Lapu Lapu Day: ఉత్సవంలో జనం మీదికి కారు.. తొమ్మిది మంది మృతి..
ABN , Publish Date - Apr 27 , 2025 | 07:22 PM
ఎంతో ఆనందోత్సాహాలతో ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ కలిసి ఉత్సవాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఫుడ్ కోర్ట్స్, ఆట వస్తువులతో కన్నుల పండువగా ఉంటే, ఇంతలో వేగంగా వచ్చిన కారు..

Vancouver Filipino Festival: కెనడా దేశంలోని వాంకోవర్ నగరంలో జరుగుతోన్న ఫిలిప్పీనో(లాపు లాపు ) ఉత్సవంలో ఘోరం జరిగింది. సెలబ్రేషన్స్‌లో పాల్గొంటున్న జనంపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘోర ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా, చాలా మంది గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంకోవర్‌లో ఫిలిప్పీనో వారసత్వాన్ని తెలియచెబుతూ జరుపుకుంటున్న ఈ స్ట్రీట్ ఫెస్టివల్ లో ఒక డ్రైవర్.. కారును జనంపైకి పోనిచ్చాడు. ఈ దారణానికి కారణమైన సదరు కారు డ్రైవర్ ను అక్కడి జనం సాయంతో పోలీసులు అరెస్ట్ చేశారు.
డ్రైవర్ కు 30 ఏళ్ల వయసు ఉంటుందని చెబుతున్నారు. ఏప్రిల్ 26న రాత్రి 8:14 గంటలకు, తూర్పు 43వ అవెన్యూ, ఫ్రేజర్ స్ట్రీట్ సమీపంలో 'లాపు లాపు డే' ఫెస్టివల్‌కు హాజరైన పెద్ద జనసమూహంపైకి డ్రైవర్ కారును నడిపాడు. అతనికి నేర చరిత్ర ఉందా లేదా అనే దానితో సహా మరిన్ని వివరాలను ఇవ్వడానికి పోలీసులు నిరాకరించారు. అయితే, నిందితుడు ఒక్కడే ఈ పనికి పాల్పడ్డాడని పోలీసులు తేల్చారు. ఇది ఉగ్రవాద చర్య కాదని చెబుతున్నారు. డ్రైవర్ మానసిక స్థితిపైనా కెనడియన్ అధికారులు ఆరా తీస్తున్నారు.
సంస్కృతి, వైవిధ్యం పరిమళించే ఈ ఉత్సవాన్ని బ్రిటిష్ కొలంబియా ఫిలిప్పీనో సమాజం ప్రతి ఏడాదీ నిర్వహిస్తుంది. ఈ 'లాపు లాపు' దినోత్సవాన్ని స్పానిష్ వలసరాజ్యాలకు వ్యతిరేకంగా పోరాడిన స్వదేశీ నాయకుడు(లావు లావు)ని స్మరించుకుంటూ జరుపుకునేది. ఆరు బయట సాంప్రదాయ ఫిలిపినో నృత్యంలో ప్రదర్శనకారులు అలరిస్తుంటే, మొబైల్ ఫుడ్ స్టాల్స్ వీధుల్లో బారులు తీరుతూ ఉంటాయి. ఇలా ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి ఎంతో ఆనందంగా జరుపుకునే ఈ సంబరం భయానకంగా ముగియడం అందర్నీ కలిచివేసింది.
అయితే, ఘటన తర్వాత తీసిన జియోలొకేషన్ ఆధారిత ఫుటేజ్‌లో ఇరువైపులా చెల్లాచెదురుగా పడి ఉన్న ఫుడ్ స్టాల్స్, అత్యవసర సాయం కోసం అర్థిస్తున్న గాయపడ్డ వారి ఆర్తనాదాలు, బాధితులు, వాళ్ల కుటుంబసభ్యుల ఆహాకారాలు ఆ వీధి అంతా కనిపించాయి. పోలీసు అధికారి వాహనం కోసం వెతుకుతున్న క్రమంలో డ్రైవర్ సైడ్ డోర్ తెరిచి ఉన్న ఒక నల్లటి SUV రోడ్డు మధ్యలో కనిపించింది. బాధితులను రక్షించేందుకు ఘటనా స్థలానికి పారామెడికల్ సిబ్బంది, అంబులెన్స్‌లు, పోలీసు కార్డన్‌లు చేరుకుని సహాయక చర్యలు తీసుకున్నాయి.
ఈ ఘోర ఘటన తర్వాత ఫిలిప్పీన్స్ BC అనే కమ్యూనిటీ గ్రూప్, స్ట్రీట్ ఫెస్టివల్ ఉత్సవ నిర్వాహకులు Instagramలో ఒక ప్రకటనలో ఇలా రాశారు: “ఈ అర్థరహిత విషాదం వల్ల కలిగిన లోతైన హృదయ విదారకాన్ని వ్యక్తీకరించడానికి మాకు మాటలు దొరకడం లేదు.. బాధిత కుటుంబాలు, బాధితుల పట్ల మేము తీవ్ర దిగ్భ్రాంతి చెందాము.” అని వాపోయారు.
సోమవారం జరిగిన సమాఖ్య ఎన్నికలకు ముందు ఈ సంఘటన జరిగింది. కెనడా న్యూ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు జగ్మీత్ సింగ్ ఉత్సవానికి హాజరయ్యారు కానీ ఘటనకు కొన్ని క్షణాల ముందు వెళ్లిపోయారు. కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ X(సోషల్ మీడియా మాధ్యమం)లో చేసిన ప్రకటనలో మృతులు, గాయపడిన వారికి సంతాపం వ్యక్తం చేశారు. ఈ దాడిని “భయంకరమైనది” అని అభివర్ణించారు.
చనిపోయిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి, ఫిలిప్పీన్స్ కెనడియన్ సమాజానికి, వాంకోవర్ దుర్ఘటన బాధితులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేమందరం మీతోపాటు బాధ అనుభవిస్తున్నాం” అని ఆయన చెప్పారు.
Read Also: Indian Navy: మిసైల్స్ పరీక్షలు సక్సెస్.. యుద్ధానికి సిద్ధంగా నావికా దళం..
NIA To Probe Pahalgam Attack: పహల్గాం దాడిపై దర్యాప్తు బాధ్యతను ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
Hanif Abbasi Threatens India: 130 అణుమిసైళ్లను భారత్ వైపు గురిపెట్టి రెడీగా ఉంచాం: పాక్ మంత్రి