National Guardswoman: నేషనల్ గార్డ్స్ ఉమెన్.. 20 ఏళ్ల సారా బెక్‌స్ట్రోమ్ మరణించింది: డోనాల్డ్ ట్రంప్
ABN , Publish Date - Nov 28 , 2025 | 08:49 AM
అమెరికాకు చెందిన నేషనల్ గార్డ్స్ ఉమెన్.. 20 ఏళ్ల సారా బెక్‌స్ట్రోమ్ చివరికి ప్రాణాలొదిలింది. వైట్ హౌస్ సమీపంలో ముష్కరుడు జరిపిన కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు సైనికుల్లో సారా ఒకరు. మరో సైనికుడు ఆస్పత్రిలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
వాషింగ్టన్, నవంబర్ 28: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌కు అతి సమీపంలో నేషనల్ గార్డ్స్‌పై జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఒక సైనికురాలు ప్రాణాలొదిలింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ థాంక్స్ గివింగ్ వీడియో కాల్‌లో ఈ విషయం ప్రకటించారు. వైట్ హౌస్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు నేషనల్ గార్డ్ సైనికుల్లో ఒకరు మరణించారని, మరొకరి పరిస్థితి విషమంగా ఉందని ట్రంప్ తెలిపారు.
మరణించిన 20 ఏళ్ల నేషనల్ గార్డ్స్ సైనికురాలు సారా బెక్‌స్ట్రామ్‌ను అత్యంత గౌరవనీయమైన, యువ, అద్భుతమైన వ్యక్తి గా ట్రంప్ అభివర్ణించారు. దేశవ్యాప్తంగా థాంక్స్ గివింగ్ ఉత్సవాలు జరుగుతున్న సమయంలో ఈ ఘటన దేశాన్ని విచారంలో ముంచిందని ట్రంప్ చెప్పారు. సారా బెక్‌స్ట్రామ్ మృతి పట్ల అమెరికా అధికారులు, నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అమెరికా అధ్యక్ష భవనానికి అతి సమీపంలో నేషనల్ గార్డ్స్‌పై జరిగిన కాల్పులతో అగ్రరాజ్యం ఉలిక్కిపడింది. ఈ ఘటనతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దేశంలోని గ్రీన్‌కార్డ్ హోల్డర్స్‌పై దృష్టిపెట్టారు. 19 దేశాలకు చెందిన గ్రీన్ కార్డు హోల్డర్స్‌ను మరోసారి సమీక్షించాలని అధికారుల్ని ట్రంప్ ఆదేశించారు.
దీంతో.. అఫ్గాన్‌తో సహా మరో 18 దేశాలకు చెందిన గ్రీన్ కార్డ్ హోల్డర్స్‌ను సమీక్షించనున్నట్లు యూఎస్ సిటిజన్‌షిప్, ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించింది. అధ్యక్షుడి ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
గతంలో ట్రంప్ యూఎస్‌కు వచ్చే 12 దేశాల పౌరుల రాకపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులపై సంతకం చేశారు. అందులో అఫ్గానిస్థాన్, ఇరాన్, యెమెన్, మయన్మార్, చాద్, కాంగో, ఈక్వెటోరియల్ గినియా, ఎరిట్రియా, హైతీ, లిబియా, సోమాలియా, సూడాన్ దేశాలు ఉన్నాయి. వీటితో పాటు మరో ఏడు దేశాల ప్రయాణికులపైనా పాక్షికంగా నిషేధం విధించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజకీయ నినాదాలు కాదు.. వివక్షకు ఆధారాలు చూపాల్సిందే
ముఖ్యమంత్రా.. రియల్ ఎస్టేట్ ఏజెంటా..?
Read Latest Telangana News and National News