Share News

PM Modi: ఉగ్రవాదంపై రెండు నాల్కలు

ABN , Publish Date - Jun 19 , 2025 | 05:25 AM

ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న దేశాలకు రివార్డులిస్తున్నారని ప్రధాని మోదీ అగ్రదేశాలను విమర్శించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎండగట్టారు.

PM Modi: ఉగ్రవాదంపై రెండు నాల్కలు

  • టెర్రరిజానికి మద్దతిచ్చే వారికి రివార్డులా?

  • అగ్రదేశాలపై విసుర్లు ఉగ్రవాదానికి ఊతమిచ్చే

  • వారికి శిక్ష పడాల్సిందే జీ7 సదస్సులో మోదీ

  • ఆయా దేశాధినేతలతో భేటీ

ఆల్బెర్టా(కెనడా), జూన్‌ 18: ఉగ్రవాదాన్ని బహిరంగంగా సమర్థిస్తున్న దేశాలకు రివార్డులిస్తున్నారని ప్రధాని మోదీ అగ్రదేశాలను విమర్శించారు. ఈ విషయంలో ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారని ఎండగట్టారు. బుధవారం కెనడాలోని ఆల్బెర్టాలో కననాస్కి్‌సలో జి-7 దేశాల రెండో రోజు సదస్సులో ప్రసంగించారు. ఉగ్రవాదంపై భారత దృఢవైఖరిని విశదీకరించారు. ప్రపంచదేశాలన్నీ ఐక్యంగా చర్యలు తీసుకోవాలని, రెండు నాల్కల ధోరణి తగదని హితవు పలికారు. టెర్రరిజాన్ని ప్రోత్సహించే, మద్దతిచ్చే దేశాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ఆయా దేశాలు పర్యవసానాలను ఎదుర్కోక తప్పదు.ఏ దేశమైనా ఉగ్రవాదానికి మద్దతిస్తే అది మూల్యం చెల్లించుకోవలసిందే’ అని తేల్చిచెప్పారు.


ఈ సందర్భంగా ఉగ్రవాదంపై అంతర్జాతీయంగా తీసుకుంటున్న చర్యలు ద్వంద్వప్రమాణాలతో ఉంటున్నాయని ఆక్షేపించారు. ‘ఓవైపు.. మన అవసరాలకు అనుగుణంగా హడావుడిగా అన్ని రకాల ఆంక్షలు విధించేందుకు పూనుకుంటాం. మరోవైపు.. బహిరంగంగా టెర్రరిజానికి మద్దతిచ్చే దేశాలకు రివార్డులు లభిస్తున్నాయి’ అని వ్యాఖ్యానించారు. పహల్గాంలో ఉగ్రవాద దాడిని ఖండించిన జి-7 దేశాలకు ప్రధాని ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఇదిలా ఉండగా, మోదీ అత్యుత్తమ ప్రధాని అని.. ఆయనలా ఉండేందుకు ప్రయత్నిస్తున్నానని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆయనతో భేటీ సందర్భంగా అన్నారు. ఆయన నవ్వుతూ ‘థమ్స్‌ ఆప్‌’ సంకేతమిచ్చారు. వారి సంభాషణ వీడియో వైరల్‌గా మారింది.

Updated Date - Jun 19 , 2025 | 05:42 AM