Share News

Russia Earthquake: రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం

ABN , Publish Date - Jul 31 , 2025 | 03:49 AM

రష్యా తూర్పు కొసన ఉన్న కమ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో సముద్రంలో భారీ భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం

Russia Earthquake: రష్యాలో 8.8 తీవ్రతతో భారీ భూకంపం

  • ఊగిపోయిన కమ్చాట్కా ద్వీపకల్పం.. పసిఫిక్‌ తీర ప్రాంత దేశాలకు సునామీ హెచ్చరిక

  • రష్యా, జపాన్‌, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో చిన్నపాటి సునామీలు

  • ముందు జాగ్రత్తలతో తప్పిన ప్రాణ నష్టం.. తీర ప్రాంతాల నుంచి వేలాది మంది తరలింపు

టోక్యో, జూలై 30: రష్యా తూర్పు కొసన ఉన్న కమ్చాట్కా ద్వీపకల్పం సమీపంలో సముద్రంలో భారీ భూకంపం వచ్చింది. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 7 గంటల సమయంలో ఏకంగా 8.8 మ్యాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. దీనితో కమ్చాట్కా ద్వీపకల్పం ఊగిపోయింది. చుట్టూ వందల కిలోమీటర్ల దూరంలోని ప్రాంతాలకూ ఈ ప్రకంపనలు విస్తరించాయి. దీనికితోడు 6, 7 తీవ్రతతో వచ్చిన మరికొన్ని ప్రకంపనలు.. పసిఫిక్‌ తీర ప్రాంత దేశాల్లో సునామీ భయాన్ని రేకెత్తించాయి. 20 ఏళ్ల కింద హిందూ మహా సముద్రంలో, 14 ఏళ్ల కింద జపాన్‌ సమీపంలో భూకంపాలతో వచ్చిన భారీ సునామీల వంటివి రావొచ్చనే కలకలం చెలరేగింది. దీనితో భూకంప ప్రాంతానికి సమీపంలోని దేశాలు.. ప్రజలను తీర ప్రాంతాల నుంచి దూరంగా తరలించాయి. కానీ రష్యా తూర్పు తీరంలో నాలుగు మీటర్ల ఎత్తున, జపాన్‌, అమెరికాలోని హవాయ్‌, అలాస్కా, పశ్చిమ తీర ప్రాంతాల్లో, ఫిలిప్పీన్స్‌లలో మీటరు ఎత్తున చిన్నపాటి సునామీ అలలు మాత్రమే వచ్చాయి. సముద్ర తీరంలోని నిర్మాణాలు స్వల్పంగా దెబ్బతినడం, బోట్లు కొట్టుకుపోవడం వంటి నష్టం జరిగింది. దీనితో సునామీ హెచ్చరికలను వెనక్కి తీసుకున్నారు. తీర ప్రాంతాల్లో ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయడంతో ఎక్కడా ప్రాణనష్టం జరగలేదు. రష్యా, జపాన్‌ మాత్రం పదుల సంఖ్యలో జనం గాయపడినట్టు ప్రకటించాయి. అయితే మళ్లీ భూకంపం వచ్చే అవకాశం ఉందన్న నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో.. పసిఫిక్‌ తీర ప్రాంత దేశాలు అప్రమత్తంగా ఉండాలన్న సూచనలు వెలువడ్డాయి. మరోవైపు రష్యాలో ప్రస్తుత భూకంప ప్రాంతానికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘క్ల్యుచెవ్‌స్కోయ్‌’ అగ్నిపర్వతం బుధవారం సాయంత్రం బద్దలైంది. ఈ అగ్నిపర్వతం భారీ పేలుళ్లతో లావాను వెదజల్లుతోందని రష్యా భూతత్వ పరిశోధన సంస్థ ప్రకటించింది. ఇక రష్యాలో భారీ భూకంపం వచ్చిన కొన్ని గంటల్లోనే టిబెట్‌లో హిమాలయ పర్వతాలకు సమీపంలో 4.3 తీవ్రతతో భూకంపం వచ్చింది.


gdfn.jpg

అంత భారీ భూకంపం అయినా..

2011 మార్చిలో జపాన్‌ను వణికించిన, ఫుకుషిమా అణు విద్యుత్‌ ప్లాంట్‌ ప్రమాదానికి గురైన భూకంపం (9.1 తీవ్రత) తర్వాత.. ప్రస్తుతం కమ్చాట్కా ద్వీపకల్పంలో వచ్చిన భూకంపమే అతి పెద్దది కావడం గమనార్హం. అంతకుముందు 1960లో చిలీలోని బయోబియెలోఓ 9.5 తీవ్రతతో, 1964లో అమెరికాలోని అలాస్కాలో 9.2 తీవ్రతతో భూకంపాలు వచ్చాయి. 2004లో ఇండోనేషియా సమీపంలో హిందూ మహా సముద్రంలో 9.1 తీవ్రతతో వచ్చిన భూకంపం.. అతి భారీ సునామీకి కారణమై, భారత్‌ సహా దక్షిణ, ఆగ్నేయాసియా దేశాల్లో రెండున్నర లక్షల మంది మృతికి కారణమైంది. కాగా తాజాగా రష్యాలో వచ్చిన భూకంపం జపాన్‌ మంగా ఆర్టిస్ట్‌ రియో టట్సుకి కాలజ్ఞానాన్ని మళ్లీ తెరపైకి తెచ్చింది. జూలై 5న జపాన్‌లో భారీ భూకంపం వస్తుందని రియో టట్సుకి గతంలో పేర్కొన్న నేపథ్యంలో తీవ్రకలకలం చెలరేగింది. ఆమె చెప్పిన భూకంపం ఇదేననే వాదనలు వినిపిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

తప్పు చేస్తే జగన్ అరెస్ట్ కావడం ఖాయం: ఏపీ బీజేపీ చీఫ్

ఈ ఆకును నాన్ వేజ్‌తో కలిపి వండుకుని తింటే ..

For More International News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 03:54 AM