరుద్ఘాటించారు. ద్వీప దేశంలో కీలక అభివృద్ధి ప్రాజెక్టులకు లైన్ ఆఫ్ క్రెడిట్ కింద రూ.4,850 కోట్ల ఆర్థిక సాయాన్ని కొనసాగిస్తామని ప్రకటించారు. మాల్దీవులు అధ్యక్షుడు మహమ్మద్ ముయిజ్జుతో కలిసి మీడియా సమావేశంలో శుక్రవారంనాడు పాల్గొన్నారు.


ఈ ఏడాది భారత్-మాల్దీవులు మధ్య దౌత్య సంబంధాలు 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్నాయనీ, ఇరుదేశాల మధ్య సంబంధాలు అతి పురాతనమైనవని, గాఢమైన అనుబంధం కలిగినవని మోదీ చెప్పారు. రెండుదేశాల మారిటైమ్ హెరిటేజ్‌కు గుర్తుగా ఇరుదేశాల సంప్రదాయ పడవలున్న స్మారక స్టాంపులను ఈ సందర్భంగా విడుదల చేశారు. ఇది తాము ఇరుగుపొరుగు దేశాలవారమని చెప్పడం మాత్రమే కాదని, కలిసి ప్రయాణిస్తు్న్నామనడానికి సంకేతమని మోదీ అన్నారు.


భారత్‌ అనుసరించే 'పొరుగుకే తొలి ప్రాధాన్యం' , 'మహాసాగర్' విధానాల్లో మాల్దీవులకు కీలక స్థానం ఉందని, రక్షణ సామర్థ్యాల బలోపేతానికి ద్వీప దేశానికి భారత్ ఎప్పుడూ మద్దతుగా నిలుస్తుందని మోదీ చెప్పారు. మాల్దీవులు తమకు అత్యంత విశ్వసనీయ మిత్రుడుని, ఇందుకు భారత్ గర్విస్తోందని అన్నారు. సంక్షోభం వచ్చినా, మహమ్మారులు ఎదురైనా మాల్దీవులకు అండగా భారత్ ఎప్పుడూ ముందుగా నిలుస్తోందని గుర్తుచేశారు.


మోదీ పర్యటన ప్రాధాన్యతను అధ్యక్షుడు ముయిజ్జు వివరిస్తూ, మాల్దీవులు 60వ ఇండిపెండెన్స్‌ డే జరుపుకుంటూ, భారత్‌తో దౌత్య సంబంధాల్లో 60 వసంతాలు పూర్తి చేసుకుంటున్న ప్రత్యేక సందర్భంలో మోదీ పర్యటిస్తుండం సంతోషంగా ఉందన్నారు. పలు కీలక రంగాల్లో ప్రధాన మంత్రి మోదీ, తాను ఎంఓయూలు కుదుర్చుకున్నామని చెప్పారు. వీటికితోడు రూ.4,850 కోట్ల క్రెడిట్ అగ్రిమెంట్ జరిగిందని, తమ ప్రభుత్వం కీలక రంగాల్లోని ప్రాధాన్యతా ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగిస్తామని చెప్పారు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో ఇరుదేశాలు వ్యూహాత్మక భాగస్వామ్యానికి, పరస్పర సహకారానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.


దీనికి ముందు, శుక్రవారం ఉదయం మాల్దీవులకు చేరుకున్న మోదీకి వెలెనా ఎయిర్‌పోర్టులో అధ్యక్షుడు ముయిజ్జు, మంత్రులు స్వాగతం పలికారు. అనంతరం సైనిక వందనాన్ని మోదీ స్వీకరించారు. ముయిజ్జు, మోదీ మధ్య జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


ఇవి కూడా చదవండి..

మాల్దీవులకు చేరుకున్న ప్రధాని మోదీ.. ఘన స్వాగతం పలికిన అధ్యక్షుడు

పాలస్తీనాను ప్రత్యేక దేశంగా గుర్తిస్తాము.. ఫ్రాన్స్ అధ్యక్షుడి ప్రకటన

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 08:47 PM