Share News

US: రహస్యంగా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లను అభివృద్ధి చేస్తున్న పాక్

ABN , Publish Date - Jun 25 , 2025 | 04:21 PM

అమెరికాకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న, అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశాన్ని అయినా అమెరికా తన ప్రత్యర్థిగా ప్రకటిస్తుందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం రష్యా, చైనా, నార్త్ కొరియాలను అణ్వాయుధ ప్రత్యర్థులుగా అమెరికా భావిస్తోంది.

US: రహస్యంగా న్యూక్లియర్ బాలిస్టిక్ మిసైళ్లను అభివృద్ధి చేస్తున్న పాక్

వాషింగ్టన్: పాకిస్థాన్ (Pakistan) రహస్యంగా సుదూర లక్ష్యాలను ఛేదించే ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను (ICBM) అభివృద్ధి చేస్తున్నట్టు వాషింగ్టన్‌లోని అమెరికా నిఘా సంస్థలు వెల్లడించాయి. వీటికి అమెరికాలోని లక్ష్యాలను ఛేదించగలిగే సామర్థ్యం ఉంటుందని పేర్కొన్నాయి. జూలై-ఆగస్టులో పబ్లిష్ అయిన 'ఫారెన్ ఎఫైర్స్' మ్యాగజైన్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తర్వాత చైనా సాయంతో పాక్ తమ ఆయుధాలను అభివృద్ధి చేసుకోవాలని భావించినట్టు ఆ నివేదిక పేర్కొంది. అటువంటి ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పాక్ అభివృద్ధి చేయాలని ప్రయత్నిస్తే వాషింగ్టన్ ఆ దేశాన్ని అణ్వాయుధ ప్రత్యర్థిగా గుర్తిస్తుందని అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఆ నివేదిక వెల్లడించింది.


అమెరికాకు ముప్పు కలిగించే అవకాశం ఉన్న, అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏ దేశాన్ని అయినా అమెరికా తన ప్రత్యర్థిగా ప్రకటిస్తుందని నివేదిక తెలిపింది. ప్రస్తుతం రష్యా, చైనా, నార్త్ కొరియాలను అణ్వాయుధ ప్రత్యర్థులుగా అమెరికా భావిస్తోంది. పాకిస్థాన్ కనుక ఐసీబీఎంను అభివృద్ధి చేస్తే అణ్వాయుధ ప్రత్యర్థిగా పాక్‌ను భావించడం మినహా అమెరికాకు మరో మార్గం లేదని నివేదిక తెలిపింది.


పాకిస్థాన్ అణుసామర్థ్యం

తమ అణు కార్యక్రమం కేవలం ఇండియాను అడ్డుకునేందుకేనని పాకిస్థాన్ తరచు చెబుతూ వస్తోంది. స్వల్ప, మధ్య శ్రేణి క్షిపణులపైనే దృష్టిసారిస్తూ వస్తోంది. పాకిస్థాన్ వద్ద ప్రస్తుతానికైతే ఐసీబీఎంలు లేవు. ఐసీబీఎంలకు 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించే సామర్థ్యం ఉంటుంది.


పాకిస్థాన్ 2022లో ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే మధ్యస్థ శ్రేణి బాలిస్టిక్ క్షిపణి షాహీన్-3ని ప్రయోగించింది. ఇది 2,700 కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ఛేదిస్తుంది. ఆ ప్రకారం ఇండియాలోని కొన్ని సీటీలు ఈ రేంజ్‌లోకి వస్తాయి. గత ఏడాది పాకిస్థాన్ లాంగ్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి కార్యక్రమంపై అమెరికా పలు ఆంక్షలు పెట్టింది. పాక్ ఇలాంటి క్షిపణులు తయారు చేస్తే తమకు కూడా ముప్పని తెలిపింది. అయితే అమెరికా పక్షపాతంతో ఇలాంటి చర్యలు తీసుకుంటోందని పాక్ విమర్శించింది.


పాకిస్థాన్ సుమారు 170 న్యూక్లియర్ వార్‌హెడ్స్‌ను కలిగి ఉంది. అయితే న్లూక్లియర్ నాన్-ప్రొలిఫిరేషన్ ట్రియటీ (ఎన్‌పీటీ)లో సిగ్నేటరీగా లేదు. అణ్వాయుధ వ్యాప్తిని నిరోధించి, న్యూక్లియర్ ఎనర్జీని శాంతియుత ప్రయోజనాలకు ఉద్దేశించేలా చేయడమే ఎన్‌పీటీ లక్ష్యం. అయితే భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తర్వాత చైనా సాయంతో తమ ఆయుధాలను అభివృద్ధి చేసుకోవాలని పాక్ భావిస్తోందని అమెరికా నివేదిక చెబుతోంది.


ఇవి కూడా చదవండి..

కమాండర్ అభినందన్‌ను బంధించిన పాకిస్థాన్ మేజర్ హతం

ఇరాన్ అణు స్థావరాలపై అమెరికా దాడులు.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 06:59 PM