Khawaja Asif: శాంతి చర్చలు ఫలించకుంటే యుద్ధమే.. అఫ్గాన్‌నిస్థాన్‌కు పాక్ మంత్రి వార్నింగ్..
ABN , Publish Date - Oct 25 , 2025 | 09:28 PM
దోహా చర్చల్లో అనుకున్నట్టే రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నదే శనివారం నాడు ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల ఎజెండాగా ఉందని ఏఎఫ్‌పీ తెలిపింది.
ఇస్లామాబాద్: అఫ్గానిస్థాన్ (Afghanistan)తో ఇస్తాంబుల్ (Istambul)లో జరుగుతున్న శాంతి చర్చల్లో ఒప్పందం కుదరకుంటే అది బహిరంగ యుద్ధానికి (Open War) దారితీస్తుందని పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ (Khawaja Asif) హెచ్చరించారు. 'చూడండి.. అఫ్గానిస్థాన్ శాంతిని కోరుకుంటూ, ఒప్పందం కుదుర్చుకోవడంలో విఫలమైతే.. దాని అర్థం బహిరంగ యుద్ధమే' అని రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ ఆయన అన్నారు. శనివారం నాడు ఇస్తాంబుల్‌లో రెండో విడత చర్చలు ప్రారంభమైన నేపథ్యంలో ఖవాజ్ ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
గత కొన్ని రోజులుగా రెండు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఘర్షణలు, దాడులు జరిగి పలువురు సైనికులు, పౌరులు, ఉగ్రవాదులు మరణించారు. దీంతో కాల్పుల విరమణకు పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ అంగీకరించాయి. రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే తొలుత రెండు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించినా రెండు రోజుల్లోనే మళ్లీ కాల్పులకు దిగాయి. దీనికి ఇస్లామాబాద్ కారణమని కాబూల్ ఆరోపించింది. దీంతో రెండోసారి కాల్పుల విరమణకు ఖతార్, టర్కీ మధ్యవర్తిత్వం వహించాయి.
కాగా, దోహా చర్చల్లో అనుకున్నట్టే రెండు దేశాల మధ్య శాంతి స్థాపనకు ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలన్నదే శనివారం నాడు ఇస్తాంబుల్‌లో శాంతి చర్చల ఎజెండాగా ఉందని ఏఎఫ్‌పీ తెలిపింది. చర్చల్లో పాల్గొనేందుకు అఫ్గాన్ డిప్యూటీ ఇంటీరియర్ మినిస్టర్ హాజీ నజీబ్ సారథ్యంలోని ప్రతినిధుల బృందం శుక్రవారం నాడు టర్కీ చేరుకుంది. పాకిస్థాన్ నుంచి ఇద్దరు భద్రతాధికారుల ప్రతినిధి బృందం చర్చల్లో పాల్గోనుంది. అఫ్గాన్ ప్రాదేశిక సమగ్రతను పరిరక్షణను తాలిబన్ ప్రభుత్వం కోరుకుంటుండగా, అఫ్గాన్ గడ్డ నుంచి పాకిస్థాన్‌కు ఎదురవుతున్న ఉగ్రవాద బెడదపైనే చర్చ జరగాలని పాక్ పట్టుబడుతోంది.
భారత్‌తో యుద్ధం పాక్‌కే నష్టం.. మాజీ సీఐఏ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి