PM Modi: మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం
ABN , Publish Date - Mar 11 , 2025 | 08:48 PM
మారిషస్ నుంచి ఈ పురస్కారం అందుకున్న విదేశీయుల్లో మోదీ ఐదవ నేత అని ఈ సందర్భంగా నవీన్ రామ్‌గులాం ప్రశంసించారు. తనకు మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అందజేయడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

పోర్ట్ లూయిస్: భారత ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)కి మారిషస్ ప్రభుత్వం ఆ దేశ అత్యున్నత పురస్కారం''ది గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్'' అందజేసింది. మారిషస్ ప్రధానమంత్రి నవీన్ రామ్‌గులం చేతుల మీదుగా మోదీ మంగళవారంనాడు ఈ పురస్కారం అందుకున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును అందుకున్న తొలి భారతీయుడు మోదీనే కావడం విశేషం. ఇండియా-మారిషస్ మధ్య సంబంధాల పటిష్టతకు చేసిన విశేష కృష్టికి గాను మోదీకి ఈ అవార్డును ప్రదానం చేశారు. దీంతో ఇంతవరకూ మోదీ అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య 21కి చేరింది.
PM Modi: మారిషస్ అధ్యక్షుడు, ఆయన సతీమణికి మోదీ గిఫ్ట్‌లు
మారిషస్ నుంచి ఈ పురస్కారం అందుకున్న విదేశీయుల్లో మోదీ ఐదవ నేత అని ఈ సందర్భంగా నవీన్ రామ్‌గులం ప్రశంసించారు. తనకు మారిషస్ అత్యున్నత పౌర పురస్కారం అందజేయడంపై మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో వినమ్రంగా ఈ పురస్కారాన్ని తాను తీసుకుంటున్నానని, భారత్-మారిషస్ మధ్య చిరకాలంగా ఉన్న చారిత్రక బంధానికి దక్కిన గౌరవం ఇదని అన్నారు.
దీనికి ముందు, మారిషస్ దేశాధ్యక్షుడు ధరమ్ గోకుల్‌తో మోదీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ఆయన సతీమణికి అరుదైన బహుమతులను మోదీ అందజేశారు. ప్రయాగ్‌రాజ్ ఇటీవల ముగిసిన మహా కుంభమేళా నుంచి తీసుకువెళ్లిన పవిత్ర గంగాజలాన్ని ధరమ్ గోకుల్‌కు అందించారు. వారణాసి నుంచి తీసుకువచ్చిన ప్రత్యేక బనారస్ చీరను హస్తకళాకారులు అందంగా తీర్చిదిద్దిన ఒక పెట్టెలో ఉంచి ధరమ్ గోకుల్ సతీమణి బృందా గోకుల్‌కు బహుకరించారు. అధ్యక్ష దంపతులకు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా (ఓసీఐ) కార్డులను మోదీ అందజేశారు. మారిషస్ స్వతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొనేందుకు మోదీ మంగళవారంనాడు ఇక్కడకు విచ్చేశారు.
ఇవి కూడా చదవండి
Pakistan: రైలు హైజాక్.. బందీలుగా వందలాది ప్రయాణికులు
USA Deports Pak Diplomat: పాక్‌కు ఊహించని షాక్.. దౌత్యవేత్తకు అమెరికాలోకి అనుమతి నిరాకరణ
Read Latest and International News